Elon Musk | అంధులకు చూపు ఇవ్వబోతున్న టెక్నాలజీ.. త్వరలోనే మెదడులో ఇంప్లాంట్స్.. వైరల్‌గా మస్క్ వ్యాఖ్యలు

మానవ మెదడులో ఇంప్లాంట్స్‌ను అమర్చడం ద్వారా కంటి చూపును ప్రసాదించే టెక్నాలజీపై ప్రయోగాలు తుది దశకు వచ్చినట్లుగా న్యూరాలింక్ వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ వెల్లడించారు. తమ సంస్థ చేపట్టిన ఈ ప్రయోగాల గురించి మస్క్ వివరించిన వీడియో ఇప్పుడు ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

Elon Musk | అంధులకు చూపు ఇవ్వబోతున్న టెక్నాలజీ.. త్వరలోనే మెదడులో ఇంప్లాంట్స్.. వైరల్‌గా మస్క్ వ్యాఖ్యలు

Elon Musk | కంటిచూపు.. మనిషి జీవితంలో ఎంతో కీలకమైనది. కానీ లక్షలాది మంది చూపు లేకుండా రోజువారీ జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి వారి జీవితంలో టెక్నాలజీ వెలుగులు నింపనుంది. మానవ మెదడులో ఇంప్లాంట్స్‌ను అమర్చడం ద్వారా కంటి చూపును ప్రసాదించే టెక్నాలజీపై ప్రయోగాలు తుది దశకు వచ్చినట్లుగా న్యూరాలింక్ వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ వెల్లడించారు. తమ సంస్థ చేపట్టిన ఈ ప్రయోగాల గురించి మస్క్ వివరించిన వీడియో ఇప్పుడు ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

వీడియోలో ఏమున్నదంటే..

రాబోయే ఆరు నుంచి 12 నెలల్లో పూర్తిగా అంధులైన వారికి చూపు ఇవ్వగలిగే మెదడు ఇంప్లాంట్స్ పరీక్షిస్తున్నామని ఎలన్ మస్క్ వెల్లడించారు. మెదడులోని విజువల్ కార్టెక్స్‌కు నేరుగా సంకేతాలు పంపేవిధంగా ఈ టెక్నాలజీ పనిచేస్తుందని మస్క్ తెలిపారు. దీనివల్ల కళ్లకు సంబంధం లేకుండా నేరుగా మెదడు ఆ చిత్రాలను గ్రహించే అవకాశం ఉంటుందని వివరించారు. ఈ ప్రయోగం విజయవంతమైతే పూర్తిగా చూపులేని వ్యక్తులు కూడా చూడగలిగే స్థాయికి చేరుకుంటారని తెలిపారు.

అంతేకాకుండా ఈ టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందితే ఇన్‌ఫ్రారెడ్, అల్ట్రావయొలెట్ వంటి తరంగధైర్యాలను చూడగలిగే స్థాయికి సాధారణ మనుషులు చేరుకుంటారని మస్క్ అంచనా వేశారు. అలాగే రాడర్ తరంగాలను కూడా గుర్తించే స్థాయికి చేరుకోవచ్చని.. ఇది మనుషులకు ఒకరకంగా సూపర్ పవర్‌లా మారుతుందని అభిప్రాయపడ్డారు.

 

ఎన్నో ఏళ్లుగా ప్రయోగాలు

మనిషి మెదడులో ఎలక్ట్రానిక్ చిప్ అమర్చి కంటి చూపును ఇవ్వగలిగే టెక్నాలజీపై టెస్లా సీఈవో ఎలన్ మస్క్ కొద్ది సంవత్సరాలుగా ప్రయోగాలు చేస్తున్నాడు. దీనికోసం న్యూరాలింక్ అనే సంస్థను 2016 స్థాపించాడు. అప్పటి నుంచి దీనిపై ప్రయోగాలు చేపట్టారు. ఈ క్రమంలో మనిషి మెదడులో ఇంప్లాంట్స్ అమర్చడం ద్వారా పుట్టుకతో అంధత్వం కలిగిన వారికి కూడా చూపు తెప్పించేలా ప్రయోగాలు చేస్తున్నారు.

మెదడు ఇంప్లాంట్స్‌తో కంటి చూపు తెప్పించే ప్రయోగాలను చేపట్టినట్లు గతంలోనే చాలాసార్లు మస్క్ వెల్లడించారు. మానవ శక్తి సామర్థ్యాలను బలోపేతం చేయడం సహా పార్కిన్సన్ వంటి వ్యాధులను నివారించడమే దీని లక్ష్యమని తెలిపారు. మనిషికి, ఏఐకి మధ్య సాంకేతిక సంబంధం బలపరిచేలా ఈ చిప్ ఉపకరిస్తుందని పేర్కొన్నారు. మనిషి మెదడులో చిప్ అమర్చామని.. ఆ వ్యక్తి కోలుకుంటున్నాడని కూడా చెప్పారు. కానీ ఆ ప్రయోగాలకు సంబంధించిన ఫలితాలను మాత్రం వెల్లడించలేదు. దీంతో ఈ ప్రయోగం గురించి చాలామంది ఎదురుచూస్తున్నారు. ఇలాంటి తరుణంలో న్యూరాలింక్ పరీక్షల గురించి మస్క్ వీడియో బయటకురావడంతో మళ్లీ దీనిపై ఆసక్తి నెలకొంది.

అసలేంటి ఈ ప్రయోగం? ఇదెలా పనిచేస్తుంది?

కంప్యూటర్‌తో మానవ మెదడును నేరుగా సమన్వయం చేసేందుకు “బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్‌ఫేస్” (BCI) న్యూరాలింక్ సంస్థ ప్రయోగాలు చేస్తుంది. ఈ ప్రయోగంలో 8 మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన N1 అనే చిప్‌ను వాడతారు. దీనికి లోపల, బయట వేలాది సన్నటి వైర్లు ఉంటాయి. ఈ వైర్లు మన వెంట్రుక మందంలో 20వ వంతు ఉంటాయి.

ఇక మనిషి పుర్రలో చిన్న భాగాన్ని తొలగించి ఈ చిప్‌ను అమరుస్తారు. దీనికి ఉండే సన్నటి ఎలక్ట్రోడ్‌లను మెదడులోకి ప్రవేశపెడతారు. మెదడులోని ముఖ్య భాగాలకు వీటిని దగ్గరగా పంపిస్తారు. ఈ ఎలక్ట్రోడ్‌లు సుతిమెత్తగా ఎటుపడితే అటు వంగేలా ఉంటాయి. దీనివల్ల మెదడు లోపలి కణజాలాలకు ఎటువంటి నష్టం జరగదు. ఈ ఎలక్ట్రోడ్స్ మెదడులోని న్యూరాన్ల మధ్య ప్రసారమయ్యే సందేశాలను గుర్తించి, చిప్‌నకు పంపిస్తాయి. ఆ చిప్‌ లోపలి ఎలక్ట్రోడ్స్ వెయ్యికి పైగా న్యూరాన్ల చర్యలను నిశితంగా పరిశీలిస్తాయి. ఇలా విద్యుత్ సంకేతాలను పంపించడం, తిరిగి అందుకోవడం, తదననుగుణంగా ప్రేరేపించడం వంటివి చేస్తాయి.

ఈ టెక్నాలజీ సక్సెస్ అయితే అంధులకు చూపుకలిగించడమే కాదు.. మనిషి సామర్థ్యాలను మరింత పెంచి సూపర్ పవర్‌గా మార్చవచ్చని మస్క్ అభిప్రాయపడుతున్నారు. మరి ఈ టెక్నాలజీ 6-12 నెలల సమయంలోనే వస్తుందా? ఇంకా టైమ్ పడుతుందో చూడాలి!

Read More:

మీకు తెలుసా..? సీపీఆర్ మెషిన్స్ వచ్చేశాయ్ !

వండర్ .. భవిష్యత్తులో మొక్కలతోనే విద్యుత్ వెలుగులు!