నేత కార్మికులకు అండగా ఉంటాం

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం ఇందిరానగర్ లో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుడు అంకారపు మల్లేశం కుటుంబ సభ్యులను ఏఐసిసి ఇంఛార్జి దిపాదాస్ మున్షీ, ఏఐసిసి

  • Publish Date - April 27, 2024 / 08:12 PM IST

  • ఏ ఒక్కరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు
  • నేత కార్మికుడు అంకారపు మల్లేశం కుటుంబాన్ని పరామర్శించిన ఏఐసిసి ఇంఛార్జి దీపాదాస్ మున్షీ

విధాత బ్యూరో, కరీంనగర్: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం ఇందిరానగర్ లో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుడు అంకారపు మల్లేశం కుటుంబ సభ్యులను ఏఐసిసి ఇంఛార్జి దిపాదాస్ మున్షీ, ఏఐసిసి కార్యదర్శులు రోహిత్ చౌదరి, విష్ణు నాథ్, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు శనివారం పరామర్శించారు.

ఈ సందర్భంగా పార్టీ నేతలు మాట్లాడుతూ నేత కార్మికుల ఆత్మహత్యలు దురదృష్టకరమైనవిగా పేర్కొన్నారు. చనిపోయిన కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో శవ రాజకీయాలు తగవని ప్రతిపక్ష పార్టీల నేతలకు హితవు చెప్పారు. ఇలాంటి సమయంలో రాజకీయాలు పక్కన పెట్టి, నేత కార్మికులకు ధైర్యం కల్పించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. సిరిసిల్ల నేత కార్మికుల సమస్యలపై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, సంబంధిత శాఖల మంత్రులు సానుకూల దృక్పథంతో ఉన్నారని చెప్పారు. సిరిసిల్ల వస్త్రాల మార్కెటింగ్ కు హైదరాబాద్ లో ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. గతంలో నేత కార్మికులకు ఉన్న 12వేల అంత్యోదయ కార్డులు, రద్దు చేయడం మూలంగా వారు 35 కిలోల బియ్యం పొందలేకపోతున్నారని తెలిపారు. గతంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వానికి బతుకమ్మ చీరలపైనే ధ్యాస ఉండేదన్నారు.

జీవో ఒకటి ద్వారా గతంలో కన్న ఎక్కువ ఆర్డర్లను ఇక్కడి నేత కార్మికులకు అందజేస్తామని చెప్పారు. గత ప్రభుత్వ చేనేత బకాయిలు క్రమంగా తీర్చే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం నేత కార్మికులకు అండగా ఉంటుందని, అర్హులైన ప్రతి నేత కార్మిక కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, కవ్వంపల్లి సత్యనారాయణ, సిరిసిల్ల కాంగ్రెస్ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డితో పాటు స్థానిక కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Latest News