విధాత : అవినీతి, వారసత్వ రాజకీయాలు, కుటుంబ పాలనలో కాంగ్రెస్ బీఆరెస్‌లు కవలల వంటివని, ఆ రెండు పార్టీల డిఎన్‌ఏ ఒక్కటేనని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆ పార్టీలలో పనిచేస్తున్న వారు ఆ కుటుంబాలకు బానిసలుగా వ్యవహారిస్తున్నారన్నారు. సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యమన్నారు. బీసీ సీఎం, ఎస్సీ వర్గీకరణ నిర్ణయాలను సామాజిక న్యాయంలో భాగంగానే తీసుకున్నామన్నారు. దీంతో బీజేపీకి ఆదరణ వస్తుందన్న అక్కసుతో విపక్షాలు తమపై విమర్శలు చేస్తున్నాయన్నారు.
సీఎం కేసీఆర్ లేస్తే మనిషిని కాదంటాడు కాని లేవడని, కాపాల కుక్కల ఉంటానన్న కేసీఆర్ తెలంగాణ ప్రజల పాలిట గుంటనక్కలా తయారయ్యాడన్నారు. ఓట్ల కోసం కాంగ్రెస్, బీఆరెస్‌లు మోసపూరిత వాగ్ధానాలు చేస్తున్నాయన్నారు. ఇప్పటికే ఇచ్చిన హామీలను అమలు చేయని బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు ఎన్నికల ముందు కొత్త హామీలిస్తు ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. పదేళ్లుగా ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వని సీఎం కేసీఆర్ ఇప్పుడు ఎన్నికల కమిషన్‌కు అందుకోసం లేఖ రాయడం పెద్ద విడ్డూరమన్నారు. పదేళ్లలో చేయని పని ఈ పది రోజుల్లో చేస్తామంటే ప్రజలు ఎట్లా నమ్ముతారన్నారు.
బీజేపీ మ్యానిఫెస్టోలో ఆచరణ సాధ్యం కాని హామీలను ఇవ్వబోదన్నారు. మైనార్టీల ఓట్ల కోసం ఆ రెండు పార్టీలు పోటీ పడుతున్నాయన్నారు. ఓవైసీ, రేవంత్ రెడ్డిలు ఇద్దరు కేసీఆర్ కోసమే పని చేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే ఆ పార్టీ ఎమ్మెల్యేలు మళ్లీ బీఆరెస్‌కు అమ్ముడు పోవడం ఖాయమన్నారు. తెలంగాణ ప్రజలు ఆలోచించి తమ ఎమ్మెల్యేలను ఎన్నుకోవాలని తెలంగాణ అభివృద్ధి చెందాలంటే ప్రధాని మోడీ సారద్యంలో రాష్ట్రంలో కేంద్రంలో డబుల్ ఇంజన్ బీజేపీ సర్కార్ రావాలన్నారు.