మండల్ స్ఫూర్తితో రాజకీయ రిజర్వేషన్లు

సమాజ అభివృద్ధి కోసం ఎనలేని సేవ చేసిన బీసీ లు తమ హక్కులు, అధికారం సాధించేందుకు బీ.పీ మండల్ స్ఫూర్తితో ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరమ్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కూరపాటి రమేశ్ పిలుపునిచ్చారు

మండల్ స్ఫూర్తితో రాజకీయ రిజర్వేషన్లు
  • ఐక్య ఉద్యమాలతోనే సామాజిక న్యాయం
  • బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరమ్ రాష్ట్ర కార్యదర్శి కూరపాటి

విధాత, వరంగల్ ప్రతినిధి : సమాజ అభివృద్ధి కోసం ఎనలేని సేవ చేసిన బీసీ లు తమ హక్కులు, అధికారం సాధించేందుకు బీ.పీ మండల్ స్ఫూర్తితో ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరమ్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కూరపాటి రమేశ్ పిలుపునిచ్చారు. బిందేశ్వర్ ప్రసాద్ మండల్ 107వ జయంతి సందర్భంగా సామాజిక న్యాయం- రాజకీయ పార్టీలు అనే అంశంపై హనుమకొండలో సోమవారం ఇంటలెక్చువల్స్ ఫోరం ఆధ్వర్యంలో మండల పరుశరాములు అధ్యక్ తన జరిగిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సమిష్టిగా పోరాడి రాజకీయ రిజర్వేషన్లు సాధించాలని కోరారు. స్వాతంత్రోద్యమంతో పాటు అన్ని ఉద్యమాల్లో బీసీలు పాల్గొన్నారని గుర్తు చేశారు.

ఐక్య ఉద్యమాల ద్వారానే తెలంగాణ సాధ్యమైందని, పార్టీలకు, కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ఐక్య ఉద్యమాలు చేసిన నాడే బీసీ లకు సామాజికన్యాయం జరుగుతుందని అన్నారు. బీసీ సమాజం నుండి ఎదిగిన వారు త్యాగపూరిత ఉద్యమాలు చేపట్టాలన్నారు. అనంతరం బీసీ మహాసేన రాష్ట్ర కో కన్వీనర్ గొల్లపల్లి వీరస్వామి మాట్లాడుతూ బీ.పీ మండల్ బీసీల అభ్యున్నతి కోసం దేశమంతా పర్యటించి సమగ్ర నివేదికను అందించారన్నారు. ఆయన సూచించిన 40 అంశాల్లో ఒక్కటైన విద్య, ఉద్యోగాల్లో బీసీ రిజర్వేషన్లను అమలు చేయడం నేటికి పరిపూర్ణంగా జరగలేదని తెలిపారు.

మండల్ త్యాగనిరతిని ఆదర్శంగా తీసుకొని మండల్ నివేదిక అమలు కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆల్ ఇండియా ఓబీసీ జాక్ చైర్మన్ సాయిని నరేందర్, ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ, ఫోరం వరంగల్ ఉమ్మడి జిల్లా చైర్మన్ కొంగ వీరాస్వామి, వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వలస సుధీర్ కుమార్, చిల్లా రాజేంద్రప్రసాద్, కొండబత్తుల రమేశ్ బాబు, తీగల జీవన్ గౌడ్, ఎగ్గడి సుందర్ రామ్, రాచకొండ ప్రవీణ్ కుమార్, జన్ను పద్మ, పద్మజాదేవి, తమ్మల శోభారాణి, తిరునగరి శేషు, సింగారపు అరుణ తదితరులు పాల్గొన్నారు.