విధాత, హైదరాబాద్ : లక్ష కోట్లకు పైగా ఖర్చు..అప్పులు, వడ్డీల భారానికి తోడు ఎత్తిపోతల మోటార్లతో వేల కోట్ల కరెంటు బిల్లుల భారంతో కాళేశ్వరం ప్రాజెక్టు ఓ పనికిరాని కూలేశ్వర ప్రాజెక్టు అని కాంగ్రెస్ వాదన ఓ వైపు. లేదు లేదు కాళేశ్వరం తెలంగాణ వరదాయిని, ప్రపంచ అద్బుతం అని బీఆర్ఎస్ మరోవైపు వాదన. కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం అని బీజేపీ మరోవైపు విమర్శలు. కాళేశ్వరం ఓ తిప్పిపోతల పథకం అంటూ మరికొందరి వాదనలు. ఇదంతా తెలంగాణ ప్రజలకు నిత్యం వినిపించే వాదనల పర్వమే. వర్షాకాలంలో ఆ పార్టీల వాగ్యుద్ధాలు మరింత ముదిరాయి.
కాళేశ్వరం మేడగడ్డ బ్యారేజీ నుంచి లక్షల క్యూసెక్కుల వరద వృధాగా దిగువకు పోతుందని, కరువు పరిస్థితుల్లో కన్నెపల్లి మోటార్లు ఆన్ చేసి రైతాంగానికి నీరందించాలంటూ బీఆర్ఎస్ వాదిస్తున్న సంగతి తెలిసిందే. కూలేశ్వరంలో నీటి నిల్వ చేసినా..పంపింగ్ చేసినా మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారంలు కూలుతాయని…దిగువన ఊర్లు కొట్టుకపోతాయని కాంగ్రెస్ కౌంటర్ ఇస్తుంది. ఇందుకు ఎన్డీఎస్ఏ నివేదికను ఆధారంగా చూపుతుంది.
వర్షాలతో మారిన సీన్..
కాంగ్రెస్, బీఆర్ఎస్ వాదనల యుద్దం కొనసాగుతుండగానే..అకస్మాత్తుగా ఎగువ ప్రాంతాలతో పాటు తెలంగాణ పరిధిలో కురిసిన తాజా వర్షాలతో ప్రాణహిత, గోదావరి నదులలో వరద పోటెత్తింది. మేడిగడ్డ కన్నెపల్లి పంపింగ్ తో పనిలేకుండానే ఎల్లంపల్లి నిండిపోయింది. దిగువకు నీటిని వదలాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితులపై ఓ యువకుడు తన వ్యవసాయ క్షేత్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై పలు ప్రశ్నలు, విమర్శలు సంధిస్తూ పండిత పామరులకు కూడా సులువుగా అర్ధమయ్యే రీతిలో చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కట్టె కొట్టే తెచ్చే అన్నట్లుగా కాళేశ్వరం ఎత్తిపోతలపై తిట్టిపోత..
కాళేశ్వరం పనికిరాని ప్రాజెక్టు అని, ఒక్క చుక్క నీటిని ఎత్తిపోసే అవసరం లేకుండానే గోదావరి వరదలతో ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండిందని ఆ యువకుడు వీడియోలో దృశ్యాత్మకంగా వివరించాడు. కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని, తుమ్మిడిహట్టితో తక్కువ ఖర్చుతో నిర్మించాల్సిన ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చి..బ్యారేజీలు, పంప్ హౌస్ ల నిర్మాణాలతో వేలకోట్ల ప్రజాధనం వృధా చేసి..రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారంటూ తప్పుబట్టారు. మేడిగడ్డ నుంచి ఓ సారి ఎత్తిపోసే ప్రయత్నం చేసినప్పటికి..వరదల కారణంగా తిరిగి ఆ నీటికి కూడా దిగువకు వదులాల్సిన దుస్థితి ఏర్పడిందని గుర్తు చేశారు. ఆ యువకుడు చేసిన వీడియో కాంగ్రెస్ వాదనకు మద్దతుగా కనిపిస్తున్నప్పటికి…కట్టె కొట్టే తెచ్చే అన్నరీతిలో కాళేశ్వరం ప్రాజెక్టు డొల్లతనాన్ని వివరించిన తీరు పలువురిని ఆకట్టుకుంటుండటం విశేషం.
ఎస్సారెస్పీ పునరుజ్జీవనం..కేసీఆర్ విజన్
కేసీఆర్ విజన్..ఎస్సారెస్పీ పునరుజ్జీవనం స్కీమ్ కారణంగానే ఇప్పుడు మూడు రోజులుగా ఒకే వరదకాలువతో . ఏకకాలంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి జలాలను మధ్యమానేరుకు ఎత్తిపోస్తుండగా, వరదకాలువ ద్వారా ఎగువన ఉన్న ఎస్సారెస్పీ వైపు ఎత్తిపోస్తున్నారని ఇదంతా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమేనని బీఆర్ఎస్ కౌంటర్ వేస్తుంది. ఎగువ గోదావరి నుంచి ఎస్సారెస్పీకి నీరు రానప్పుడు రోజుకు ఒక టీఎంసీ చొప్పున రెండు నెలల పాటు 60 టీఎంసీల కాళేశ్వరం జలాలను ఎత్తిపోయాలన్న లక్ష్యంత ఈ పునరుజ్జీవ పథకంను కేసీఆర్ నిర్మించారని చెబుతున్నారు. గాయత్రీ పంపుహౌస్ నుంచి వచ్చే గోదావరి జలాలు.. హెడ్ రెగ్యులేటర్ గేట్లు తెరిస్తే దిగువన ఉన్న మధ్యమానేరుకు మూసివేస్తే.. శ్రీరాంసాగర్ కు ఎత్తిపోసేవిధంగా రూపకల్పన చేశారు. గాయత్రీ పంపుహౌస్ ద్వారా కాళేశ్వరం జలాలు ముందుగా వరదకాలువ 99.02వ కిలోమీటర్ వద్ద కలుస్తుండగా, వరదకాలువ 102వ కిలోమీటర్ వద్ద హెడ్ రెగ్యులేటర్ గేట్లు బిగించారు.
శ్రీరాంసాగర్ పాజెక్టు నుంచి మధ్యమానేరు ప్రాజెక్టు వరకు వరదకాలువ పొడవు 122 కిలోమీటర్లు. ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నందిమేడారం ద్వారా గాయత్రీ పంపుహౌస్‌కు నీరు చేరుతున్నది. ఇక్కడి నుంచి నీటిని ఎత్తిపోస్తున్నారు. గాయత్రీ పంపుహౌస్ నుంచి ఎత్తిపోసే నీరు వరదకాలువ 99.02 కిలోమీటర్ వద్ద కలుస్తాయి. ఇక్కడి నుంచి ఎగువకు అంటే ఎస్సారెస్పీ వైపు నీటిని ఎత్తిపోయడానికి జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్ వద్ద (వరదకాలువ 73వ కిలోటర్) మొదటి పంపుహౌస్, జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాజేశ్వర్‌రావుపేట (వరద కాలువ 34వ కిలోమీటర్) వద్ద రెండో పంపుహౌస్, నిజామాబాద్ జిల్లా ముప్కాల్ (వరద కాలువ 0.10 కిలోమీటర్) వద్ద మూడో పంపుహౌస్ ఏర్పాటుచేశారు.
ప్రస్తుతం ఎల్లంపల్లి నుంచి గాయత్రీ పంపుహౌస్ ద్వారా 15,750 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. 10 వేల క్యూసెక్కుల ప్రవాహంతో నీటిని దిగువన ఉన్న మధ్యమానేరు జలాశయానికి విడుదల చేస్తుండగా, ఎస్సారెస్పీ వైపు 5,750 క్యూసెక్కులను ఎత్తిపోస్తున్నారు. జగిత్యాల జిల్లా రాంపూర్ వద్ద పంపుహౌస్ వద్ద ఆరు పంపులను ప్రారంభించి, అక్కడి నుంచి.. రాజేశ్వర్‌రావుపేట పంపుహౌస్‌కు ఎత్తిపోస్తున్నారు. సోమవారం ఉదయం కల్లా రాజేశ్వర్‌రావుపేట పంపుహౌస్ వద్దకు నీరు చేరుకొనే అవకాశం ఉన్నది. అక్కడి నుంచి నీటిని ఎత్తిపోసి వరదకాలువలోకి పంపించనున్నారని..ఇదంతా కేసీఆర్ దూరదృష్టికి నిదర్శనం అని బీఆర్ఎస్ చెబుతుంది.
పనికిరాని కాళేశ్వరం…
ఎల్లంపల్లి హిట్ – మేడిగడ్డ పట్
ఒక్క చుక్క నీటిని ఎత్తిపోసే అవసరం లేకుండానే గోదావరి వరదలతో ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండింది.
ఇన్ని రోజులు కాళేశ్వరం పేరు చెప్పుకుని వేల కోట్ల ప్రజాధనాన్ని
మింగిన కల్వకుంట్ల దొంగలు. pic.twitter.com/BINir2Cdv1— Shashi Kumar Reddy Vura (@vurashashi) August 1, 2026
