IPL 2024 RCB vs CSK | చెన్నైని ఓడించి ప్లేఆఫ్స్‌కు బెంగళూరు
రాయల్ చాలెంజర్స్ తీవ్ర ఒత్తిడిని అధిగమించి ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది..చెన్నైని ఓడించి ప్లేఆఫ్స్‌కు సగర్వంగా ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టింది

ఓ అద్భుతం జరిగింది. దాన్ని టీవీల్లో, యాప్‌లో చూసినవారు నిజమైన టి20 థ్రిల్‌ను బ్రహ్మాండంగా అనుభవించారు. టి20 మ్యాచ్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. ఇవాళ అలాగే జరిగింది. దాదాపు ప్లేఆఫ్స్ రేసు నుండి తప్పుకుందనుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సవాలక్ష నిబంధనల మధ్య తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్(Chennai Super Kings)పై ఘనవిజయం సాధించి సగర్వంగా ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టింది. దాదాపు ఫైనల్ రేంజ్లో జరిగిన ఈ మ్యాచ్ (High Voltage Match) ఈ సీజన్‌కే హైలైట్. జియో సినిమా యాప్‌లో ఈ మ్యాచ్‌ను 47 కోట్ల మంది వీక్షించారంటేనే అర్థం చేసుకోవచ్చు ఈ మ్యాచ్ ఎంత ప్రాముఖ్యత సంతరించుకుందో.
టాస్ గెలిచిన మద్రాస్ టీమ్, బెంగళూరులోని వర్ష సూచనను దృష్టిలో ఉంచుకుని ఫీల్డింగ్ ఎంచుకుంది. దాంతో బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు ఇన్నింగ్స్‌ను ధాటిగా ప్రారంభించింది. 3 ఓవర్లలో 31 పరుగుల స్కోరు ఉన్నప్పుడు వరుణుడు అడ్డుపడటంతో కాసేపు ఆటకు అంతరాయం కలిగింది. తిరిగి కాసేపటికి ప్రారంభమైన ఆట పిచ్ తడిగా మారడంతో మందకొడిగా సాగింది. తరువాత జోరు పంజుకున్న ఓపెనర్లు కోహ్లీ, కెప్టన్ డుప్లెసీ దంచి కొట్టారు. ముఖ్యంగా విరాట్ వీరవిహారం చేసి 47 ( 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. తరువాత వచ్చిన రజత్ పటీదార్ కూడా జోరు మీదుండటంతో 11.2 ఓవర్లకే స్కోరు 100 పరుగులు దాటింది. కెప్టెన్ ఔటయిన తర్వాత వచ్చిన కామెరున్ గ్రీన్ కూడా బ్యాట్ ఝుళిపించడంతో స్కోరుబోర్డు పరుగులెత్తింది. చివర్లో వచ్చిన మాక్స్వెల్, దినేశ్ కార్తీక్ కూడా చెరో చెయ్యి వేయడంతో స్కోరు 200 దాటి నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగు భారీ స్కోరు సాధించింది. చెన్నై బౌలర్లలో శార్దుల్ ఠాకుర్ 2 వికెట్లు, దేశ్‌పాండే, సాంట్నర్ చెరో వికెట్ తీసుకున్నారు.
ఇప్పుడు ప్లేఆఫ్స్ సమీకరణం ఎలా ఉందంటే, చెన్నై 201 పరుగులు చేసి ఓడిపోయినా, ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఆలోపు ఔటయితే మాత్రం ప్లేఆఫ్స్‌కు బెంగళూరు బయలుదేరుతుంది.
అనంతరం 219 పరుగుల భారీ లక్ష్యంతో ( గెలవడానికి 219 కావాల్సినా, ప్లేఆఫ్స్‌కు కావాల్సింది 201. కాబట్టి చెన్నై లక్ష్యం 201) బరిలోకి దిగిన చెన్నైకి మొదటి బంతికే షాక్ తగిలింది. కెప్టెన్ రుతురాజ్(0) మాక్స్వెల్ వేసిన మొదటి ఓవర్ తొలిబంతికే వెనుదిరిగాడు. వన్‌డౌన్‌లో వచ్చిన డారెల్ మిచెల్(4) ఆ వెంటనే ఔటయ్యాడు. 19 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయిన చెన్నైని రచిన్ రవీంద్ర(61), అజింక్య రహానే(33) ఆదుకున్నారు. వారు 66 పరుగులు జోడించి ఔటవడంతో క్రమం తప్పకుండా చెన్నై వికెట్లు కోల్పోయింది. ఆశలు పెట్టుకున్నశివం దూబే(7) అలా వచ్చి ఇలా వెళ్లగా, సాంట్నర్(3)ను సిరాజ్ బౌలింగ్‌లో కెప్టెన్ ఫాఫ్ కళ్లుచెదిరే రీతిలో ఒంటిచేత్తో క్యాచ్ పట్టి పెవిలియన్‌కు పంపాడు. చివరి రెండు ఓవర్లలో ప్లేఆఫ్స్‌కు 35 పరుగులు అవసరం ఉన్న స్థితిలో క్రీజ్‌లో ఉన్న జడేజా(), ధోనీ() కాసేపు పోరాడినా ఫలితం దక్కలేదు. చివరి ఓవర్‌కు 17 పరుగులు అవసరమయ్యాయి. మొదటి బంతిని సిక్స్ బాదిన ధోనీ(25) రెండో బంతికి ఔటయ్యాడు. 3వ బంతిని శార్దుల్ వదిలేయగా, 4వ బంతికి ఒక పరుగు, 5,6 బంతులు జడేజాకు అందకుండా యశ్ దయాల్ తెలివిగా విసరడంతో చెన్నై 20 ఓవరల్లో 7 వికెట్ల నష్టానికి 191 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ విధంగా ప్లేఆఫ్స్‌కు 10 పరుగుల దూరంలో ఆగిపోయింది.
అనూహ్యరీతిలో, అద్భుత పోరాటపటిమ కనబరిచిన రాయల్ చాలెంజర్స్ తీవ్ర ఒత్తిడిని అధిగమించి ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. చివరికి 14 పాయింట్లతో, 0.459 రన్‌రేట్‌తో చెన్నైని అధిగమించి ప్లే ఆఫ్స్‌లోకి ఆఖరి టీమ్‌గా ప్రవేశించారు. ఈ విజయంతో ఆర్సీబీ జట్టు సభ్యులు కప్ సొంతం చేసుకున్నంత సంబరాలు చేసుకున్నారు. తీవ్ర భావోద్వేగాలకు గురయ్యారు. స్టేడియంలో ఉన్న ఎంతోమంది అభిమానులతో పాటు కోహ్లీ, ఆయన భార్య అనుష్క ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు.
రేపు జరిగే రెండు ఆఖరు లీగ్ మ్యాచ్‌లతో ప్లేఆఫ్స్‌లో 2,3,4 స్థానాలు ఎవరివో ఖరారవుతాయి