Goshamahal MLA Raja Singh | రాజాసింగ్ యూటర్న్? షా పిలుపు కోసం ఎదురుచూపు!

Goshamahal MLA Raja Singh | హైదరాబాద్, జూలై 30 (విధాత): బీజేపీ హైకమాండ్ వైపు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చూస్తున్నారా? రాజీనామాను పార్టీ నాయకత్వం ఆమోదిస్తుందని అసలు ఊహించని ఆయన.. హైకమాండ్ నుంచి పిలుపు వస్తుందని ఆశిస్తున్నారా? అధిష్ఠానం ఒప్పుకొంటే మళ్లీ పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధపడుతున్నారా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తున్నది. కమలం పార్టీ పెద్దలు తన అభిప్రాయాలను సానుకూలంగా వింటే పార్టీలోకి తిరిగి రావడానికి ఆసక్తిగా ఉన్నారనే ప్రచారం తెరమీదికి వచ్చింది.
అమిత్ షా అపాయింట్ మెంట్ కోసం రాజాసింగ్
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎన్. రామచందర్ రావు పేరును డిసైడ్ చేయడంతో పార్టీకి రాజాసింగ్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దానిని అధిష్ఠానం ఆమోదించింది. ఇప్పుడు మళ్లీ బీజేపీలో చేరే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తున్నది. కేంద్ర మంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ కోసం రాజాసింగ్ ప్రయత్నిస్తున్నారని సమాచారం. రెండు రోజుల క్రితం రాజాసింగ్ కు అమిత్ షా ఫోన్ చేసినట్టు ప్రచారం సాగింది. ఇందులో వాస్తవం లేదని రాజాసింగ్ ప్రకటించారు. అమిత్ షా అపాయింట్‌మెంట్ ఇస్తే రాష్ట్రంలో పార్టీ పరిస్థితులను వివరించాలని రాజాసింగ్ భావిస్తున్నారని తెలిసింది. రాజీనామా చేయడానికి ఒక్క రోజు ముందు హైదరాబాద్ కు అమిత్ షా వచ్చినప్పుడు ఇదే విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారని, సమయం కేటాయించాలన్న విజ్ఞప్తికి ఆయన సానుకూలంగా స్పందించారని తెలుస్తున్నది. ఇదే ఆశతో ఉన్న రాజాసింగ్.. తనకు త్వరలోనే అపాయింట్‌మెంట్ లభిస్తుందన్న నమ్మకంతో ఉన్నారని సమాచారం.
పదవులన్నీ వాళ్లకేనా?
గోషామహల్ అసెంబ్లీ స్థానం నుంచి వరుసగా రాజాసింగ్ గెలిచారు. ఈ నియోజకవర్గంలో కార్పొరేటర్ పదవుల నుంచి పార్టీ పదవులు కూడా తాను సూచించినవారికి దక్కలేదనే అసంతృప్తి కూడా రాజాసింగ్‌కు ఉందని చెబుతున్నారు. కొన్ని సమయాల్లో ఈ విషయమై మీడియాలో కూడా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలో ప్రజా ప్రతినిధులు, పార్టీ కీలక పదవుల్లో ఉన్నవారంతా తనతో అంటీముట్టనట్టుగా ఉంటారనేది ఆయన భావనగా ఉందనేది ప్రచారంలో ఉంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి కొనసాగిన సమయంలో ఆయనతో రాజాసింగ్ కు పొసగలేదనే వాదనలు ఉన్నాయి. లక్ష్మణ్ బీజేపీ బాధ్యతలు చేపట్టిన సమయంలో ఆయనతో కొంత సఖ్యతగా ఉన్నారనే ప్రచారం ఉంది. బండి సంజయ్‌తోనూ మంచి సంబంధాలే ఉన్నాయని అంటారు. ఇటీవల ఈ ఇద్దరి మధ్య గ్యాప్ ఉందనే ప్రచారం కూడా సాగుతోంది. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి ఫైటర్ కావాలనేది రాజాసింగ్ వెర్షన్. రామచందర్ రావు మంచి రైటర్ తప్ప.. ఫైటర్ కాదని రాజాసింగ్ అంటున్నారు. తెలంగాణలో బీజేపీకి మెరుగైన ఫలితాలు రాకపోవడానికి పార్టీలో కొందరు నాయకులు అనుసరించే వైఖరే కారణమని రాజాసింగ్ ఆరోపిస్తున్నారు. తమ వ్యక్తిగత ఎజెండా కోసం పార్టీని ఇబ్బందిపెడుతున్నారనేది ఆయన వెర్షన్. అయితే రాజాసింగ్ వెర్షన్ ను పార్టీ నాయకులు తోసిపుచ్చుతున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా రాజాసింగ్ పై బీజేపీ నాయకత్వం సస్పెన్షన్ వేటు వేసింది. అభ్యర్థులను ప్రకటించడానికి గంట ముందు ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేసింది. ఇప్పుడు కూడా అదే జరుగుతందనే నమ్మకంతో ఆయన ఉన్నారనే చర్చలు నడుస్తున్నాయి.
యోగితో మంచి సంబంధాలు
యూపీ సీఎం ఆదిత్యనాథ్‌తో రాజాసింగ్‌కు మంచి సంబంధాలున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా యోగి గోషామహల్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. కానీ.. ఇతర నాయకులతో తగిన స్థాయిలో సంబంధాలు లేకపోవడం రాజాసింగ్‌కు నష్టం చేసిందనే వాదనలు వినిపిస్తున్నాయి.
జూబ్లీహిల్స్ లో ప్రచారం చేస్తా
రాజీనామా చేసినా కూడా రాజాసింగ్ కార్యాలయంలో బీజేపీ గుర్తు ఉన్న ఫ్లెక్సీ అలానే ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తనను ప్రచారం చేయాలని బీజేపీ నాయకత్వం కోరితే సిద్దంగా ఉన్నానని ఆయన ఓ మీడియా చానెల్ ఇంటర్వ్యూలో చెప్పారు. గోషామహల్ ఉప ఎన్నిక గురించి ప్రస్తావిస్తే.. ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేయలేదని అలాంటిది ఉప ఎన్నిక ఎలా వస్తుందని ఆయన ప్రశ్నిస్తున్నారు. పార్టీకి రాజీనామా చేసిన సమయంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్దంగా ఉన్నానని ఆయన ప్రకటించారు. కానీ, తాజాగా ఆయన మాటలను బట్టి చూస్తే మనసు మారినట్టు కనిపిస్తున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.