విధాత, హైదరాబాద్: బీఆరెస్ అధికారంలోకి రాకపోతే తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సంకనాకి పోతుందని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు, బీఆరెస్ ను బూతుల పార్టీగా అభివర్ణించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో బీఆరెస్ బూతుల సంస్కృతిని జనం ఛీకొడుతున్నారని అన్నారు. హరీష్ రావు… ఆయన మామ కేసీఆర్ పుట్టకముందు, కాంగ్రెస్ పుట్టక ముందే హైదరాబాద్ ధనిక నగరంగా, భాగ్యనగరంగా వెలుగొందిందని గుర్తు చేశారు.
నిజాం కంటే ముందు కూడా హైదరాబాద్ నగరం ఉందని, వ్యాపారాలు, కళలకు మారుపేరుగా 450 సంవత్సరాలకు పైగా ప్రపంచాన్ని ఆకర్షించిందని పేర్కొన్నారు. బీఆరెస్ పుట్టుకకు, హైదరాబాద్ కు ఏ మాత్రం సంబంధం లేదని కొట్టిపడేశారు. బీఆరెస్ మాఫియాను ఇక్కడి నుంచి తరిమితే మహానగరం మరింత అభివృద్ధి సాధిస్తుందని, గులాబీ పాలనలో కబ్జాలు, రియల్ ఎస్టేట్ మాఫియా పెట్రేగిపోయిందన్నారు. హైదరాబాద్ లో హమాస్ కు మద్దతుగా ఎంఐఎం ర్యాలీ చేస్తుంటే, బీఆరెస్ మద్దతు ఇవ్వడం సిగ్గుచేట్టన్నారు. ఉగ్రవాదానికి, హింసకు తెలంగాణ ప్రభుత్వం మద్దతు ఇచ్చినట్లేనన్నారు. బీఆరెస్, కాంగ్రెస్ గతంలో పార్టనర్స్ అని, భవిష్యత్తులోనూ పార్ట్ నర్సేనంటూ విమర్శించారు.