శబ్దం లేని యుద్ధం.. స్పేస్‌ వార్‌ కోసం అమెరికా బ్రహ్మాస్తం.. ఉపగ్రహాలే టార్గెట్‌

రేపటి యుద్ధంలో బాంబుల పేలుళ్లు వినిపించకపోవచ్చు. దూసుకొచ్చే మిస్సైళ్లు కనిపించకపోవచ్చు. కానీ.. టార్గెట్‌.. ఆకాశంలో తిరుగుతున్న ఉపగ్రహాలే! అవి మూగబోయిన క్షణం.. సదరు దేశం భద్రతా వ్యవస్థ కళ్లు కనిపించవు.. చెవులు వినిపించవు. యుద్ధం ప్రారంభమయ్యేలోపే.. ఓటమి కూడా మొదలవుతుంది. అదే అమెరికా అభివృద్ధి చేయనున్న 'మెడోలాండ్స్'.

meadowlands satellite jammer us space force Image generated with AI Help

ఆకాశం నిశ్శబ్దంగా ఉంది… కానీ యుద్ధం మొదలైంది! ఒక్క బుల్లెట్ పేలలేదు… ఒక్క క్షిపణి కూడా నింగిలోకి దూసుకుపోలేదు. ఏ శత్రుదేశంలోనూ పేలుడు శబ్దాలు లేవు! కానీ.. ఆ యా దేశాలు ఒక్కసారిగా అంధకారంలో కూరుకుపోయాయి. శత్రు దేశాల్లోని రాడార్లు పనిచేయడం ఆపేశాయి. వారి యుద్ధ విమానాలకు సంకేతాలు అందటం లేదు.. వారు ప్రయోగించే క్షిపణలు తమ టార్గెట్స్‌ను గుర్తించలేక పోతున్నాయి. వీటన్నింటిలో కీలకమైన శాటిలైట్స్‌ ఆకాశంలోనే ఉన్నాయి. కానీ.. అవి మాట్లాడటం మానేశాయి.

ఇదేదో హాలీవుడ్‌ సైన్స్‌ ఫిక్షన్‌ సినిమా కథ కాదు!
అమెరికా సిద్ధం చేసిన కొత్త యుద్ధ వ్యూహం!!
దాని పేరే మెడోలాండ్స్‌.

భవిష్యత్తు యుద్ధాలు.. స్పేస్‌ వార్స్‌!

దేవతల కాలంలో యుద్ధానికి ఆయుధాలు.. అస్త్రాలు! రాజుల కాలంలో యుద్ధాలకు ఆయుధాలు కత్తులు, విల్లంబులు, ఈటెలు! ఆ తర్వాత తుపాకులు, వాటిలో బుల్లెట్లు.. మిస్సైల్స్‌! తదుపరి క్రమంలో శత్రుదేశాల విమానాశ్రయాలు, విద్యుత్తు కేంద్రాలు, రాడార్‌ కేంద్రాల విధ్వంసానికి ఎదిగాయి. కాలం మారుతున్న కొద్దీ.. ఆయుధాలు కూడా మారుతున్నాయి. ఇప్పటి కాలానికి కొత్త ఆయుధం.. కొత్త యవనిక.. గగనతలం! ఏ దేశానికైనా అత్యంత బలమైన శక్తి.. ఆ దేశపు ఉపగ్రహాలే. క్షిపణులకు దారి చూపించేది అవే. యుద్ధ విమానాలను నడిపించేదీ అవే. గ్రౌండ్‌లో సైన్యానికి ఆదేశాలు చేరవేసేందుకు ఉపయోగపడేవీ ఉపగ్రహాలే. ఆ ఉపగ్రహాలే నిశ్శబ్దమైతే? చేయాల్సిన పనులు చేయలేని స్థితికి వెళ్లిపోతే? మొత్తం సైన్యం నిస్తేజమవుతుంది. ఇప్పుడు అమెరికా ప్రాజెక్టు.. మెడోలాండ్స్‌ చేసేది ఇదే.

ఏమిటీ మెడోలాండ్స్‌ ప్రాజెక్ట్?

మెడోలాండ్స్‌ ప్రాజెక్టులో బాంబులు ఉపయోగించరు. క్షిపణులూ అవసరం లేదు. లేజర్‌ కిరాణాల సహాయాలు అనవసరం. మరి ఇదేం చేస్తుంది? ఇది అత్యంత శక్తిమంతమైన ఎలక్ట్రోమాగ్నెటిక్‌ తరంగాలను విడుదల చేస్తుంది. అవి నేరుగా శత్రు దేశాల శాటిలైట్స్‌ పంపే రేడియో సంకేతాలను అడ్డుకుంటాయి. అంటే.. ఉపగ్రహం లైవ్‌లోనే ఉన్నా.. దాని గొంతు పిసికేస్తాయి. ఫలితంగా గ్రౌండ్‌ లెవెల్‌ ఆర్మీతో దానికి లింకులు పూర్తిగా తెగిపోతాయి. ఉప గ్రహాల నుంచి ఎలాంటి సంకేతాలు సైన్యం వద్ద ఉన్న పరికరాల్లోకి చేరవు.

లారీ..ఎక్కొ..స్తుందీ..

ఈ అధునాతన బ్రహ్మాస్తానికి శాశ్వత స్థావరం అంటూ ఏమీ ఉండదు. ఎక్కడి కావాలంటే అక్కడికి తరలించవచ్చు. ఇది భారీ ట్రైలర్‌పై ఏర్పాటు చేసిన యాంటెన్నా. అవసరమైతే కార్గో విమానాల్లోనూ ప్రయణించి.. యుద్ధం ఎక్కడ మొదలైతే అక్కడకు వెళుతుంది. తన విశ్వవీక్షణ కంటిని తెరిచి.. ఆకాశంలో తిరుగుతున్న శత్రుదేశాల ఉపగ్రహాలను లక్ష్యంగా చేసుకుని.. కనిపించని దాడిని ఎక్కుపెడుతుంది.

గగనతల ఆక్రమణే ట్రంప్‌ లక్ష్యం!

ఇప్పటికే వివిధ దేశాలకు వార్నింగ్స్‌ ఇస్తూ.. దాడులు చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. భూమిపైనే కాదు.. ఆకాశంలో సైతం అమెరికాదే ఆధిపత్యం ఉండాలనే లక్ష్యంతో ఉన్నారు. అందుకోసమే అమెరికా స్పేస్‌ ఫోర్స్‌కు పెద్ద మొత్తంలో నిధులు కుమ్మరిస్తున్నారు. రాబోయే 2027 ఆర్థిక సంవత్సరంలో మెడోలాండ్స్‌ అభివృద్ధి, దానిలో పనిచేసేవారికి శిక్షణ కోసం ఏకంగా 460 మిలియన్ డాలర్లు (రూ.44,27,91,63,000) వెచ్చించేందుకు అమెరికా ప్రభుత్వం సిద్ధమైంది.

ఇప్పటికే వాడేస్తున్నారు..

దీని పూర్తి స్వరూపం సిద్ధం కాకపోయినా.. 2025 ఇరాన్‌ అణు కేంద్రాలపై చేసిన ‘ఆపరేషన్‌ మిడ్‌నైట్‌ హ్యామర్‌’ దాడుల్లో ఇదే తరహా ఎలక్ట్రోమాగ్నెటిక్‌ తరంగాలను ఉపయోగించామని అమెరికా స్పేస్‌ ఫోర్స్‌ వెల్లడించింది. ఇందుకోసం సైలెన్స్‌ జోన్‌ సృష్టించారు. ఇది శత్రు దేశపు కమ్యూనికేషన్‌ వ్యవస్థలను కాసేపు పూర్తిగా మూగబోయేలా చేస్తుంది. అదే సమయంలో అమెరికా బాంబర్‌ విమానాలు సురక్షితంగా, సుస్పష్టంగా వాటి లక్ష్యాలను చేరుకునేలా చూస్తుంది. అంతకు ముందు ఆపరేషన్‌ ఎపిక్‌ ప్యూరీ పేరిట నిర్వహించిన దాడుల్లోనూ ఇదే వ్యవస్థతో ఇరాన్‌ రాడార్లు, కమ్యూనికేషన్‌ నెటవర్క్‌లను అడ్డుకున్నట్టు ప్రకటించింది.

Latest News