రెండు పవర్ ప్లే బ్యాటింగ్ దిగ్గజాల మధ్య పోరాటం. ఈ రెండు జట్లు పవర్ ప్లేలో చాలాసార్లు దంచి కొట్టారు. అయితే ఎక్కువగా స్కోర్ చేసింది, ఎక్కువసార్లు చేసింది మాత్రం సన్‌రైజర్సే. 6 ఓవర్లలో 80 పరుగులకు పైగా తీసుకుంటే, హైదరాబాద్ 4 సార్లు, కోల్‌కతా 2 సార్లు ఈ ఘనత సాధించాయి. అయితే 100 పరుగులను దాటింది మాత్రం సన్‌రైజర్స్, అది కూడా రెండు సార్లు. ఈ ఇద్దరూ ఎదురుపడింది లీగ్ దశ మొదటి వారంలో, అదీ ఒక్కసారే. అందులో కోల్‌కతా 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. మరి ఈ సారి..? చూద్దాం.
ఐపిఎల్ 2024 ముగింపు దశకు చేరుకుంది. ప్లేఆఫ్స్ నేడు మొదలవనున్నాయి. మొదటి క్వాలిఫయర్ మ్యాచ్ కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య నరేంద్రమోదీ స్టేడియం(Narendra Modi Stadium), అహ్మదాబాద్‌లో సాయంత్రం 7 గంటలకు మొదలవుతుంది. రెండు జట్ల ఓపెనర్లు భీకర ఫామ్‌లో ఉన్నారు. అయితే ఇక్కడ కోల్‌కతా రెగ్యులర్ ఓపెనర్, కీపర్ ఫిల్ సాల్ట్ స్వదేశానికి వెళ్లిపోయాడు. అతని స్థానంలో రహమనుల్లా గుర్బాజ్(Rahamanullah Gurbaz) వచ్చే అవకాశముంది. ఇది కోల్‌కతాకు ఒక బలహీనత. అహ్మదాబాద్ నల్లనేల పిచ్ స్లో బౌలర్లకు అనుకూలిస్తుంది. అది కోల్‌కతా బౌలర్లు నరైన్, వరుణ్ చక్రవర్తి(Varun Chakravarthy)లకు చక్కగా కుదురుతుంది. ఎర్రనేల పిచ్ అయితే బ్యాటర్లకు. రేపటికి ఏది ఉంటుందో రేపే తెలుస్తుంది. అలాగే ఆఖరి ఓవర్లలో కూడా భారీగా పరుగులు రాబట్టే కోల్‌కతా, ఓపెనర్ల పవర్ ప్లే మీదే పూర్తిగా ఆధారపడిలేదు. 17, 20 ఓవర్ల మధ్యలో వారి సగటు రన్‌రేట్ 13.02గా ఉంది. వారి బ్యాటింగ్ బలం సునీల్ నరైన్(Sunil Narine), ఆండ్రీ రసెల్(Andre Russel), రింకూసింగ్(Rinku Singh) ఏ నిమిషంలోనైనా ఆటను మార్చివేయగల సమర్థులు.
ఇక్కడ హైదరాబాద్ జట్టుకు ఒక లాభం ఉంది. కోల్‌కతా జట్టు వారి ప్లేఆఫ్స్ స్థానం ఖరారైన మే11న ముంబైతో ఆఖరి మ్యాచ్ ఆడింది. తర్వాత రెండూ వర్షార్పణం అయ్యాయి. దాంతో 10 రోజుల తర్వాత జట్టు బ్యాటూ, బాలూ పట్టనుంది. హైదరాబాద్ చివరి మ్యాచ్‌లో పంజాబ్ విసిరిన 215 పరుగుల లక్ష్యాన్ని ట్రావిస్ హెడ్ సహకారం లేకున్నా, ఉఫ్‌మని ఊదేసింది. ఇక్కడ ట్రావిస్ హెడ్(Travis Head), అభిషేక్ శర్మ(Abhishek Sharma), హెన్రిచ్ క్లాసెన్(Henrich klaasen) అరివీర భయంకర బ్యాటర్లు. కొత్తగా రాహుల్ త్రిపాఠీ(Rahul Tripathi) కూడా చేరాడు. నితీశ్‌కుమార్ రెడ్డి(Nitish kumar Reddy) బ్యాటింగ్‌లో బాగా రాణిస్తున్న ఆల్‌రౌండర్. ఓ మ్యాచ్ దగ్గరుండి గెలిపించాడు కూడా. అయితే అహ్మదాబాద్‌లో గుజరాత్‌తో ఆడిన మ్యాచ్‌లో హైదరాబాద్ 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇక్కడ మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 162 పరుగుల లక్ష్యాన్నే విధించగలిగింది. ఇక్కడ హైదరాబాద్‌కు అపశకునాలు రెండు. ఒకటి కోల్‌కతాతో ఆడిన ఒకే మ్యాచ్‌లో, ఆహ్మదాబాద్‌లో ఆడిన ఒకే మ్యాచ్‌లో ఓటమి పాలైంది. ఇప్పుడు ఇవి రెండూ కలుస్తున్నాయి. కానీ, భయపడాల్సిన పరిస్థితుల్లో హైదరాబాద్ లేదు. క్రికెట్ పండితులు, మాజీ ఆటగాళ్ల విశ్లేషణ ప్రకారం హైదరాబాద్‌కే విజయావకాశాలెక్కువగా ఉన్నాయని అంచనా.
అయితే, చరిత్ర తిరగేస్తే, రెండు జట్లు ఇప్పటివరకు ఐపిఎల్‌లో 26సార్లు తలపడగా, కోల్‌కతా 17 సార్లు, హైదరాబాద్ 9 సార్లు విజయం సాధించాయి. ఈ రెండు జట్లు రెండు సార్లు ఐపిఎల్ చాంపియన్‌గా నిలిచాయి(హైదరాబాద్ ఒకసారి డెక్కన్ చార్జర్స్‌గా).
ఇక గ్రౌండ్ విషయానికొస్తే, నరేంద్రమోదీ స్టేడియం నల్లనేల పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. ఈ సీజన్లో ఇక్కడ ఏడు మ్యాచ్‌లు జరగగా, 6 పూర్తిగా సాగాయి. అందులో 4 సార్లు సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లు విజయం సాధించాయి. అందువల్ల టాస్ గెలిచిన కెప్టెన్, మరో ఆలోచన లేకుండా బౌలింగ్ తీసుకునే అవకాశముంది.
తుది జట్ల అంచనా(Team Predictions):
కోల్‌కతా నైట్‌రైడర్స్(KKR):
సునిల్ నరైన్, రహమతుల్లా గుర్బాజ్(కీపర్), శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), వెంకటేశ్ అయ్యర్, నితీశ్ రానా, రింకూసింగ్, ఆండ్రీ రసెల్, రమణ్‌దీప్ సింగ్, మిచెల్ స్టార్క్, అనుకూల్ రాయ్/వైభవ్ అరోరా, హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తి.
సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH):
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠీ, నితీశ్‌కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(కీపర్), షాబాజ్ అహ్మద్, అబ్దుల్ సమద్, సన్వీర్ సింగ్, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, విజయకాంత్ వయస్కాంత్, నటరాజన్.