Rahul Gandhi: బీజేపీతో ఈసీ కుమ్మక్కు

రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. ఓట్ల జాబితాలో భారీ నేరం జరిగిందని, ఈసీ బీజేపీతో కలిసి కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. మహారాష్ట్రలో జనాభా కంటే ఓట్లు ఎక్కువగా నమోదయ్యాయని, బెంగుళూరులో లక్షకు పైగా నకిలీ ఓట్లు పోలయ్యాయని వెల్లడించారు.

Rahul Gandhi: బీజేపీతో ఈసీ కుమ్మక్కు

ఓట్ల చోరీ జరిగిందన్న కాంగ్రెస్ అగ్రనేత
జనాభా కంటే ఓటర్లే ఎక్కువ
ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్ కు అంతుచిక్కని విధంగా ఫలితాలు

Rahul Gandhi | ఈసీ, బీజేపీ కుమ్మక్కుతో దేశంలో భారీ నేరం జరుగుతోందని లోక్ సభలో విపక్షనాయకుడు, కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ ఆరోపించారు. గురువారం న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కొన్ని రోజులుగా ఈసీపై కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోంది. దీనికి సంబంధించి మీడియా సమావేశంలో కొన్ని విషయాలను ఆయన బయటపెట్టారు. నిష్ఫక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తున్నామని ఈసీ చెబుతోందని ఆయన అన్నారు.కానీ, ఆచరణలో అందుకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. ఇటీవల జరిగిన అనేక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తమ పార్టీ పరిశోధన చేసిందని ఆయన అన్నారు. ఇందులో తమ అనుమానాలు చాలా వరకు నిజమయ్యాయన్నారు. ఓటర్ల జాబితాలో అక్రమాలు జరగడం వల్లే తాము ఓడిపోయామని ఆయన అన్నారు. మహారాష్ట్రలో ఐదు నెలల్లో 40 లక్షల ఓటర్లు నమోదయ్యారని ఆయన చెప్పారు. ఐదేళ్లలో నమోదైనవారికంటే ఐదు నెల్లో నమోదైన ఓటర్లే ఎక్కువగా ఉన్నారని ఆయన తెలిపారు. మహారాష్ట్రలో సాయంత్రం ఐదు గంటల తర్వాత విపరీతంగా పోలింగ్ నమోదైందన్నారు. దీనికి సంబంధించిన సీసీఫుటేజీ అడిగినా ఈసీ ఇవ్వలేదని రాహుల్ అన్నారు. ఈ డేటాను ఈసీ ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. మహారాష్ట్రలో ఓట్ల చోరీ జరిగిందనే తమ అనుమానాలను మహారాష్ట్ర ఫలితాలు రుజువు చేశాయని ఆయన అభిప్రాయపడ్డారు. మహారాష్ట్రలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వ్యవధిలో కోటి మంది ఓటర్లు నమోదైన విషయాన్ని ఆయన గుర్తు చశారు. మహారాష్ట్రలో మొత్తం జనాభా కంటే ఎక్కువ ఓటర్లు నమోదయ్యారనిఆయన ఆరోపించారు.

కర్ణాటకలో 16 ఎంపీ సీట్లు గెలుస్తామని తాము అంచనా వేశామని, కానీ తమ పార్టీకి 9 ఎంపీ సీట్లే దక్కాయని ఆయన చెప్పారు. బెంగుళూరు సెంట్రల్ పార్లమెంట్ సెగ్మెంట్ తో పాటు 7 చోట్ల అనుహ్యంగా ఓడిపోయామని ఆయన అన్నారు. బెంగుళూరు సెంట్రల్ లోని మహదేవ్ పూర్ అసెంబ్లీ స్థానంపై పరిశోధన చేసినట్టు రాహుల్ చెప్పారు. ఒక్క మహాదేశ్ పూర్ అసెంబ్లీలోనే బీజేపీకి 1,14,046 ఓట్ల మెజారిటీ వచ్చిందన్నారు. బెంగుళూరు సెంట్రల్ స్థానంలో తమ పార్టీ32 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలైందని ఆయన అన్నారు.మహాదేవ్ పూర్ లో లక్షకు పైగా ఓట్ల చోరీ జరిగిందని ఆయన ఆరోపించారు. ఇక్కడ సుమారు 12 వేల మంది నకిలీ ఓటర్లు ఉన్నారని ఆయన తెలిపారు. అంతేకాదు 40 వేలకుపైగా ఓటర్లకు నకిలీ ఐడీలు, అడ్రస్‌లున్నాయన్నారు. ఒకే అడ్రస్ తో 10,452 ఓట్లున్నాయని ఆయన వివరించారు. అంతేకాదు 4,132 ఓట్లు తప్పుడు ఫోటోలతో ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఫామ్- 6 ను తప్పుగా వాడి 33,692 ఓట్లు వేశారని ఆయన తెలిపారు. ఒకే ఫోటోతో ఉన్న ఓటర్ల వివరాలను ఆయన మీడియా సమావేశంలో ప్రదర్శించారు.మహదేవ్ పూర్ లో 0 ఇంటి నెంబర్ తో వందల ఓట్లున్నాయన్నారు. ఒకే ఇంటి సంఖ్యతో 80 ఓటర్లున్న ఇళ్లు కూడా ఉన్నాయని ఆయన అన్నారు.ఈసీ డేటా ప్రకారమే ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఇన్ని అక్రమాలు వెలుగు చూశాయని ఆయన అన్నారు. ఈ నియోజకవర్గంలో లక్ష ఓట్లు నకిలీవి, తప్పుడు చిరునామావేనని తమ పరిశోధనలో తేలిందని ఆయన వివరించారు. బీజేపీతో ఈసీ కుమ్మకైందని ఆయన ఆరోపించారు.