Wimbledon 2024 | తొలిసారి వింబుల్డన్ టైటిల్ నెగ్గిన క్రెజికోవా.. మహిళ సింగిల్స్ ఫైనల్లో పావోలిని ఓటమి..!
Wimbledon 2024 | వింబుల్డన్ మహిళ సింగిల్స్ తుదిపోరులో చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి బార్బోరా క్రిజికోవా (Barbora krejcikova) ఘన విజయం సాధించింది. ఇటలీ భామ జాస్మిన్ పావోలిని (Jasmine paolini) ని మట్టికరిపించింది. దాంతో తన కెరీర్‌లో తొలిసారి క్రెజికోవా వింబుల్డన్ టైటిల్ నెగ్గింది.

Wimbledon 2024 : వింబుల్డన్ మహిళ సింగిల్స్ తుదిపోరులో చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి బార్బోరా క్రెజికోవా (Barbora krejcikova) ఘన విజయం సాధించింది. ఇటలీ భామ జాస్మిన్ పావోలిని (Jasmine paolini) ని మట్టికరిపించింది. దాంతో తన కెరీర్‌లో తొలిసారి క్రెజికోవా వింబుల్డన్ టైటిల్ నెగ్గింది. ఈ టోర్నీలో ఇద్దరూ తొలిసారి ఫైనల్‌కు చేరారు. తొలి సెట్‌లోనే క్రెజికోవా చెలరేగడంతో పోరు ఏకపక్షమే అనిపించింది. కానీ రెండో సెట్లో పావోలిని సత్తాచాటింది. నిర్ణాయకంగా మారిన కీలకమైన మూడో సెట్‌లో ఇద్దరూ హోరాహోరిగా తలపడినా చివరికి క్రెజికోవానే విజయం ముద్దాడింది.
ఫైనల్ మ్యాచ్‌లో క్రెజికోవా అదరగొట్టింది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో 31వ సీడ్ క్రెజికోవా 6-2, 2-6, 6-4 తేడాతో ఏడో సీడ్ పావోలినిపై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆమె 6 ఏస్‌లు, 28 విన్నర్లు కొట్టింది. తొలి సెట్ మొదటి గేమ్‌లోనే ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసిన క్రెజికోవా దూకుడు ప్రదర్శించింది. తొలి 11 పాయింట్లలో ఆమె 10 గెలిచింది. రెండుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసి చూస్తుండగానే 5-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అదే ఊపులో సెట్ సొంతం చేసుకుంది. దాంతో ఒత్తిడిలోపడ్డ పావోలిని పనైపోయింది అనిపించింది.
కానీ రెండో సెట్లో ఆమె ఉత్తమ ఆటతీరు కనబర్చింది. డ్రాప్, క్రాస్‌కోర్టు షాట్లతో పాయింట్లు రాబట్టింది. రెండో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఆమె ఆపై 3-0తో ఆధిపత్యం చూపింది. మరింత శక్తిని కూడదీసుకుని వేగవంతమైన సర్వీస్‌లతో సెట్‌ను ముగించింది. దాంతో మూడో సెట్ నిర్ణయాత్మకంగా మారింది. మూడో సెట్‌లో విజయం కోసం ఇద్దరు క్రీడాకారిణులు గట్టిగా పోరాడారు. పావోలిని డ్రాప్ షాట్లకు, క్రాస్ కోర్టు షాట్లకు క్రెజికోవా తగిన రీతిలో సమాధానమిచ్చింది. విన్నర్లతో పాయింట్లు రాబట్టింది.
పావోలిని కూడా తగ్గకపోవడంతో ఓ దశలో స్కోరు 3-3తో సమమైంది. ఆ తర్వాత గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను క్రెజికోవా బ్రేక్ చేయడమే మ్యాచ్‌లో మలుపుకు మూలమైంది. ఈ అవకాశాన్ని వాడుకుని ఆమె విజయం దిశగా అడుగులు వేసింది. ఈ సమయంలో ఒత్తిడితో పావోలిని అనవసర తప్పిదాలు చేసింది. పదో గేమ్‌లో మ్యాచ్ పాయింట్ కోసం క్రెజికోవా చెమటోడ్చాల్సి వచ్చింది. చివరకు సర్వీస్‌ను రిటర్న్ చేసేటప్పుడు పావోలిని బంతిని కోర్టు బయటకు కొట్టడంతో క్రెజికోవా ఆనందంలో మునిగిపోయింది. వెంటనే స్టాండ్స్‌లోకి వెళ్లి కుటుంబ సభ్యులు, కోచ్‌లతో సంబరాలు చేసుకుంది.