Earth Second Moon | భూమికి మరో చందమామ? నాసా ఏం ధృవీకరిస్తున్నది?
భూమికి మరో చందమామ ఉన్నదా? అవుననే అంటున్నది నాసా.. మనకు తెలియకుండానే 60 ఏళ్లుగా భూమి చుట్టూ తిరుగుతున్న ఈ అర్ధ చంద్రుడు.. 2083 వరకూ తిరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
Earth Second Moon | పొద్దుగుంకితే చందమామ ఆకాశంలో వెన్నెల కురిపిస్తుంటాడు. చీకటిగా ఉండే రాత్రిని వెలిగిస్తాడు. ఈ చందమామను అందుకునేందుకు మనిషి చేయని ప్రయత్నం లేదు. ఇస్రో చంద్రయాన్ పేరుతో ఇప్పటికే ప్రయోగాలు చేసింది. అయితే.. ఇంకో చందమామ కూడా ఉన్నదా? అవుననే అంటున్నది నాసా. భూమికి తాత్కాలిక రెండో చందమామను నాసా ధృవీకరించింది. ఈ చందమామ మరేదో కాదు.. భూమి చుట్టూ కక్ష్యలో తిరుగుతున్న ఒక చిన్న ఆస్టరాయిడ్. ఇది దాదాపుగా భూమితో సింక్ అవుతూ తిరుగుతున్నదని గుర్తించారు. దీనిని ఈ వారంలో యూనివర్సిటీ ఆఫ్ హవాయి పరిశోధకులు గుర్తించారు. ఇది భూమి చుట్టూ సుమారు 60 ఏళ్ల నుంచి తిరుగుతున్నదని, దాని ప్రయాణం 2083 వరకూ కొనసాగే అవకాశం ఉందని ఖగోళ శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఈ గ్రహ శకలాన్ని ‘అర్ధ–చంద్రుడు’ అని అభివర్ణిస్తున్నారు. ఇది సుమారు 18 మీటర్ల నుంచి 36 మీటర్ల వెడల్పుతో ఉందని, సుమారు ఒక సాధారణ భవనం అంత ఉంటుందని చెబుతున్నారు.
ఈ ఖగోళ భాగాన్ని 2025 PN7గా గుర్తించారు. అయితే.. ఇది ఇప్పుడు ఉన్న చందమామలాగ భూమి గురుత్వాకర్షణ శక్తికి లోబడి లేదు. భూమికి అత్యంత సమీపానికి వచ్చినప్పుడు 40 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటుందని, ఇది భూమి నుంచి చంద్రుడికి ఉన్న దూరంతో పోల్చితే పదింతలు ఎక్కువని ఖగోళ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. గరిష్ఠంగా భూమికి కోటీ 70 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సూర్యుడికి ఉన్న గురుత్వాకర్షణ శక్తి కారణంగా అది సమీపంగా రావడం, మళ్లీ దూరంగా వెళ్లిపోవడం జరుగుతున్నాయి. ఇటువంటి మినీ చందమామలు.. సహజంగా భూమి కక్ష్యలో స్వల్పకాలం తిరుగుతుంటాయి. తర్వాత అవి కక్ష్య నుంచి జరిగి ఆకాశంలోకి వెళ్లిపోవడమో లేదా భూ వాతావరణంలోకి ప్రవేశించడమో జరుగుతూ ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఈ మినీ చందమామను తొలుత ఈ ఏడాది మొదట్లో గుర్తించారు. అది కూడా.. ఏదో రొటీన్‌గా టెలిస్కోప్ ద్వారా సర్వే చేస్తుండగా.. దొరికింది. ఆ సమయంలో అస్పష్టంగా ఉన్న ఒక చుక్క మాదిరిగా కనిపించింది. కానీ.. కొంతకాలానికే అది భూమితో అనుబంధంగా తిరుగుతున్న విషయాన్ని గుర్తించారు. మొత్తంగా ఇప్పటి వరకూ ఇటువంటి అర్ధ – చంద్రుళ్లు భూమికి 8 వరకూ ఉన్నాయి. భూమికి సమీపంలోని గురుత్వాకర్షణ శక్తి, గ్రహశకలాలు వాటితో ఎలా వ్యవహరిస్తాయనే సమాచారాన్ని అందించడంలో క్వాసీ మూన్‌లను ముఖ్యమైనవిగా ఖగోళ శాస్త్రజ్ఞులు పరిగణిస్తారు. ఇవి ఎలా ఉన్నా.. భూమికి ప్రధాన చంద్రుడు ఒక్కటే. ఇప్పుడు ఉన్నది. ఇది ప్రభావవంతమైన స్వాభావిక ఉపగ్రహం. అయితే.. ఈ అర్ధ–చంద్రుళ్లు తాత్కాలికం. 2025 PN7 కూడా తాత్కాలికంగా భూమితో ప్రయాణిస్తూ.. కొంతకాలానికి అంతర్థానమైపోతుంది.
ఇవి కూడా చదవండి..
Alien Spacecraft Attack | దాడి చేసేందుకు వస్తున్న గ్రహాంతర వాసులు..? నవంబర్‌లో యుద్ధమేనా!
SPACE WAR | స్పేస్‌వార్ మొదలవుతున్నదా? చంద్రునిపై అణు రియాక్టర్ కోసం అమెరికా, రష్యా-చైనా పోటీ!
Space Elevator | చందమామపైకి నిచ్చెన! సాధ్యాసాధ్యాలేంటి? శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు?
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram