చేజింగ్ మాస్ట‌ర్ ఈజ్ బ్యాక్.. ఆసీస్‌ పై భారత్‌ ఘన విజ‌యం!

  • By: sn    sports    Oct 09, 2023 3:03 AM IST
చేజింగ్ మాస్ట‌ర్ ఈజ్ బ్యాక్.. ఆసీస్‌ పై భారత్‌ ఘన విజ‌యం!

2023 వన్డే ప్రపంచకప్‌లో టీమ్ ఇండియా తన మిషన్‌ను ఘ‌నంగా ప్రారంభించింది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించి 2 పాయింట్లు ద‌క్కించుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో జ‌రిగిన ఆస‌క్తిక‌ర విష‌యం ఏంటంటే.. ఈ మ్యాచ్‌కి వచ్చిన భారతీయుల్లో చాలా మంది, ఆస్ట్రేలియా జెర్సీలో వచ్చి అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురి చేశారు. ఇక్క‌డ ట్విస్ట్ ఏంటంటే.. ఆస్ట్రేలియా జెర్సీ ఎల్లో కలర్‌లో ఉండ‌గా, సీఎస్‌కే కూడా ఎల్లో జెర్సీలో ఉంటుంది కాబ‌ట్టి ఎల్లో లవ్ పేరుతో చాలామంది చెన్నై ఫ్యాన్స్, తమ దేశానికి కాకుండా ప్రత్యర్థి దేశానికి సపోర్ట్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా భారీ స్కోర్ చేస్తుంద‌ని అంద‌రు భావించ‌గా,కాని ఆ జ‌ట్టు 49.3 ఓవర్లలో 199 పరుగులు చేసింది.

స్టీవ్ స్మిత్ అత్యధికంగా 46 పరుగులు చేయ‌గా, మిగ‌తా బ్యాట్స్‌మెన్స్ ఎవ‌రు పెద్ద‌గా ప‌రుగులు చేయ‌లేక‌పోయారు. ఇక భారత్ తరపున రవీంద్ర జడేజా 3 వికెట్లు, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా తలో 2 వికెట్లు తీశారు.ఇక మహ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్ తలో వికెట్ తీసారు. ఛేజింగ్‌కు దిగిన టీమ్‌ఇండియా అభిమానుల‌ని తీవ్రంగా నిరాశ‌ప‌ర‌చింది. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ జీరో పరుగులకే డ‌కౌట్ కాగా, టీమిండియా స్కోర్ 2 పరుగుల వద్ద మూడు వికెట్ల‌ని కోల్పోయింది. దీంతో భార‌త్ ఈ మ్యాచ్‌లో దారుణ‌మైన అప‌జ‌యం మూట గ‌ట్టుకుంద‌ని అంద‌రు భావించారు. కాని చేజింగ్ మాస్ట‌ర్ విరాట్ కోహ్లీ ..కేఎల్ రాహుల్‌తో క‌లిసి 165 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. విరాట్‌కి చ‌క్క‌ని అవ‌కాశం ద‌క్కిన దానిని సెంచ‌రీగా మ‌ల‌వ‌లేక‌పోయాడు.

విరాట్ 85 ప‌రుగులు చేసి ఔటైన‌, కేఎల్ రాహుల్ మాత్రం చివ‌రి వ‌ర‌కు ఉండి 97 ప‌రుగుల‌తో జ‌ట్టుకి విజ‌యాన్ని అందించాడు.ఇక వైస్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా 8 బంతుల్లో ఓ సిక్సర్‌తో 11 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మొత్తానికి 41.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియా, ఘన విజయంతో ప్రపంచ కప్‌ని మొదలెట్టింది. ఇక ఈ మ్యాచ్‌లో విరాట్ అర్ధ సెంచ‌రీ పూర్తి చేయ‌డంతో వన్డేల్లో 11 వేల పరుగులు పూర్తి చేసుకున్న మూడో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఇక నాన్‌-ఓపెనర్‌గా ఐసీసీ వరల్డ్ కప్‌ టోర్నీల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కోహ్లీ స‌రికొత్త రికార్డ్ న‌మోదు చేశాడు.