Hero Flex Fuel Bike | దేశంలోనే మొట్టమొదటి E100 ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్.. జూన్ 3న లాంచ్ చేయనున్న హీరో!

Hero Flex Fuel Bike | పెట్రోల్ ధరలు భారీగా పెరుగుతున్న వేళ ద్విచక్ర వాహనదారులకు హీరో మోటోకార్ప్ కంపెనీ గుడ్‌న్యూస్ చెప్పింది. దేశంలోనే తొలిసారిగా 100 శాతం ఇథనాల్‌తో నడిచే బైక్‌ను తీసుకొస్తున్నట్లు తెలిపింది.

Hero Flex Fuel Bike | పెట్రోల్ ధరలు భారీగా పెరుగుతున్న వేళ ద్విచక్ర వాహనదారులకు హీరో మోటోకార్ప్ కంపెనీ గుడ్‌న్యూస్ చెప్పింది. దేశంలోనే తొలిసారిగా 100 శాతం ఇథనాల్‌తో నడిచే బైక్‌ను తీసుకొస్తున్నట్లు తెలిపింది. జూన్ 3వ తేదీ కొత్త ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్‌ను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. కాగా ఈ బైక్ భారత్‌లోనే E100 ఇంధనంపై నడవగలిగే మొట్టమొదటి మోటార్‌సైకిల్‌గా నిలవనుంది.

ప్రస్తుతం భారత మార్కెట్‌లో పూర్తిస్థాయి ఇథనాల్‌ ఇంధనంతో నడిచే ద్విచక్రవాహనాలు అందుబాటులో లేవు. E20 పెట్రోల్‌పై నడిచే ద్విచక్ర వాహనాలే ఎక్కువగా ఉన్నాయి. కొద్ది మోడళ్లలో మాత్రం పరిమిత స్థాయిలో ఇథనాల్ మిశ్రమాన్ని వినియోగించే సదుపాయం ఉంది. ఉదాహరణకు సుజుకీ జిక్సర్ 250 బైక్‌లో 85 శాతం ఇథనాల్ మిశ్రమం E85 వరకు వినియోగించుకోగలదు. అలాగే హోండా సీబీ300ఎఫ్ మోడల్ కూడా E85 అనుకూలతతో వచ్చింది. కానీ ఈ మోడల్‌ను హోండా కంపెనీ ప్రస్తుతం నిలిపివేయడం గమనార్హం.

ఏ బైక్‌ వస్తుంది?

జూన్ 3వ తేదీన ఫ్లెక్సీ ఫ్యూయల్ మోటార్‌సైకిల్‌ను లాంచ్ చేస్తున్నట్లు హీరో కంపెనీ ప్రకటించింది. కానీ ఏ మోడల్‌‌ను రిలీజ్ చేస్తుందో కచ్చితంగా చెప్పలేదు. దీంతో దీనిపై ఆసక్తి నెలకొంది. ప్పటికే 2025లో జరిగి భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో HF Deluxe ఫ్లెక్స్ ఫ్యూయల్ వెర్షన్‌ను ప్రదర్శించింది. దీనిద్వారా ఆ కంపెనీ ఇథనాల్ ఆధారిత వాహనాలపై దృష్టి పెట్టినట్లు అప్పుడే సంకేతాలు ఇచ్చింది. ఈ క్రమంలోనే హీరో కంపెనీకి చెందిన ప్రముఖ కమ్యూటర్ బైక్‌లు Splendor లేదా HF Deluxe లో ఏదో ఒక మోడల్‌ను E100 బైక్‌గా తీసుకురావచ్చని ఆటోమొబైల్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఈ రెండు మోడల్ బైక్‌ల వినియోగం ఎక్కువగా ఉండటంతో.. ఈ మోడళ్లకు ఇథనాల్ వెర్షన్ తీసుకురావడం ద్వారా విస్తృత మార్కెట్‌ను టార్గెట్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్‌లు ఎలా పనిచేస్తాయి?

సాధారణంగా ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న వాహనాలు ఒక నిర్దిష్ట ఇథనాల్ మిశ్రమానికి మాత్రమే అనుకూలంగా తయారవుతాయి. ఉదాహరణకు E20 లేదా E85. అయితే ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు మాత్రం పెట్రోల్, ఇథనాల్ మిశ్రమాలను వేర్వేరు స్థాయిల్లో స్వయంచాలకంగా గుర్తించి పనిచేయగలవు. అంటే కస్టమర్లు తమ బైక్‌లో ఏ మిశ్రమ ఇంధనాన్ని పోస్తున్నారనే ఆందోళన లేకుండా వాహనాన్ని వినియోగించవచ్చు. దీంతో భవిష్యత్తులో ప్రభుత్వం ఇథనాల్ శాతాన్ని పెంచినా వాహనాలకు నష్టం కలగకుండా ఉండే అవకాశం ఉంది.

అంతర్జాతీయంగా చమురు సంక్షోభం దృష్ట్యా దేశంలో పెట్రోల్ ఆధారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దశలవారీగా ఇథనాల్ మిశ్రమాన్ని పెంచుతోంది. ప్రస్తుతం పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ మిశ్రమాన్ని ప్రోత్సహిస్తుండగా… దాన్ని 25 శాతం నుంచి 30 శాతానికి పెంచే ప్రణాళికలు కూడా పరిశీలనలో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో పూర్తి స్థాయి ఇథనాల్‌పై నడిచే బైక్‌లకు భవిష్యత్తులో మరింత డిమాండ్ ఏర్పడే అవకాశం ఉందని ఆటోమొబైల్ రంగ నిపుణులు భావిస్తున్నారు.

ఇతర కంపెనీలు కూడా..!

కేవలం ద్విచక్రవాహనాలే కాదు.. కార్ల కంపెనీలు కూడా ఇథనాల్ వాహనాలపై దృష్టి పెట్టాయి. ఇప్పటికే టాటా మోటార్స్, మారుతి సుజుకీ వంటి సంస్థలు E100 అనుకూల కార్లపై పనిచేస్తున్నట్లు ప్రకటించాయి.

Read More:

Maruti Suzuki సంచలనం.. జూన్ 5న దేశంలోనే తొలి E100 ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు లాంచ్.. పెట్రోల్ బాధ తప్పినట్లేనా?

Latest News