చెక్కుచెదరని కాంగ్రెస్ నీటి ప్రాజెక్టులు: భట్టి

  • Publish Date - November 9, 2023 / 12:28 PM IST
  • పట్టుమని పదిరోజులకే కూలిన కాళేశ్వరం ప్రాజెక్టు
  • కేసీఆర్ అవినీతి, దోపిడీకి ఇదే నిదర్శనం
  • ఖమ్మంకు నీళ్లిచ్చింది కాంగ్రెస్
  • నాగార్జున సాగర్ తో ఐదేళ్లతో అన్నం తింటున్నాం
  • సీఎల్పీ నేత భట్టి విక్రమార్క


విధాత: ‘ప్రపంచ ప్రజలు వచ్చి చూడాలని గొప్పలు చెప్పిన కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ ప్రభుత్వం కడితే.. పట్టుమని పది రోజులకే కుంగిపోయింది. జాతీయ సేఫ్టీ డ్యాం అధికారులు ఇప్పుడు మళ్లీ ప్రాజెక్టును పునరుద్ధరించాలని నివేదిక ఇచ్చారు. నాగార్జునసాగర్, శ్రీశైలం, ఎస్సారెస్పీ లాంటి భారీ నీటిపారుదల ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కడితే, ఇప్పటికీ చెక్కుచెదరలేదు. కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధి, అవినీతి రహిత పాలనకు ఇదే నిదర్శనం’ అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు.


మధిర నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గురువారం భారీగా తరలివచ్చిన అనుచరులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్బంగా మాట్లాడిన భట్టి, బీఆరెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతి అక్రమాలు, దోపిడీపై దుమ్మెత్తిపోశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పట్టుమని పది రోజులకే కుంగిపోవడం వెనుక యథేచ్ఛగా అవినీతి గూడు కట్టుకుందని ఆరోపించారు.


నాగార్జునసాగర్ ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేపట్టగా, మధిర ప్రజలు ఐదు వేళ్ళతో అన్నం తింటున్నామన్నారు. ఖమ్మం బిడ్డ జలగం వెంగళరావు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం వల్లనే నాగార్జున్ సాగర్ నీళ్లు ఖమ్మంకు రావడానికి సాధ్యమైందని చెప్పారు. ఖమ్మం ఉమ్మడి జిల్లాలో బీపీఎల్ భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, స్పాంజ్ ఐరన్ కంపెనీలు తీసుకువచ్చారని అన్నారు. మళ్లీ అలాంటి అవకాశం ఖమ్మం జిల్లాకు వస్తున్నందున మీరు ఓటు వేసి తనను ఆశీర్వదించాలని కోరారు.


ప్రజల సంపద లూటీ చేస్తున్న కేసీఆర్


అనేక హామీలు, వాగ్దానాలు, మాయమాటలు చెప్పి 10 ఏండ్లుగా మోసం చేసిన బీఆర్ఎస్ పాలన ఇక చెల్లదని, రాష్ట్రంలో తిరుగుబాటు మొదలైందని భట్టి విక్రమార్క అన్నారు. ప్రజల సంపద ప్రజలకు చెందకుండా అడ్డుపడుతూ లూటీ చేస్తున్న దోపిడీ దారుడు, పెద్ద దుర్మార్గుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అని విమర్శించారు. పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల సంపద దోపిడీ చేసినందువల్లే తెలంగాణ అభివృద్ధి జరగలేదన్నారు. కేసీఆర్ కు గజ్వేల్ లో ప్రజల నుంచి సెగ తాకడంతో కామారెడ్డికి పారిపోయాడు.. ప్రజల సెగ తట్టుకోలేక ఆ పెద్దాయన పారిపోతేనే అతి గతి లేదు.


మధిరలో ఈయన ఎంత? నెల రోజుల తర్వాత రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తంచేశారు. ప్రజలు బీఆర్ఎస్ ఆగడాలకు ఇక భయపడాల్సిన అవసరం లేదన్నారు. పోలీసులు, అధికార యంత్రాంగం బీఆర్ఎస్ కు తాబేదారులుగా పనిచేస్తామని అంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదన్నారు. బీఆర్ఎస్ కు తాబేదారుగా పనిచేసే అధికారుల లెక్కలు.. తాము అధికారంలోకి వచ్చాక మిత్తితో సహా లెక్కిస్తాం అని అన్నారు. వందమంది కౌరవులు ఉన్నట్టుగా శాసనసభలో బీఆర్ఎస్ పాలకులు ఒకవైపు ఉంటే..‌ ఐదుగురు శాసనసభ్యులను వెంటపెట్టుకొని పాండవుల వలె అంతిమ విజయం మాదే అని గొంతు ఎత్తి మాట్లాడాను.


అలా అంత ధైర్యంగా మాట్లాడింది. నేను కాదు నన్ను మాట్లాడించింది మధిర ఓటర్ల గొంతు అని భట్టి అన్నారు. ఇటీవల బీఆరెస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఖమ్మం నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై ఐటీ దాడులను ఖండించారు. నామినేషన్ వేళ ఐటీ దాడులతో భయపెట్టాలని చూస్తున్నారని, బీజేపీ, బీఆరెస్ కలసి కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదంటూ, పొంగులేటికి పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ అఖండ మెజార్టీతో విజయాన్ని నమోదు చేస్తుందని భట్టి ధీమా వ్యక్తం చేశారు.