UPI Payments | భారత్‌లో డిజిటల్ చెల్లింపులు గణనీయంగా పెరిగిపోయాయి. నగదు బదిలీలు, మొబైల్ రీచార్జిల నుంచి మొదలుపెడితే.. కిరాణ షాపులో చిన్న బిస్కెట్ ప్యాకెట్ కొన్నా.. హోటల్‌లో ఛాయ్ తాగినా యూపీఐ పేమెంట్లు చేసేస్తున్నారు. దీనికోసం ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం వంటి వివిధ యూపీఐ యాప్‌లను వాడుతున్నారు. ఈ క్రమంలోనే కొన్నిసార్లు పేమెంట్లు చేసే సమయంలో చేసే పొరపాట్ల కారణంగా బ్యాంకు నుంచి అనవసరంగా డబ్బులు పోగొట్టుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా UPI AutoPay ఫీచర్ విషయంలో జాగ్రత్తగా లేకపోతే మీ అకౌంట్ ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఆటోపే అంటే ఏంటి?
UPI AutoPay అనేది రికరింగ్ పేమెంట్ ఫీచర్. దీనిద్వారా వినియోగదారులకు ఒకసారి అనుమతిస్తే.. ప్రతి నెలా నిర్ణయించిన తేదీన బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు ఆటోమేటిక్‌గా డెబిట్ అయిపోతాయి. అంటే ప్రతిసారి మ్యాన్యువల్‌గా చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇది ముఖ్యంగా మొబైల్ బిల్లు, విద్యుత్, గ్యాస్ బిల్లులు, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు వంటి సేవలకు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.
సమస్య ఎందుకు వస్తుంది?
తమకు తెలియకుండానే డబ్బులు కట్ అవుతున్నాయని బ్యాంకులకు ఫిర్యాదు చేసే వాళ్లు ఇటీవల ఎక్కువయ్యారు. 2025 రెండో భాగంలో దీనికి సంబంధించి ఆర్‌బీఐకి అధికంగా ఫిర్యాదులు వచ్చాయి. వాళ్లలో చాలామంది తమకు ఆటోపే ఎప్పుడు సెటప్ అయ్యిందో కూడా తెలియదని.. క్యాన్సిల్ చేయడం కష్టంగా ఉందని చెప్పారట. కొన్ని ట్రయల్ సబ్‌స్క్రిప్షన్లు తీసుకున్నప్పుడు తెలియకుండానే ఆటోపే యాక్టివేట్ అవుతుంది.. ఆ తర్వాత యాప్ డిలీట్ చేసినప్పటికీ ఆటోపే ఆగడం లేదని చాలా ఫిర్యాదుల్లో కస్టమర్లు చెప్పారు.
యాప్ డిలీట్ చేస్తే.. ఆటోపే ఆగదు!
యాప్ డిలీట్ చేసినంత మాత్రాన ఆటోపే ఆగిపోదు. ఎందుకంటే ఆ mandates యాప్‌లో కాకుండా బ్యాంకు, National Payments Corporation of India (NPCI) స్థాయిలో ఉంటుంది. అయితే చాలా సందర్భాల్లో డబ్బు కట్ అయ్యే ముందు నోటిఫికేషన్ కూడా వస్తుంది. కానీ దీన్ని చాలామంది పట్టించుకోరు. చివరకు డబ్బులు కట్ అయ్యాక బాధపడిపోతుంటారు.
ఇలాంటి సమస్యలు వచ్చిన నేపథ్యంలో ఆర్బీఐ ఆటోపేకు సంబంధించి పలు చర్యలు తీసుకుంది. అన్ని యాప్‌ల్లో mandate చూడగలిగే విధానం తీసుకొచ్చింది. యూజర్లపై ఒత్తిడి తీసుకొచ్చే mandates క్రియేట్ చేయకుండా నిబంధనలు తెచ్చింది. అలాగే UPI Help పోర్టల్ ద్వారా mandates చెక్ చేసి, క్యాన్సిల్ చేసే అవకాశం కూడా ఇచ్చింది. అందుకే..
* ఫ్రీ ట్రయల్ తీసుకున్నప్పుడు
* కొత్త యాప్ లేదా సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నప్పుడు
* తెలియని వెబ్‌సైట్లలో పేమెంట్ చేసేటప్పుడు
* పాత సేవలు ఉపయోగించడం ఆపిన తర్వాత జాగ్రత్తగా ఉండటం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
UPI AutoPay ఎలా క్యాన్సిల్ చేయాలి?
భారత జాతీయ చెల్లింపుల సంస్థ(NPCI) అందిస్తున్న UPI Help పోర్టల్ ద్వారా మీ యూపీఐ ఆటోపే ఈజీగా చెక్ చేసుకుని క్యాన్సిల్ చేసుకోవచ్చు.
* ముందుగా బ్రౌజర్‌లో upihelp.npci.org.in వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
* ఆ పేజీలో UPI Help అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. అప్పుడు ఒక పేజీ ఓపెన్ అవుతుంది.
* అందులో మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి, స్క్రీన్‌పై కనిపించే క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి కింద కనిపిస్తున్న చెక్ బాక్స్ క్లిక్ చేయాలి. అనంతరం కంటిన్యూ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి.
* అనంతరం మీ మొబైల్ నంబర్‌కు వచ్చిన 6 అంకెల ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి.
* అప్పుడు మీ మొబైల్ నంబర్‌తో లింక్ ఉన్న యూపీఐ యాప్స్‌కు సంబంధించిన వివరాలు అక్కడ డిస్‌ప్లే అవుతాయి. అప్పుడు Show all my Autopay mandatesపై క్లిక్ చేయాలి.
* మొబైల్ స్క్రీన్‌పై ఆటోపే సెట్ చేసుకున్న వివరాలు కనిపిస్తాయి. వాటిలో అవసరం లేని వాటిని తాత్కాలికంగా లేదా పూర్తిగా క్యాన్సిల్ చేసుకోవచ్చు.
Read More:
ఏప్రిల్ 1 నుంచి పాన్ కార్డు జారీకి కొత్త రూల్స్.. ఈ సర్టిఫికెట్స్ తప్పనిసరి..!
బ్యాంకు ఖాతాలో కనీస బ్యాలెన్స్ లేదంటూ పెనాల్టీ 19వేల కోట్లు వసూలు
ఫాం ల్యాండ్ పేరుతో నిలువు దోపిడీ.. హైదరాబాద్ చుట్టూ వేల కొద్దీ వెంచర్లు
