విధాత, హైదరాబాద్ : బీజేపీ అంటేనే హిందువు… హిందువు అంటేనే బీజేపీ అని, 20 శాతం ముస్లింల ప్రయోజనాల కోసమే పనిచేస్తున్న పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్ అని, 80 శాతం మంది హిందువుల పక్షాన పోరాడుతోంది బీజేపీ పార్టీ అని..హిందువుల ఓట్లు అవసరం లేదన్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారంటే ఏమనాలని, ముస్లిం అంటేనే కాంగ్రెస్ అని చెబుతున్నారంటే పరిస్థితి అర్ధం చేసుకోండని..హిందూ ఓటు బ్యాంకు దమ్మేందో జూబ్లిహిల్స్ ప్రజలు చూపెట్టాలని కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) పిలుపునిచ్చారు. పోలింగ్ రోజు జైశ్రీరాం అంటూ పువ్వు గుర్తుపై ఓటేసి దమ్ము చూపండన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్ మాట్లాడారు. ముస్లింలకు కాంగ్రెస్, బీఆర్ ఎస్ వెంట పడి మరీ కుట్టు మిషన్లు, మిక్సర్, గ్రైండర్లు ఇస్తున్నారన్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి డబ్బులు పంచుతున్నాయని, కాంగ్రెస్ రూ.7 వేలు ఇస్తే, బీఆర్ఎస్ రూ.5 వేలు పంచుతోందని ఆరోపించారు. వారిచ్చే డబ్బులు తీసుకోండి… పువ్వు గుర్తుకు ఓటేసి కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు బుద్ది చెప్పండన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఔరంగజేబు వారసులు… బీజేపీ శ్రీరాముడి వారసులు…ఎవరు కావాలో తేల్చుకోండి అన్నారు.
బీజేపీకి ఓటేసి దీపక్ రెడ్డిని ఆశీర్వదిస్తే…కేంద్రంతో మాట్లాడి జూబ్లిహిల్స్ అభివ్రుద్ధికి నిధులు తీసుకొస్తామన్నారు. జూబ్లిహిల్స్ బాగుపడాలంటే కేంద్రమే ఆధారం తప్ప మరొకటి లేదు అన్నారు. బీఆర్ఎస్ పాలనలో బిల్డర్ల వద్దనుండి ఫ్లోర్ లకు ఫ్లోర్ లే తీసుకున్నారని, కాంగ్రెస్ పాలనలో అపార్ట్ మెంట్ కు ఫ్లోర్ కడితే ఎంత ఖర్చయితే అంత బిల్డర్ల నుండి వసూలు చేసి ఆ భారాన్ని కొనుగోలు దారులపై మోపుతున్నారు అన్నారు.
కేసీఆర్ మెడలు వంచినట్లుగానే..కాంగ్రెస్ మెడలు వంచుతాం
ఎప్పటికి అధికారం మాదే అని విర్రవీగిన కేసీఆర్ మెడలు వంచింది బీజేపీయేనని, కాంగ్రెస్ మెడలు వంచి అధికారంలో నుండి దింపేది కూడా బీజేపీయేనని బండి సంజయ్ అన్నారు. స్థానిక ఎంపీ కిషన్ రెడ్డి ఒక్క గజం జాగానైనా కబ్జా చేశారా? ఎక్కడైనా కమీషన్లు తీసుకున్నారా? కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలపై ఉన్నవన్నీ కబ్జాల ఆరోపణలేనని, కమీషన్లు దండుకోవడమే కదా? అన్నారు. కేటీఆర్… ఎన్నడూ డ్రగ్స్ తీసుకోలేదని కుటుంబ సమేతంగా భాగ్యలక్ష్మీ అమ్మవారి వద్ద తడిబట్టలతో ప్రమాణం చేసే దమ్ముందా? అని సవాల్ చేశారు. రేపు ఉదయంలోపు ప్రమాణం చేయ్…అప్పుడు నేనే మీకు జూబ్లిహిల్స్ ప్రజల పక్షాన అప్పీల్ చేస్తానన్నారు. అయ్య పేరు చెప్పి గెలిచిన బతుకు కేటీఆర్ ది…. అయ్య లేకుంటే ఆయనను కుక్కలు కూడా దేకవ్ అని..2014కు ముందే తెలంగాణ కోసం, హిందుత్వం కోసం పోరాడితే 60 కేసులు పెట్టారని, 7సార్లు జైలుకు పోయి వచ్చిన… నీకు నాతో పోలికా? అంటూ కేటీఆర్ పై మండిపడ్డారు.
గోపినాథ్ మరణంపై ఇవిగో ఆధారాలు..విచారణ జరుపండి
గోపీనాథ్ జూన్ 8న చనిపోయారని చెప్పారు…అదేనెల 25న గోపీనాథ్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు? అని సీఎం రేవంత్ రెడ్డిని సంజయ్ ప్రశ్నించారు. ఇదిగో ఆధారాలు… కంప్లయింట్ కాపీ పంపిస్తున్నానని, గోపీనాథ్ కొడుకును ఇండియాకు రాకుండా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ బెదిరించిన మాట వాస్తవం అని, వాటికి సంబంధించిన ఆడియో క్లిప్పింగ్ ను గోపీనాథ్ కుటుంబ సభ్యులు చూపించారు అన్నారు. మాగంటి సునీత తప్పుడు ఆధారాలు చూపించి ఫ్యామిలీ సర్టిఫికేట్ తెచ్చుకుందని, విచారణలో ఆమె తప్పుడు సమాచారమిచ్చినట్లు తేలడంతో ప్రభుత్వం ఫ్యామిలీ సర్టిఫికేట్ ను రద్దు చేసిందని సంజయ్ గుర్తు చేశారు.
ఒక ఓటర్ కార్డులో సునీత భర్త పేరు సునీత మనోహర్ అని ఉంది, ఇంకో ఓటర్ కార్డులో సునీత భర్త పేరు మాగంటి గోపీనాథ్ అని ఉంది అని సంజయ్ వెల్లడించారు. ఇదిగో ఆ ఓటర్ కార్డులను మీకు పంపిస్తున్నా…విచారణ జరపాలని డిమాండ్ చేశారు. 2023 ఎన్నికల అఫిడవిట్ లో మాగంటి సునీతకు చదువుకోలేదని రాసిచ్చారు అని, 2025లో ఎన్నికల అఫిడవిట్ లో టెన్త్ వరకు చదువుకున్నారని రాసిచ్చారు అని, ఇదిగో ఆధారాలు… విచారణ జరపాలన్నారు.
గోపినాథ్ ఆస్తుల కోసం కుట్ర
గోపీనాథ్ ఆస్తులపై సునీతతో కలిసి కేటీఆర్ కుట్ర చేస్తున్నారని, ఆ ఆధారాలను, నా దగ్గరున్న సమాచారాన్ని పోలీసులకు పంపించానని బండి సంజయ్ తెలిపారు. కన్నతల్లిని కూడా గోపీనాథ్ ను చూడనీయకుండా ఏఐజీ ఆసుపత్రి యాజమాన్యంతో నోటీసులిప్పించారు అని, గోపీనాథ్ పై బీఆర్ఎస్ కు ప్రేమ లేనేలేదు అన్నారు. గోపీనాథ్ ఆస్తులను కాజేసేందుకు బీఆర్ఎస్ కుట్ర చేస్తోందని, అందుకే గోపీనాథ్ ఆస్తులను తారుమారు చేసేందుకు ఈ కుట్రలకు తెరదీశారు అని, పొరపాటున బీఆర్ఎస్ ను గెలిపిస్తే… జూబ్లిహిల్స్ ప్రజల ఇండ్ల పత్రాలను తారుమారు చేసి దోచుకుంటారు అని సంజయ్ ఆరోపించారు. జూబ్లిహిల్స్ లోని పార్కులను కూడా చెరబడతారు జాగ్రత్త అన్నారు. కేటీఆర్ తో కలిసి గోపీనాథ్ ఆస్తుల్లో వాటాకు సీఎం రేవంత్ రెడ్డి కుట్ర చేశారని, అందుకే గోపీనాథ్ మరణం మిస్టరీపై, ఆస్తులపై విచారణ జరపడం లేదు అన్నారు. గోపీనాథ్ అపస్మారక స్థితిలో ఏఐజీ ఆసుపత్రిలో ఉంటే ఆయన తల్లిని రానీయ్యలేని, కానీ అదే ఆసుపత్రిలో 9వ ఫ్లోర్ లో కేటీఆర్, ఆయన సతీమణి తిష్టవేసి ఆస్తులను కాజేసే కుట్రకు తెరదీసింది నిజం కాదా? అని సంజయ్ ప్రశ్నించారు. అందుకే చెబుతున్నా..కాంగ్రెస్, బీఆర్ఎస్ లను బండకేసి బాదండి అని సంజయ్ తెలిపారు.
కేంద్రంతోనే అభివృద్దికి మార్గం
సర్వేలన్నీ తారుమారు కావడం ఖాయం…బీజేపీ గెలుపు తథ్యం అని, జూబ్లిహిల్స్ ను డ్రగ్స్ కు అడ్డాగా చేసి సర్వనాశనం చేసిన పార్టీ బీఆర్ఎస్ అని, జూబ్లిహిల్స్ లో కనీస సౌకర్యాల్లేక అధ్వాన్నంగా మారడానికి కారణం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలేనని బండి సంజయ్ విమర్శించారు. 10 ఏళ్లలో రూ.6 లక్షల కోట్లు అప్పు తెచ్చినా కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని, జూబ్లిహిల్స్ లో పేదలకు ఒక్క ఇల్లు కూడా ఇయ్యలేని దుస్థితి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలదేనన్నారు. 2 ఏళ్లలోనే రూ.2 లక్షల కోట్ల అప్పు తెచ్చిన కాంగ్రెస్ వాటిని దోచుకోవడమే తప్ప ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. ప్రభుత్వం వద్ద పైసా లేనప్పుడు అభివ్రుద్ధి ఎలా చేస్తారు? 6 గ్యారంటీలను ఎట్లా అమలు చేస్తారో ప్రజలు ఆలోచించాలి అని సంజయ్ కోరారు. ఇప్పటి వరకు తెలంగాణలో, జూబ్లీహిల్స్ లో అంతో ఇంతో అభివృద్ధి జరుగుతోందంటే అది కేంద్రం చలువేనని, కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉంటే…హైదరాబాద్ అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి అని, హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం ఖర్చు చేసిన నిధుల వివరాలను వెల్లడించేందుకు బీజేపీ సిద్ధంగా ఉందన్నారు.
