మహిళా రిజర్వేషన్‌ ఎన్నికల జుమ్లా

మహిళా రిజర్వేషన్‌ ఎన్నికల జుమ్లా

దేశంలో మళ్ళీ కమండల్‌పై మండల్‌ శక్తుల పోరాటం మొదలైంది. మరోవైపు ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య విభేదాలు కూడా పొడసూపుతున్నాయి. ప్రధాని మోదీ వ్యవహార సరళి మళ్ళీ ఈ కందిరీగల తుట్టెను కదిపింది. ఆయన పరిపాలనలో ఆర్థిక రంగం అధోగతి పాలైంది. నిరుద్యోగం, పేదరికం పెరిగిపోయాయి. ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయి. దీంతో కశ్మీర్‌, అయోధ్య, ఉమ్మడి పౌర స్మృతి వంటి అంశాలను లేవనెత్తి నెట్టుకురావాలని మోదీ భావించారు. అవి కూడా పెద్దగా ప్రభావం చూపక పోవచ్చునని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.


దీంతో మహిళా రిజర్వేషన్‌ బిల్లు, లోక్‌సభ సీట్ల పెంపు మొదలైన అంశాలపై చర్చ నడిపి, ఓటర్ల ఆలోచనలు సమస్యల వైపు మళ్ళకుండా చూడాలని ప్రధాని భావిస్తున్నట్టు కనిపిస్తున్నది. కానీ ఈ వివాదాలు కాషాయపార్టీని కాపాడకపోగా, భిన్నవర్గాల మధ్య విభేదాలు పెంచడానికి దారి తీయవచ్చు. మోదీ ఇటీవల హడావుడిగా పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఆమోదింప చేశారు.


రాష్ట్రపతి ఆ బిల్లుకు ఆమోదముద్ర కూడా పడింది. చూడటానికి బీజేపీ పాలకులు మహిళా రిజర్వేషన్లు కల్పించినట్టు కనిపించింది. కానీ నిజానికి ఆయన ఎటువంటి రిజర్వేషన్లు కల్పించే ఉద్దేశంతో లేరని తెలుస్తూనే ఉన్నది. ఈ మహిళా రిజర్వేషన్‌ అసలు అమలులోకి వస్తుందా? అనే సందేహమే అందరిలోనూ వ్యక్తమవుతున్నది.


మహిళా రిజర్వేషన్‌ అమలు చేయాలనే ఉద్దేశమే కనుక మోదీకి ఉంటే తొమ్మిది ఏండ్లు ఎందుకు ఆగినట్టు? సంకీర్ణాలు ఉన్నప్పుడు అందరినీ ఒప్పించడం సాధ్యం కాదు. కానీ బీజేపీకి పూర్తి మెజారిటీ ఉన్నప్పుడు కూడా ఎందుకు మహిళా రిజర్వేషన్‌ చట్టం తేలేదు? తీరా రెండవ పర్యాయం గడువు పూర్తయి, ఎన్నికలు సమీపించిన సమయంలో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి హడావుడి సృష్టించారు. అయినా ఈ రిజర్వేషన్‌ 2024 ఎన్నికలలో అమలు కాదు.


నిజంగా ఆయనకు చిత్తశుద్ధి ఉంటే 2024 ఎన్నికల నుంచే అమలు చేసేవారు. పోనీ 2029 నుంచి అమలులోకి వస్తుందని కచ్చితంగా పేర్కొన్నారా? అంటే అదీ లేదు. ఆ విషయమూ స్పష్టంగా చెప్పలేదు. ఎక్కడికక్కడ చట్టం అమలు కాకుండా అవరోధాలను స్పష్టించి పెట్టారు. దీనివల్ల బీజేపీకి మహిళా రిజర్వేషన్‌ పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని తెలుస్తూనే ఉన్నది. తమకు ఓట్లు కావాలే తప్ప, సీట్లు ఇచ్చే ఉద్దేశం లేని అర్థమవుతున్నది.


పార్లమెంటు స్థానాల పునర్వ్యవస్థీకరణ జరిపిన తరువాత మహిళా రిజర్వేషన్‌ అమలవుతుందని పేర్కొన్నారు. అంతే కాకుండా జనాభా లెక్కలు జరిపిన తరువాత ఆ జనాభా ప్రకారం పునర్వ్యవస్థీకరణ జరపాలని సూచించారు. దీంతో ఒకదానికి ఒకటి చిక్కుముడులు ఏర్పడ్డాయి. తాజా జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుంటే, ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య భారీగా పెరిగిపోతుంది. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రజలు లౌకిక స్వభావులు. మత భావాలు ఉంటాయి కానీ మత దురభిమానం, మూఢత్వం ఉండదు. ఆధునిక భావాలు ఉంటాయి.


ఇక్కడి ప్రభుత్వాలు కూడా సంక్షేమ పథకాలను, కుటుంబ నియంత్రణ వంటి కార్యక్రమాలను శ్రద్ధగా అమలు చేయడం విశేషం. దీంతో దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గింది. మరోవైపు ఉత్తరాది రాష్ట్రాల్లో వెనుకబాటుతనం ఎక్కువ. అనేక సామాజిక జాడ్యాలు ఉన్నాయి. అందువల్ల జనాభా భారీగా పెరిగిపోయింది. ఇప్పుడు కొత్తగా జనాభా లెక్కలు తీసి, వాటి ప్రకారమే సీట్లు ఇవ్వాలని మోదీ ప్రభుత్వం అంటున్నది. ఇదే కనుక జరిగితే దక్షిణాది రాష్ట్రాలు అన్యాయానికి గురవుతాయి. ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు ఉండటం వల్ల దక్షిణాదిపై పెత్తనం సాగుతున్నది.


ఇటీవలి కాలంలో, మోదీ అధికారం చేపట్టిన తరువాత ఈ ఆధిపత్యం మరింత పెరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇక లోక్‌సభ సీట్ల పునర్వ్యవస్థీకరణ కనుక జరిగితే ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య భారీగా పెరిగిపోతుంది. దీంతో దక్షిణాది రాష్ట్రాల గొంతు వినిపించదు. బీజేపీ బలంగా ఉండేది ఉత్తరాది రాష్ట్రాల్లోనే కనుక, తన పాలనకు ఎదురు ఉండదని కూడా బీజేపీ నేతలు భావించవచ్చు. కానీ దీనిని అడ్డుకోవడానికి హిందీయేతర రాష్ట్రాల వారు ప్రయత్నించడం సహజం. మరి ఇదే జరిగితే పునర్వ్యవస్థీకరణ జరగదు.


పునర్వ్యవస్థీకరణ జరగకపోవడానికి అడ్డంకులు ఉంటే, మళ్ళీ వచ్చే ఎన్నికల వరకు దీనిని వాయిదా వేయవచ్చు. అంటే దాంతో పాటు మహిళా రిజర్వేషన్‌ అమలు కూడా వాయిదా పడుతుంది. తాజా జనాభా లెక్కల ప్రకారం పునర్వ్యవస్థీకరణ జరగకుండా హిందీయేతర రాష్ట్రాలు అడ్డుకున్నంత కాలం మహిళా రిజర్వేషన్‌ అమలు కాదు.


ఈ రెండింటికీ సంబంధం లేకుండా చేయాలంటే పార్లమెంటులో మళ్ళీ బిల్లు ప్రవేశ పెట్టాల్సిందే. మరి ఇక మోదీ సాధించిందేమిటి? మహిళా బిల్లు ఇచ్చినట్టు ఇచ్చి, ఎగ్గొట్టడమే కాదా? ఎన్నికల ముందు జరిపిన తమాషాగా దీనిని చెప్పుకోవచ్చు. చట్టం చేస్తున్నప్పుడు అమలులో అడ్డంకులు రాకుండా చూసుకోవడం ప్రభుత్వం బాధ్యత. కానీ కావాలని అడ్డంకులు ఏర్పడేలా చట్టం చేయడం విచిత్రం.


మహిళా రిజర్వేషన్‌ కల్పించిన తీరు వల్ల బీసీ రిజర్వేషన్‌ సమస్య కూడా ముందుకు వచ్చింది. ఉత్తరాది రాష్ట్రాలలో మధ్య కులాల వారు రాజకీయ అధికారం కోసం పోరాడుతున్నారు. అక్కడ రాజకీయాలలో బ్రాహ్మణ – క్షత్రియ వర్గాల ఆధిపత్యం ఎక్కువ. దీంతో మధ్యకులాలైన బీసీలు ఏకమై రాజకీయాధికారం తెచ్చుకుంటున్నారు. యూపీ, బీహార్‌లలో ఈ పరిణామం ఏర్పడింది. మధ్య ప్రదేశ్‌, రాజస్థాన్‌లలో కూడా ఇవే పరిస్థితులు ఏర్పడేవి. మండల్‌ ఉద్యమం బీసీలను బలోపేతం చేసింది. ఈలోగా వీపీ సింగ్‌ మండల్‌ రాజకీయాలను దెబ్బకొట్టడానికి వెంటనే బీజేపీ నేత అద్వానీ రథయాత్ర చేపట్టారు.


దీనిని ఆర్‌జేడీ నాయకుడు, నాటి బీహార్‌ సీఎం లాలూ ప్రసాద్‌ అడ్డుకున్నారు. బీహార్‌ ప్రభుత్వం అద్వానీని అరెస్టు చేసింది. దీంతో ఉత్తరాదిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. క్రమంగా ఉన్నత వర్గాల పార్టీగా గుర్తింపు పొందిన బీజేపీ బలపడి అధికారాన్ని చేజిక్కించుకున్నది. బీసీలు బలపడకుండా బీజేపీ అడ్డుపడుతున్నదనే అభిప్రాయం ఉన్నది.


ఇప్పుడు మహిళా రిజర్వేషన్‌లో, బీసీలకు రిజర్వేషన్‌ పెట్టకపోవడం వల్ల వెనుకబడిన తరగతులలో ఆగ్రహం వ్యక్తమవుతున్నది. తాము ఇన్నేళ్లుగా కోరుతున్నది, బీసీ మహిళలకు కూడా రిజర్వేషన్‌ ఉండాలనేదే. కానీ మళ్ళీ అదే పద్ధతిలో మహిళా రిజర్వేషన్‌ తేవడం పట్ల బీసీలు ఆగ్రహంగా ఉన్నారు. ఈ 2024 ఎన్నికలలో మహిళా రిజర్వేషన్‌ సమస్య ఎలాగూ ముందుకు రాదు.


కానీ జనాభా లెక్కలు తీసిన తరువాత, మహిళా రిజర్వేషన్‌ను నిజంగా అమలు చేయాలనుకున్నప్పుడు, బీసీల ఆగ్రహం తీవ్ర రూపానికి రావచ్చు. అప్పుడు బీసీ మహిళలకు రిజర్వేషన్‌ కల్పించాలంటే మళ్ళీ పార్లమెంటులో మహిళా రిజర్వేషన్‌ బిల్లు కొత్తగా ప్రవేశ పెట్టవలసి వస్తుంది. మరి మోదీ ఈ హడావుడి ఎందుకు చేసినట్టు? జనాభా లెక్కలలో బీసీల లెక్కలు కూడా తీయాలని ఇప్పుడు ఒత్తిడి పెరిగింది.


కులాల వారీగా జనాభా లెక్కలు తేయాలని బీజేపీయేతర పార్టీలు అంటున్నాయి. ఇప్పుడు ఇండియా కూటమి దీనికి కట్టుబడి ఉంటుంది. దీంతో జనాభా లెక్కలు తీసే తీరే ఒక వివాదంగా మారుతున్నది. ఈ సమస్యలను పరిష్కరించకుండా మోదీ మహిళా రిజర్వేషన్‌ తెచ్చామని ప్రకటింకుకుని చేతులు దులుపుకొన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే – ఇదొక ఎన్నికల జుమ్లా! 


– ఆసరి రాజు