Sitaram Yechury । నీ ఆశయాల సాధన కోసం కంకణబద్ధులవుతాం కామ్రేడ్..
నీ ఆశయాల సాధన కోసం కంకణబద్ధులవుతాం కామ్రేడ్, అదే మా ఆశయం, లక్ష్యం అంటూ సీపీఐ (ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి పార్టీ రాష్ట్ర కమిటీ ఘన నివాళులర్పించింది. ఆయన మరణం సీపీఐ(ఎం), వామపక్షాలకేకాదు, యావత్ దేశానికే తీరని లోటని సంతాపం వెలిబుచ్చింది.

- మీ మరణం వామపక్షాలకే కాదు.. యావత్ దేశానికే తీరని లోటు…
- అమర్‌రహే సీతారాం ఏచూరి
- కమ్యూనిస్టు యోధుడికి సీపీఐ (ఎం) రాష్ట్ర కమిటీ ఘన నివాళి
- ఎంబీ భవన్‌లో ఏచూరి సంతాప సభ
- సీతారాం చిత్రపటానికి పూలమాలేసి నివాళులర్పించిన నేతలు
Sitaram Yechury । నీ ఆశయాల సాధన కోసం కంకణబద్ధులవుతాం కామ్రేడ్, అదే మా ఆశయం, లక్ష్యం అంటూ సీపీఐ (ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి పార్టీ రాష్ట్ర కమిటీ ఘన నివాళులర్పించింది. ఆయన మరణం సీపీఐ(ఎం), వామపక్షాలకేకాదు, యావత్ దేశానికే తీరని లోటని సంతాపం వెలిబుచ్చింది. గొప్ప సైద్ధాంతిక నిబద్ధతగల నేత, మార్క్కిస్టు మేధావి, ఉత్తమ పార్లమెంటేరియన్, సామాజిక, ఆర్థిక, రాజకీయాంశాలపై అనర్గళంగా మాట్లాడిగలిగిన ఏచూరి కన్నుమూయటం పట్ల దిగ్ర్భాంతిని వ్యక్తం చేసింది. దేశం అత్యంత సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో ఆయన మరణంతో పెద్ద దిక్కును కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేసింది. అనారోగ్యంతో ఢిల్లీలో కన్నుమూసిన సీపీఐ (ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంతాప సభను గురువారం హైదరాబాద్‌లోని ఎంబీ భవన్‌లో నిర్వహించారు. ఆ పార్టీ సిటీ సెంట్రల్ కమిటీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సభలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య, చెరుపల్లి సీతారాములు, జి.నాగయ్య, జూలకంటి రంగారెడ్డితోపాటు పలు ప్రజా సంఘాలకు చెందిన నేతలు, కార్యకర్తలు పాల్గొని ఏచూరికి ఘన నివాళులర్పించారు. తొలుత ఏచూరి చిత్రపటానికి వీరయ్య, చెరుపల్లి, నాగయ్య, జూలకంటి పూలమాలలేసి నివాళులర్పించారు. ఆయన మరణం పట్ల సంతాపాన్ని వెలిబుచ్చుతూ రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు.
ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడుతూ…ఏచూరి ఇక లేరన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. చెన్నైలో పుట్టి, హైదరాబాద్‌లో పాఠశాల విద్యనభ్యసించి, ఢిల్లీ జేఎన్‌యూలో విద్యార్థి నేతగా ఎదిగిన ఆయన… ఎమర్జెన్సీ సమయంలో ఆనాటి ప్రధాని ఇందిరా గాంధీనే ప్రత్యక్షంగా ఎదుర్కొన్నారని తెలిపారు. ఆ సమయంలో ఆయన జైలు జీవితం గడిపారని చెప్పారు. 1974లో ఎస్ ఎఫ్ ఐలో చేరిన ఏచూరి, 50 ఏండ్ల తన సుదీర్థ రాజకీయ జీవితంలో వామపక్ష, ప్రజాతంత్ర ఉద్యమాలకు దశ, దిశా, నిర్దేశం చేశారని వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమ సమయంలో పార్టీ సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు ఎప్పటికప్పుడు మార్గదర్శనం చేస్తూ అండగా నిలిచారని గుర్తు చేశారు. అంతకుముందు విద్యుత్ పోరాటం, భూ పోరాటాల సందర్భంగా ఆయన విలువైన సూచనలు, సలహాలనిచ్చారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం పోరాటం సందర్భంగా అండగా నిలబడ్డారని అన్నారు. ఏచూరి చూపిన బాటలో పయనించటం ద్వారా ఆయన ఆశయాల సాధనకు ప్రతినబూనాలని వీరయ్య ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
నాగయ్య మాట్లాడుతూ… పార్టీలకు అతీతంగా అందరూ అభిమానించే గొప్ప నేత సీతారాం ఏచూరి అని కొనియాడారు. పాలకుల విధానాలను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తూ వాటిని పార్లమెంటు లోపలా, బయటా తూర్పారబట్టిన నేత అని నివాళులర్పించారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాశ్మీర్ జఠిలమైన సమస్యల్లో చిక్కుకున్నప్పుడు వాటిని ఎదుర్కొని ఆ రాష్ట్రంలో అడుగుపెట్టిన ధీశాలి.. ఏచూరి అని తెలిపారు. చెరుపల్లి మాట్లాడుతూ… దేశ రాజకీయాల్లో ఏచూరి సుదీర్ఘకాలంపాటు కీలక, క్రియాశీలక పాత్రను పోషించారని గుర్తు చేశారు. తాను డీవైఎఫ్ ఐలో ఉన్నప్పుడు ఆంధ్రా యూనివర్సిటీలో ఆయన చేసిన ప్రసంగం తనను ఎంతగానో ప్రభావితం చేసిందని అన్నారు. కేంద్రకమిటీ సమావేశాలకు వెళ్లినప్పుడల్లా తెలుగువాడైన ఏచూరీని చూసి తమకు పెద్ద దిక్కు ఉందని అనుకునేవారనీ, ఇప్పుడా అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా వేదికను ఏర్పాటు చేయటంలోను, దాన్ని నిలబెట్టటంలోను, ముందుకు నడిపించటంలోనూ ఆయన పాత్ర మరువలేనిదని చెప్పారు. జూలకంటి మాట్లాడుతూ… ఏచూరితో తనకున్న బంధాన్ని, అనుబంధాన్ని గుర్త చేసుకుంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన త్వరలోనే కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవుతారని భావించామని అన్నారు. కానీ అందుకు భిన్నంగా ఏచూరి మరణ వార్తను వినాల్సి రావటం కలచి వేసిందని వాపోయారు. పార్టీ కార్యకర్తలు, నాయకులను ఆప్యాయంగా, పేరు పెట్టి పిలిచే ఆయన లేకపోవటం దిగ్ర్బాంతికరమని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పార్టీ సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు మా భుజాల మీద తుపాకీ పెట్టి కాల్చొద్దంటూ ఆయన పార్లమెంటులో వ్యాఖ్యానించటం ద్వారా వాటిని ఎదుర్కొనేందుకు మార్గదర్శనం చేశారని వివరించారు. వామపక్ష, ప్రజాతంత్ర శక్తుల మధ్య అనేక భిన్నాభిప్రాయాలున్నా వాటిని ఒప్పించి, మెప్పించి ఒకే వేదిక మీదికి తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కుతందని చెప్పారు. నేపాల్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తినప్పుడు అక్కడ పరిస్థితిని చక్కదిద్దేందుకు వీలుగా ఆ దేశ వామపక్షాల ఆహ్వానం మేరకు ఏచూరి అక్కడికి వెళ్లారని గుర్తు చేశారు. అంతటి కమ్యూనిస్టు మేధావి అయిన సీతారాం మరణం దేశానికి తీరని లోటని ఆయన నివాళులర్పించారు.