విధాత, హైదరాబాద్ : లక్ష కోట్లకు పైగా ఖర్చు..అప్పులు, వడ్డీల భారానికి తోడు ఎత్తిపోతల మోటార్లతో వేల కోట్ల కరెంటు బిల్లుల భారంతో కాళేశ్వరం ప్రాజెక్టు ఓ పనికిరాని కూలేశ్వర ప్రాజెక్టు అని కాంగ్రెస్ వాదన ఓ వైపు. లేదు లేదు కాళేశ్వరం తెలంగాణ వరదాయిని, ప్రపంచ అద్బుతం అని బీఆర్ఎస్ మరోవైపు వాదన. కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం అని బీజేపీ మరోవైపు విమర్శలు. కాళేశ్వరం ఓ తిప్పిపోతల పథకం అంటూ మరికొందరి వాదనలు. ఇదంతా తెలంగాణ ప్రజలకు నిత్యం వినిపించే వాదనల పర్వమే. వర్షాకాలంలో ఆ పార్టీల వాగ్యుద్ధాలు మరింత ముదిరాయి.
కాళేశ్వరం మేడగడ్డ బ్యారేజీ నుంచి లక్షల క్యూసెక్కుల వరద వృధాగా దిగువకు పోతుందని, కరువు పరిస్థితుల్లో కన్నెపల్లి మోటార్లు ఆన్ చేసి రైతాంగానికి నీరందించాలంటూ బీఆర్ఎస్ వాదిస్తున్న సంగతి తెలిసిందే. కూలేశ్వరంలో నీటి నిల్వ చేసినా..పంపింగ్ చేసినా మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారంలు కూలుతాయని…దిగువన ఊర్లు కొట్టుకపోతాయని కాంగ్రెస్ కౌంటర్ ఇస్తుంది. ఇందుకు ఎన్డీఎస్ఏ నివేదికను ఆధారంగా చూపుతుంది.
వర్షాలతో మారిన సీన్..
కాంగ్రెస్, బీఆర్ఎస్ వాదనల యుద్దం కొనసాగుతుండగానే..అకస్మాత్తుగా ఎగువ ప్రాంతాలతో పాటు తెలంగాణ పరిధిలో కురిసిన తాజా వర్షాలతో ప్రాణహిత, గోదావరి నదులలో వరద పోటెత్తింది. మేడిగడ్డ కన్నెపల్లి పంపింగ్ తో పనిలేకుండానే ఎల్లంపల్లి నిండిపోయింది. దిగువకు నీటిని వదలాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితులపై ఓ యువకుడు తన వ్యవసాయ క్షేత్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై పలు ప్రశ్నలు, విమర్శలు సంధిస్తూ పండిత పామరులకు కూడా సులువుగా అర్ధమయ్యే రీతిలో చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కట్టె కొట్టే తెచ్చే అన్నట్లుగా కాళేశ్వరం ఎత్తిపోతలపై తిట్టిపోత..
కాళేశ్వరం పనికిరాని ప్రాజెక్టు అని, ఒక్క చుక్క నీటిని ఎత్తిపోసే అవసరం లేకుండానే గోదావరి వరదలతో ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండిందని ఆ యువకుడు వీడియోలో దృశ్యాత్మకంగా వివరించాడు. కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని, తుమ్మిడిహట్టితో తక్కువ ఖర్చుతో నిర్మించాల్సిన ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చి..బ్యారేజీలు, పంప్ హౌస్ ల నిర్మాణాలతో వేలకోట్ల ప్రజాధనం వృధా చేసి..రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారంటూ తప్పుబట్టారు. మేడిగడ్డ నుంచి ఓ సారి ఎత్తిపోసే ప్రయత్నం చేసినప్పటికి..వరదల కారణంగా తిరిగి ఆ నీటికి కూడా దిగువకు వదులాల్సిన దుస్థితి ఏర్పడిందని గుర్తు చేశారు. ఆ యువకుడు చేసిన వీడియో కాంగ్రెస్ వాదనకు మద్దతుగా కనిపిస్తున్నప్పటికి…కట్టె కొట్టే తెచ్చే అన్నరీతిలో కాళేశ్వరం ప్రాజెక్టు డొల్లతనాన్ని వివరించిన తీరు పలువురిని ఆకట్టుకుంటుండటం విశేషం.
పనికిరాని కాళేశ్వరం…
ఎల్లంపల్లి హిట్ – మేడిగడ్డ పట్
ఒక్క చుక్క నీటిని ఎత్తిపోసే అవసరం లేకుండానే గోదావరి వరదలతో ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండింది.
ఇన్ని రోజులు కాళేశ్వరం పేరు చెప్పుకుని వేల కోట్ల ప్రజాధనాన్ని
మింగిన కల్వకుంట్ల దొంగలు. pic.twitter.com/BINir2Cdv1— Shashi Kumar Reddy Vura (@vurashashi) August 1, 2026