కేబినెట్ అజెండాలో కరోనాది 33 వ అంశమా?.. చంద్రబాబు
విధాత: కరోనా విషయంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నారని ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన సమస్య కరోనా అని ఇలాంటి సమస్యను కేబినెట్ అజెండాలో 33 వ అంశంగా చర్చించడం దారుణమన్నారు. వేల కోట్ల రూపాయలను వృథా చేసిన సీఎం జగన్ ప్రజల ప్రాణాలు కాపాడే వ్యాక్సిన్ కోసం రూ.1600 కోట్లు ఖర్చు పెట్టలేరా అని ప్రశ్నించారు. బుధవారం ప్రభుత్వ కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత […]

విధాత: కరోనా విషయంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నారని ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన సమస్య కరోనా అని ఇలాంటి సమస్యను కేబినెట్ అజెండాలో 33 వ అంశంగా చర్చించడం దారుణమన్నారు. వేల కోట్ల రూపాయలను వృథా చేసిన సీఎం జగన్ ప్రజల ప్రాణాలు కాపాడే వ్యాక్సిన్ కోసం రూ.1600 కోట్లు ఖర్చు పెట్టలేరా అని ప్రశ్నించారు.
బుధవారం ప్రభుత్వ కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత టిడిపి ఎమర్జెన్సీ పొలిట్ బ్యూరో సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని కరోనా పై సమగ్రంగా చర్చించారు. కరోనా విషయంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నిర్లక్ష్య ధోరణి వల్ల ప్రజలు పడుతున్న బాధలు వర్ణనాతీతం. ఇవి చూస్తుంటే.. కడుపు తరుక్కుపోతోంది. ప్రజలు పడుతున్న కష్టాలు, ఇబ్బందుల పట్ల ఒక అనుభవం కలిగిన వ్యక్తిగా, ఎన్నో విపత్తులను ఎదుర్కొన్న పార్టీగా ప్రభుత్వానికి నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలనే ఉద్దేశంతోనే సమావేశం ఏర్పాటు చేశాం.
రాష్ట్రంలో ఇప్పటికి 12 లక్షల మంది కరోనా బారిన పడ్డారు. 8,300 మంది మరణించారు. ఇవన్నీ ప్రభుత్వ హత్యలు కాదా? ఆంధ్రప్రదేశ్ పై పక్క రాష్ట్రాలు నిషేధం విధించే పరిస్థితి ఏర్పడింది.
ఏపీ కేబినెట్ సమావేశంలో కేవలం 13 లక్షల 30 వేల డోసుల వ్యాక్సిన్లను మాత్రమే కొనుగోలు చేయాలని నిర్ణయించారు. దీనికి కేవలం రూ.45 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికి 65 లక్షల డోసుల వ్యాక్సిన్లను భారత ప్రభుత్వం సరఫరా చేసింది. ప్రజలందరికీ వ్యాక్సినేషన్ అందించి కరోనా నుంచి కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. రూ.45 కోట్ల ఖర్చు చేసి ఈ ప్రభుత్వం ఏ విధంగా రాష్ట్ర ప్రజలందరికీ వ్యాక్సిన్ వేస్తుంది? ప్రజలను కాపాడుతుంది? ఒక పక్క వందల, వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుబారా చేస్తూ, మరోపక్క ప్రజల ప్రాణాలను కాపాడే వ్యాక్సిన్ కు మాత్రం డబ్బులు ఖర్చు చేసేందుకు చేతులు రావడం లేదు.
రాష్ట్రంలో ఆక్సిజన్ సరఫరా కూడా సరిగా లేదు. ఆక్సిజన్ కొరతతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ రోజు అనంతపురం హాస్పిటల్ లో ఆక్సిజన్ కొరతతో నలుగురు కరోనా రోగులు మృతిచెందారు. అంతకుముందు పదిమంది చనిపోయారు. హిందూపూర్ లో తొమ్మిది మంది చనిపోయారు. కర్నూలు లో ఆరు మంది చనిపోయారు. అలాగే విజయవాడలో చనిపోయారు. ఈ విధంగా రాష్ట్రంలో ఆక్సిజన్ కొరతతో పదుల సంఖ్యలో కరోనా రోగులు చనిపోతున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 500 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం ఉంటే 440 మెట్రిక్ టన్నులు సరఫరా అవుతోంది. రాష్ట్రంలో ఆక్సిజన్ నిల్వసామర్థ్యం 515 మెట్రిక్ టన్నులే. 515 మెట్రిక్ టన్నులకన్నా ఎక్కువ అవసరమైతే నిల్వ చేసుకునే సామర్థ్యం లేకుండా జగన్మోహన్ రెడ్డి చేశారు. రేపు రాబోయే రోజుల్లో రోజుకు 1000 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం రావొచ్చు. దీనిని అధిగమించడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రణాళికా లేదు. రాష్ట్రంలో ఆక్సిజన్ నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవాలి. క్వారంటైన్ లో ఉన్న రోగులకు ఇళ్ల దగ్గరకే ఆక్సిజన్ సరఫరా చేస్తే ఇంటి వద్దనే వ్యాధి నయమయ్యే పరిస్థితులు ఉంటాయి.
ఎన్ని ఆసుపత్రులు ఉన్నాయి, ఎంత మంది కరోనా బారిన పడే అవకాశం ఉంది, ఎంత ఆక్సిజన్ కావాలనే సమాచారం సైతం ప్రభుత్వం వద్ద లేదు. కావాల్సినంత మంది డాక్టర్లు లేరు. నర్సులకు వారం వారం రిలీఫ్ ఇవ్వలేని పరిస్థితుల్లో పనిచేయలేమని వారు అడుగుతున్నారు. వారికి కూడా రిలీఫ్ ఇచ్చే పరిస్థితులలో ఈ ప్రభుత్వం లేదు.
కరోనా చైన్ ను బ్రేక్ చేయాలంటే కొంత పరిమిత సమయం లాక్ డౌన్ ను అమలుచేసి, ఒక పద్ధతి ప్రకారం వ్యాక్సినేషన్ చేసి, ఉన్న మౌలిక సదుపాయాలను ఉపయోగించి ప్రజల ప్రాణాలను కాపాడాలని కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా.
కరోనాతో చనిపోయిన వారందరికీ బీమా, అంత్యక్రియలకు నగదు ఇవ్వాలి. అంత్యక్రియలకు కట్టెలు కూడా దొరకడం లేదు. ఉపాధి లేక ఇబ్బందులు పడేవారిని ఆదుకోవాలి. జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ప్రకటించాలి. తక్షణమే 18 ఏళ్ల పైబడిన వారికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చే బాధ్యత తీసుకోవాలి.