Warangal : వరంగల్లో మార్వాడి గో బ్యాక్ నిరసన
వరంగల్‌లో సెల్ రిపేర్ యజమానుల నిరసన: మార్వాడీలు వెళ్ళిపోవాలని నినాదాలు, స్థానిక పోలీసులు ముందస్తు చర్యలు.

సెల్ రిపేర్ యజమానుల ఆందోళన
Warangal | విధాత, వరంగల్ ప్రతినిధి: మార్వాడీ గో బ్యాక్ ఆందోళన సెగ వరంగల్ నగరానికి తాకింది. మార్వాడి గో బ్యాక్ నినాదంలో భాగంగా ఓయూ జేఏసీ శుక్రవారం రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చిన సందర్భానికి వరంగల్ నగరంలోని కొందరు వ్యాపారులు సానుకూలంగా స్పందించారు. మార్వాడీల హోల్సేల్, డూప్లికేట్ వ్యాపారం వల్ల తమ జీవనోపాధి దెబ్బతింటుందంటూ స్థానిక సెల్ రిపేర్ యజమానుల అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సెల్ల వ్యాపారము రిపేరింగ్ ఎక్కువగా జరిగే నగరంలోని డాల్ఫిన్ గల్లీలో ధర్నాకు దిగారు. మార్వాడీలు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటూ నినాదాలు చేశారు. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు అక్కడికి చేరుకుని ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. స్థానిక వ్యాపారులు నిర్వహించిన నిరసనకు అనుమతి లేదంటూ అసోసియేషన్ సభ్యులను మట్వాడ పోలీసులు స్టేషన్ కు తరలించారు.