విధాత: ఎన్నికల తరుణంలో బీజేపీ నుంచి సాగుతున్న వలసలు పార్టీ అధినాయకత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ రాజకీయ ఆలోచనతో బీజేపీలో పార్టీలో చేరిన పలువురు సీనియర్లు ఒక్కోక్కరుగా పార్టీ నుంచి బయటకు వెళ్లిపోతున్న తీరు తెలంగాణలో అధికారం సాధనపై ఆశలు పెట్టుకున్న కమల దళానికి ఆశనిపాతంలా పరిణమిస్తున్నాయి. మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్ మొదలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, ఎగును రవిందర్‌రెడ్డి, మాజీ ఎంపీలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, వివేక్ వెంకటస్వామిల దాకా కాంగ్రెస్‌లో చేరిపోవడం, మరికొందరూ బీఆరెస్‌లో చేరుతుండటం రాష్ట్ర రాజకీయాల్లో కమల వికాసానికి నష్టదాయకంగా మారింది.
పార్టీలో చేరిన వారికి గౌరవ ప్రదంగా పార్టీ పదవులు కట్టబెట్టినప్పటికి వలసలు మాత్రం ఆగకపోవడం బీజేపీ నాయకత్వాన్ని కలవరపెడుతుంది. ఆగని వలసలతో బీసీ సీఎం నినాదం కూడా ఆశించిన రీతిలో జనంలోకి వెళ్లలేకపోతున్నది. వలసలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నది. అధికారంలో రాలేని పార్టీ ఎవరిని సీఎంగా ప్రకటించినా అయ్యేదేముంటుందన్న నిట్టూర్పులే వినిపిస్తున్నాయి. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఉండి రాష్ట్రంలో స్క్రీనింగ్ కమిటీ చైర్మన్‌గా ఉన్న రాజగోపాల్‌రెడ్డి, మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామిలు బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరిపోయారు. దీంతో ఎన్నికల వేళ అభ్యర్థుల ఎంపికలో, మ్యానిఫెస్టోలో కీలకంగా వ్యవహరించే ఆ రెండు పదవులు ఖాళీ కావడంతో ఆ బాధ్యతల నిర్వాహణలో ప్రతిష్టంభనతో పాటు పార్టీ ప్రతిష్టను పలుచన చేసినట్లయ్యింది.
బీఆరెస్ ముందస్తుగానే తన అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ సైతం 19స్థానాలు మినహా 100స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించేసింది. బీజేపీ రెండు దఫాలుగా 53మంది అభ్యర్థులను మాత్రమే ప్రకటించింది. అభ్యర్థుల ఎంపికలో సంస్థాగతంగా కీలకంగా వ్యవహారించాల్సిన రాజగోపాల్‌రెడ్డినే పార్టీ వీడిపోయారు. నిజానికి ఆయన పార్టీలో స్క్రీనింగ్ కమిటీ చైర్మన్‌గా ఉన్నప్పటికి అభ్యర్థుల ఎంపికలో క్రియాశీలకంగా వ్యవహారించలేదు. పార్టీ మారాలన్న ఆలోచనతోనే ఆయన ఆ బాధ్యతల పట్ల అంటిముట్టనట్లుగా వ్యవహరించారు. దీంతో రాజగోపాల్‌రెడ్డి పార్టీలో ఉన్నా లేకున్నా బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ అభ్యర్థుల ఎంపిక తంతును కొనసాగించడంలో పెద్దగా ఇబ్బంది లేకుండా పోయింది.
మ్యానిఫెస్టో రూపకల్పనలో అదే తీరు !
బీజేపీ మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి సైతం పార్టీ మారిపోవడంతో మ్యానిఫెస్టో రూపకల్పన కసరత్తు కూడా ఇబ్బందిలో పడినట్లయ్యింది. బీఆరెస్ పార్టీ ముందస్తు అభ్యర్థుల ప్రకటన తరహాలోనే మ్యానిఫెస్టోను సైతం ముందుగానే ప్రకటించేసింది. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో ప్రకటనలో వెనుకబడినప్పటికి మ్యానిఫెస్టోకు ప్రతిరూపమన్నుట్లుగా ఇప్పటికే ఆరు గ్యారెంటీలు, డిక్లరేషన్లతో జోరు ప్రజల్లోకి దూసుకెళ్లింది. కాంగ్రెస్ మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్ డి.శ్రీధర్‌బాబు ఇప్పటికే పార్టీ మ్యానిఫెస్టోను కూడా సిద్దం చేయగా, లాంఛన ప్రకటన మాత్రమే మిగిలింది.
చివరకు బీఎస్పీపార్టీ సైతం తన ఎన్నికల మ్యానిఫెస్టోను వెల్లడించింది. బీజేపీ మాత్రం మ్యానిఫెస్టో ప్రకటన కసరత్తు పురోగతి ఎంతవరకు వచ్చిందన్న అంశం వెల్లడించలేకపోగా, ఏకంగా మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్ పార్టీ మారిపోవడం రాజకీయ విషాదమే. కమలం పార్టీలో కీలక పదవుల్లో ఉన్న నేతలే పార్టీని వీడిపోవడం ఎన్నికల వేళ ఆ పార్టీ కేడర్‌ను తీవ్ర నిరుత్సాహానికి గురిచేస్తుంది. ఇప్పటికే బీజేపీ-బీఆరెస్‌లు ఒక్కటేనన్న విపక్షాల ప్రచారంతో నలిగిపోతున్న కమల దళానికి వరుస వలసలు మరింత కలవరపెడుతున్నాయి. సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా ఆయన ప్రభుత్వాన్ని గద్దె దించే శక్తి బీజేపీకి ఉందన్న భావనతో గతంలో కాంగ్రెస్, బీఆరెస్‌ల నుంచి పలువురు సీనియర్ నాయకులు బీజేపీలో చేరారు.
బండి సంజయ్‌ని తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించడం, బీజేపీ-బీఆరెస్‌లు ఒక్కటేనన్న ఆలోచనతో పాటు కాంగ్రెస్ బలపడటం వంటి పరిణామాలు సహజంగానే వారిని అంతర్మథనంలో పడేశాయి. ఈ నేపధ్యంలో కేసీఆర్ వ్యతిరేకంగా బీజేపీ రాజకీయ నిర్ణయాలు తీసుకోలేదన్న భావనకు వచ్చిన సదరు నాయకులు బీఆరెస్‌కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌లోకి వెళ్లేలా చేసింది. ఇదే కోణంలో చంద్రశేఖర్, రాజగోపాల్‌రెడ్డి, వివేక్‌లు కాంగ్రెస్ బాట పట్టగా, విజయశాంతి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డిలు కూడా వారి బాటలోనే పార్టీని వీడుతారా లేక బీజేపీలోనే కొనసాగుతారా అన్నది ఆసక్తికరంగా మారింది.