విధాత, హైదరాబాద్ : నేను ఏరోజూ కూడా పార్టీ తల వంచుకునే పనులు చేయనని, కొందరు నా మీద కుట్రలు పన్ని ఏదో చేయాలని చూస్తున్నారని, రాజకీయంగా ఎదుర్కోలేకే దుష్ప్రచారం చేస్తున్నారని, తప్పుడు ప్రచారం నమ్మకండని..నన్ను నమ్మండని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన బీజేపీ బహిరంగ సభలో బండి సంజయ్ ప్రసంగించారు. తన కొడుకుపై వస్తున్న ఫోక్సో వార్తలపై ఇండైరెక్ట్ గా ఎమోషనల్ గా బండి సంజయ్ స్పందించారు. ధైర్యంగా నేరుగా రాజకీయంగా ఎదుర్కోలేదని దద్దమ్మలైన రాజకీయ ప్రత్యర్థులు ఎదో చేసి, ఎదో చేసి నన్ను, పార్టీని ఇబ్బంది పెట్టాలనుకుంటే..ఊరుకునేది లేదన్నారు.
నేను ఫాంహౌజ్ లో ఎలుకను కాదు. అయ్య పేరు, తాత పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి రాలేదంటూ పరోక్షంగా కేటీఆర్ పై మండిపడ్డారు. నేను పార్టీ జెండాను భుజాలపై పెట్టుకొని కార్యకర్తగా, స్వయం సేవక్ గా, ఏబీవీపీ,బీజేపీ కార్యకర్తగా, మోదీ శిష్యుడిగా ఎదిగానంటూ బండి కంట తడి పెట్టుకున్నారు. నన్ను నమ్మండి… తప్పుడు ప్రచారాలను నమ్మకండి. నా వెంట ఉండాలని, ఈ రోజు నుండే తెలంగాణ రాష్ట్రంలో ధర్మం ఆధారంగా జైశ్రీరామ్… జై తెలంగాణ నినాదాలతో ముందుకెళ్ధాం అని చెప్పారు. కేంద్రం నిధులు ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదు. మేం తెలంగాణకు నిధులిస్తుంటే.. కాంగ్రెస్ నేతలు డీల్లీకి నిధులు పంపుతున్నారన్నారు. జైశ్రీరామ్ అంటే కడుపు నిండుతుందా అని కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని, జైశ్రీరామ్ నినాదమే తమకు పోరాట పఠిమ నేర్పిందన్న , దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చే స్థాయికి ఎదిగిందన్నారు.
