చెన్నూరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను సింగరేణిపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టు చేసేందుకు పోలీసులు తెలంగాణ భవన్ కు వెళ్లారు. ఆయనను అదుపులోకి తీసుకుని ఈ రోజు నాంపల్లి కోర్టుకు తరలించాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో సుమన్ అరెస్టును అడ్డుకునేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా తెలంగాణ భవన్ చేరుకోవడంతో పోలీసులు సైతం భారీ సంఖ్యలో మోహరించారు. ఇటీవల ఓ సమావేశంలో బాల్క సుమన్ మాట్లాడుతూ సింగరేణిలో మిలిటెంట్ యాక్టివిటీ చేయాలని, జీఎం కార్యాలయాన్ని, నాంపల్లి సింగరేణి భవన్ ను తగలబెట్టాలని, రైలు పట్టాలు కోసివేయాని శాంతిభద్రతలకు విఘాతం కల్గించే రీతిలో వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
సుమన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్, బీజేపీ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. సుమన్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ పలుచోట్ల పోలీసు ఫిర్యాదులు సైతం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు సుమన్ ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచేందుకు ప్రయత్నిస్తున్నారు.
అంతకుముందు సుమన్ క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా జరిగిన ఘర్షణ కేసులో ఫిబ్రవరి 18న అరెస్ట్, జైలుకు వెళ్లడం, మార్చి 4న బెయిల్ పై విడుదల కావడం తెలిసిందే.
