KCR | అధికారం రాగానే.. కేసీఆర్‌లో మార్పు! ఆత్మస్తుతి పరనింద తీరు మారేనా?: పార్ట్ 2

(రవి సంగోజు)
తెలంగాణ ఉద్యమకాలమంతా కేసీఆర్‌కు ప్రజలు అన్ని విధాలుగా అండగా నిలిచారు. ఆయన చేసిన తప్పొప్పులను సవరిస్తూనే రాష్ట్ర సాధనకు ప్రాధాన్యమిచ్చిన మాట వాస్తం. లక్ష్యం కోసం కేసీఆర్‌పై విమర్శలకు తావివ్వకూడదనే సూత్రం పాటించారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం జరిగిన ఎన్నికల్లో అప్పటి వరకు ఉద్యమ పార్టీగా ఉన్న టీఆర్ఎస్‌ను ఫక్తు రాజకీయ పార్టీగా పేర్కొంటూ వచ్చారు. ఆ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా తెలంగాణ ఉద్యమ వ్యతిరేకులకు టికెట్లు కేటాయించారు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ సాధారణ మెజారిటితో గెలుపొందింది. అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి కేసీఆర్‌లో తీవ్రమైన మార్పులు కనిపించాయి. అప్పటి వరకు తాను చెప్పిన పద్ధతులు, ప్రజా సమస్యలను, మాట్లాడిన మాటలను, చెప్పిన విలువలకు తూట్లు పొడుస్తూ ఒక్కో అడుగేస్తూ వచ్చారు.
తెలంగాణ అస్థిత్వం.. సంస్కృతికి తూట్లు
పాలనాపరమైన అంశాలను పక్కనపెడితే పద్నాగేళ్ళు పదేపదే చెప్పిన తెలంగాణ ఆత్మగౌరవం, భాష, యాస, సంస్కృతి, అస్థిత్వ పరిరక్షణకు పాలనలో స్థానం లేకుండా పోయింది. అధికారమొక్కటే లక్ష్యంగా మారింది. ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తున్నారనే పేరుతో ‘ఫిరాయింపుల’కు తెరతీశారు. తెలంగాణ రాష్ట్రంలో బలపడుతాయనుకున్న రాజకీయ విలువలకు తిలోదకాలిచ్చారు. ఇక రెండవసారి ముందస్తు ఎన్నికలతో మరింత మెజార్టీ సాధించినప్పటికీ ఫిరాయింపుల పర్వానికి తెరలేపి రాజకీయాలను అధఃపాతాళానికి చేర్చారు. ముఖ్యంగా తెలంగాణ వ్యతిరేకులు, ఉద్యమకారులపై యుద్ధం చేసిన వారికి తొలి ప్రాధాన్యం దక్కింది. పాత రోత బాటలో పయనించారు. ఉద్యమంలో పాల్గొన్నవారికి రెండవ స్థానం దక్కింది. లోటుపాట్లు పక్కనపెడితే కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినప్పటికీ పార్టీ యేళ్ళుగా చెప్పిన వాటిని విస్మరిస్తూ వచ్చారు. అన్నింటిలో బీటీ బ్యాచ్‌దే ఆధిపత్యం కన్పించింది.
దీన్ని తెలంగాణవాదులు జీర్ణించుకోలేక పోయారు. దీని కన్నా పదేండ్ల పాలనలో ‘స్వేచ్ఛ’కు సంకెళ్ళు బిగించారు. నోరెత్తితే కటకటాలపాలు చేశారు. కనీస నిరసనలకు తావులేకుండా పోయింది. తెలంగాణలో తీవ్ర అప్రకటి నిర్బంధం అమలైంది. ప్రజా సంఘాలపై అణచివేత కొనసాగించారు. తత్ఫలితంగా తెలంగాణలో తొలి నుంచి ఉండే పౌర సమాజం నోరు మూతపడింది. నిరుద్యోగులకు నోటిఫికేషన్లు తప్ప ఉద్యోగాలు దక్కలేదనేది బహిరంగ సత్యం. దీన్ని ప్రజలు సహించలేక పోయారు. ఈ కారణంగానే సంక్షేమం ఎలా ఉన్నా కేసీఆర్ సర్కారు నియంతృత్వ విధానాలకు చరమ గీతం పాడుతూ.. బలహీనంగా ఉన్న కాంగ్రెస్‌ను బలోపేతం చేస్తూ ఎన్నికల్లో ప్రజలు అటువైపు మొగ్గు చూపారు. బీఆరెస్‌గా పార్టీ పేరు మార్చి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుదామనుకున్నారు. తీరా తెలంగాణలో ఓటమి తర్వాత తమదే ఇంటిపార్టీ, ప్రాంతీయ పార్టీ అంటూ మళ్ళీ పాత రాగమెత్తుకున్నారు. నేతి బీరలో నేయి లేనట్లు బీఆర్ఎస్‌లో ఆ పార్టీ ‘తెలంగాణ అస్థిత్వానికి’ ప్రాధాన్యం తగ్గుతూ రావడం శాపంగా మారింది.
KCR | అదే మాట.. అదే పాట..కేసీఆర్ బాట! ఆత్మస్తుతి పరనింద తీరు మారేనా?: పార్ట్ 1
KCR | ప్రతి పక్ష పాత్రలో కూడా కనిపించని తేడా.. ఆత్మస్తుతి పరనింద తీరు మారేనా?: పార్ట్ 3