కృత్రిమ మేధ అభివృద్ధి చెందిన కొద్దీ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర సవాళ్లు ఎదురవుతాయని ఆందోళనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రముఖ కృత్రిమ మేధ కంపెనీ ఓపెన్‌ఏఐ సీఈవో సామ్ ఆల్టమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎక్స్‌లో ఆయన చేసిన పోస్టు ఆర్థిక వేత్తల్లో తీవ్ర కలకలం రేపుతున్నది. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భవిష్యత్తులో సాధారణ కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్) వచ్చిన తర్వాత నిరుద్యోగం భారీగా పెరిగిపోతుందని, ఫలితంగా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదం ఉన్నదని ఆల్ట్‌మన్ ఎక్స్‌లో చేసిన పోస్టులో పేర్కొన్నారు. ఏజీఐ అనేది ఇప్పటి కృత్రిమ మేధ (ఏఐ)కు ఉన్నత స్థాయి రూపం. మనుషుల మేధస్సుతో సమానంగా లేదంటే దానికి మించిన స్థాయిలో అన్ని రంగాల్లో అనుకరించగలిగే అధునాతన కృత్రిమ మేధ.
‘ఏజీఐ వచ్చిన తర్వాత ఎవ్వరూ పనిచేయరు. ఆర్థిక వ్యవస్థ కూలిపోతుంది’ అని సామ్ ఆల్ట్‌మన్ తన ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. అదే సమయంలో ఆయన చేసిన మరో ప్రకటన కూడా ఆసక్తికరంగా ఉన్నది. తన నిద్ర ప్యాట్రన్స్‌ను మార్చుకున్నానని, పాలీఫేసిక్ స్లీప్.. (రాత్రి నిర్దిష్ట సమయం నిద్రించడం కాకుండా.. 24 గంటల్లో చిన్న చిన్న భాగాలుగా విభజించుకుని నిద్రించడం) అలవాటు చేసుకున్నానని ఆయన పేర్కొనడం గమనార్హం. దానికి కారణాన్ని కూడా వివరించిన ఆల్ట్‌మన్.. ఏఐ రంగంలో అత్యంత వేగంగా చోటు చేసుకుంటున్న మార్పులను మిస్ కాకుండా తాను పాలీఫేసిక్ స్లీప్‌ను కొనసాగిస్తున్నానని తెలిపారు. ‘జీపీటీ–5.5 గొప్పగా పనిచేస్తున్నది. ఎక్కువ సేపు నిద్రపోతే పని మిస్ అవుతాను కాబట్టి.. రోజులో మధ్యమధ్యలో నిద్రపోతున్నాను’ అని ఆయన పేర్కొన్నారు.
నిజానికి ఈ రెండు వ్యాఖ్యలు పరస్పర విరుద్ధంగా కనిపిస్తున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవైపు ఏజీఐ వల్ల ఉద్యోగుల అవసరం తగ్గిపోతుందని చెబుతూనే.. మరోవైపు అదే టెక్నాలజీ కారణంగా ఎక్కువగా పనిచేయాలనే ఆసక్తిని సామ్ ఆల్ట్‌మన్ వ్యక్తం చేయడం గమనార్హం. ఆయన మాటల్లోని ఈ వైరుధ్యమే ఇప్పుడు చర్చకు దారి తీస్తున్నది. నిజానికి ఆల్ట్‌మన్.. పని/పనిచేసే వ్యక్తి అవసరం లేకుండా చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తున్న నిపుణుడు. అదే వ్యక్తి.. అదే కారణంగా నిద్ర తగ్గించుకుని పనిచేస్తున్నానని చెప్పడమే విశేషం.
ఇదిలా ఉంటే.. ఏజీఐ.. 2030 నాటికి అందుబాటులోకి వస్తుందని ఆల్ట్‌మన్ 2025లోనే అంచనా వేశారు. కానీ.. ఆయన వాదనపై టెక్ రంగంలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఏజీఐ కంటే ప్రత్యేక టార్గెట్స్‌కు సరిపోయే స్పెషలైజ్డ్ ఇంటెలిజెన్స్ అవసరమని స్టీన్‌బెర్గర్ వంటి నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏజీఐ భావన పాతబడిపోయిందని డానియేలా అమోడీ అన్నారు. గూగుల్ డీప్‌మైండ్ సీఈవో సర్ డెమిస్ హస్సాబిస్ సైతం.. ప్రపంచాన్ని అర్థం చేసుకునే మోడల్స్ లేకుండా ఏజీఐ సాధ్యం కాబోదని తేల్చి చెబుతున్నారు.
జీపీటీ 5.5 విడుదల
ఓపెన్‌ఏఐ తాజాగా జీపీటీ–5.5 మోడల్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఇందులో తర్కశక్తి (రీజనింగ్)ని మెరుగుపర్చారు. కోడింగ్ సామర్థ్యాన్ని పెంచారు. ఇది శాస్త్రీయ పరిశోధనలు మెరుగైన పనితీరు కనబరుస్తుందని చెబుతున్నారు. ఇంతే కాకుండా.. జీపీటీ–5.5 వేగంగా పనిచేస్తుంది. తక్కువ ఖర్చుతో లభిస్తుంది. క్లిష్టమైన పనులను సులభంగా నిర్వహిస్తుంది. టెర్మినల్ బెంచ్ 2.0లో జీపీటీ 5.5 కచ్చితత్వం 82.7 శాతంగా ఉన్నదని కంపెనీ పేర్కొంది. తద్వారా ఆంథ్రోపిక్‌కు చెందిన క్లాడ్ ఒపస్ 4.7, గూగుల్‌కు చెందిన జమినై 3.1 మోడళ్లను అధిగమించిందని కంపెనీ తెలిపింది.
రోజురోజుకు కొత్త మోడళ్ల విడుదలవుతున్న నేపథ్యంలో నిజంగానే ఏఐ.. మనుషుల పనిని లాగేస్తుందా? లేదా మనుషులను మరింతగా పనిచేసే సాధనంగా ఉంటుందా? ఈ ప్రశ్నలకు ఇప్పటికైతే స్పష్టమైన సమాధానం లేదు. కానీ.. సామ్ ఆల్ట్‌మన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు, ఇప్పటికే పలువురు ఏఐ నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఏఐ రంగంలో విశేషంగా పనిచేస్తున్న టెస్లా అధినేత ఎలన్ మస్క్.. కృత్రిమ మేధ అనేది మానవ మనుగడకే ముప్పు అని, అది అణు బాంబులకంటే ప్రమాదకరమైనదని 2014లోనే వ్యాఖ్యానించారు. ఏఐతో మనం దెయ్యాలను ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. రాబోయే పది నుంచి ఇరవై ఏళ్లలో ఏఐ హ్యూమనాయిడ్ రోబోలు పనిలోకి రానున్న నేపథ్యంలో పని చేయడం అనేది ఐచ్ఛికంగా మారిపోతుందని, ఆ సమయంలో ఉద్యోగాలు కోల్పోవారికి ప్రభుత్వాలే యూనివర్సల్ హై ఇన్‌కమ్ అందించాల్సి ఉంటుందని కూడా మస్క్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
Heat Wave | అగ్ని గుండాన్ని తలపిస్తోన్న ఆదిలాబాద్.. అల్లాడిపోతున్న ప్రజలు
Viral News | విదేశీ కలల వెనుక చెల్లించే అసలు మూల్యం ఇదే.. భారతీయ యువతి భావోద్వేగ పోస్టు
