ఆచూకీ లేని స్టార్‌ రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌

న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌లో భారత్‌ తరఫున రెండు వ్యక్తిగత పతకాలు సాధించిన ఏకైక అథ్లెట్ సుశీల్‌ కుమార్‌.. రెజ్లింగ్‌లో ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఒకే ఒక్క భారత మల్లయోధుడు ఆయ‌న‌.. ఆరు దశాబ్దాల నిరీక్షణ అనంతరం బీజింగ్‌ విశ్వక్రీడల్లో రెజ్లింగ్‌లో పతకం పట్టిన స్టార్‌.. అన్నిటికి మించి పురాతన కాలం నాటి క్రీడకు పూర్వ వైభవం తీసుకొచ్చిన ఘనుడు.. ఇంత ఘనమైన చరిత్ర ఉన్న సుశీల్‌ కుమార్‌ కోసం ప్రస్తుతం మూడు రాష్ర్టాల పోలీసులు వెతుకుతున్నారు. యువ రెజ్లర్‌ […]

  • Publish Date - May 11, 2021 / 09:57 AM IST

న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌లో భారత్‌ తరఫున రెండు వ్యక్తిగత పతకాలు సాధించిన ఏకైక అథ్లెట్ సుశీల్‌ కుమార్‌.. రెజ్లింగ్‌లో ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఒకే ఒక్క భారత మల్లయోధుడు ఆయ‌న‌.. ఆరు దశాబ్దాల నిరీక్షణ అనంతరం బీజింగ్‌ విశ్వక్రీడల్లో రెజ్లింగ్‌లో పతకం పట్టిన స్టార్‌.. అన్నిటికి మించి పురాతన కాలం నాటి క్రీడకు పూర్వ వైభవం తీసుకొచ్చిన ఘనుడు..

ఇంత ఘనమైన చరిత్ర ఉన్న సుశీల్‌ కుమార్‌ కోసం ప్రస్తుతం మూడు రాష్ర్టాల పోలీసులు వెతుకుతున్నారు. యువ రెజ్లర్‌ హత్య కేసులో అతడిపై లుకౌట్‌ సర్క్యులర్‌ జారీ అయింది. వారం రోజులుగా అతడిని విచారించడం కోసం వెతుకుతుంటే.. అతడు మాత్రం హరిద్వార్‌, రుషికేశ్‌, హర్యానా ఇలా తన స్థావరాలు మార్చుతూ పోలీసుల కండ్లు కప్పి తిరుగుతున్నాడు. మల్లయుద్ధానికి స్టార్‌డమ్‌ తెచ్చిపెట్టి.. యువత రెజ్లింగ్‌ వైపు ఆకర్షితులయ్యేలా చేసిన సుశీల్‌.. ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆరోపణలు ఏంటి! అసలు ఆ వివాదం పూర్వాపరాలను పరిశీలిస్తే..

భారత రెజ్లింగ్‌ ముఖచిత్రాన్ని మార్చిన సుశీల్‌ కుమార్‌ ప్రస్తుతం.. ఓ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈనెల 4న దేశ రాజధానిలోని ఛత్రాసాల్‌ స్టేడియంలో జరిగిన ఓ గొడవలో యువ రెజ్లర్‌, జాతీయ జూనియర్‌ చాంపియన్‌ సాగర్‌ రాణా (23) మృతి చెందాడు. రెండు వర్గాల మధ్య జరిగిన గొడవలో తీవ్ర గాయాలపాలైన సాగర్‌ మృతిచెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ గొడవకు ప్రధాన సూత్రధారి సుశీల్‌ కుమార్‌ అని గాయపడ్డ వారు ఫిర్యాదు చేయడంతో అప్పటి నుంచి పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. వారం రోజులు కావొస్తున్నా సుశీల్‌ ఆచూకీ లభించకపోవడంతో సోమవారం లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు.

మసకబారుతున్న ప్రభ
ఇటీవలి కాలంలో మన రెజ్లర్ల పేర్లు పలు వివాదాల్లో వినిపిస్తుండటంతో దేశంలో రెజ్లింగ్‌ ప్రభ మసకబారుతున్నది. రెండు నెలల క్రితం కోచ్‌ సుఖ్‌విందర్‌ మోర్‌.. ఐదుగురి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా తేలగా.. ప్రస్తుతం సుశీల్‌ కూడా దాదాపు అలాంటి ఆరోపణలే ఎదుర్కొంటున్నాడు. తన వైరి వర్గంపై అతడు దగ్గరుండి దాడి చేయించాడనే వాదనలు వినిపిస్తున్నాయి. హత్య జరిగిన స్థలం నుంచి ఐదు వాహనాలు, ఓ గన్‌, రెండు కర్రలు స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఘటన జరిగిన సమయంలో సుశీల్‌ అక్కడే ఉన్నట్లు గుర్తించారు. ఈ అంశంపై స్పందించిన భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) సహాయ కార్యదర్శి వినోద్‌ తోమర్‌ మాట్లాడుతూ.. ‘ఇలాంటి ఘటనల వల్ల రెజ్లింగ్‌ ప్రభ మసకబారుతున్నదనే మాట వాస్తవం. అయితే దురదృష్టవశాత్తు మ్యాట్‌ బయట రెజ్లర్ల చర్యలను మేము నియంత్రిచలేం. బరిలో ఉన్నంత వరకే వారు మా పరిధిలోకి వస్తారు’ అని పేర్కొన్నాడు.

అతడి కనుసన్నల్లోనే..
దేశానికి స్టార్‌ రెజ్లర్లను అందించిన ఛత్రాసాల్‌ స్టేడియం ప్రారంభం నుంచి సుశీల్‌ కుమార్‌ కుటుంబ కనుసన్నల్లోనే ఉంటూ వస్తున్నది. సుశీల్‌తో పాటు యోగేశ్వర్‌ దత్‌, బజరంగ్‌ పునియా, రవి దహియా, దీపక్‌ పునియా వంటి ఎందరో ఆటగాళ్లు రెజ్లింగ్‌లో ఇక్కడే ఓనమాలు నేర్చుకున్నారు. సుశీల్‌ మేనమామ, 1982 ఆసియా క్రీడల చాంపియన్‌ సత్పాల్‌ సింగ్‌ 2016 వరకు ఈ స్టేడియానికి అడిషనల్‌ డైరెక్టర్‌గా పనిచేశాడు. ఆ తర్వాతి నుంచి సుశీల్‌ కుమార్‌ ఓఎస్‌డీగా వ్యవహరిస్తున్నాడు. ఇక్కడ ప్రవేశం నుంచి శిక్షణ వరకు అంతా అతడి అదుపాజ్ఞల్లోనే సాగుతున్నది. ఏర్పాట్లపై పెదవి విప్పే ధైర్యం యువ రెజ్లర్లకు లేదని.. వారి కెరీర్‌లతో ముడిపడిన విషయం కావడంతో ఎవరూ సుశీల్‌కు వ్యతిరేకంగా నోరెత్తరని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఓ ఉద్యోగి వెల్లడించాడు.

వివాదాలు కొత్తేం కాదు..
సుశీల్‌ పేరు వివాదాల్లోకి ఎక్కడం ఇది తొలిసారేం కాదు. 2016 రియో ఒలింపిక్స్‌ సమయంలో సుశీల్‌ పోటీపడాల్సిన విభాగంలో భారత్‌ నుంచి నర్సింగ్‌ యాదవ్‌ అర్హత సాధించాడు. అయితే ఆ తర్వాత జరిపిన డోప్‌ టెస్టులో నర్సింగ్‌ నిషిద్ధ ఉత్ప్రేరకాలు వాడినట్లు తేలింది. దీని వెనుక సుశీల్‌ హస్తం ఉందనే వాదనలు అప్పట్లో బలంగా వినిపించాయి. నర్సింగ్‌ తీసుకుంటున్న ఆహారంలో కావాలనే సుశీల్‌ వర్గం ఉత్ప్రేరకాలు కలిపినట్లు ఆరోపణలొచ్చాయి. 2018 కామన్వెల్త్‌ క్రీడల సమయంలోనూ సుశీల్‌.. సహచర రెజ్లర్‌ ప్రవీణ్‌ రాణాపై చేయి చేసుకొని వార్తల్లోకెక్కాడు.