Ravi Prakash | ఆర్ టీవీ రవిప్రకాశ్‌కు బిఆర్ఎస్ లీగల్ నోటీసులు
తప్పుడు కథనం ప్రసారం చేసి తమ పరువుకు భంగం కలిగించినందుకుగానూ, ఆర్ టీవీ, దాని సిఈఓ రవిప్రకాశ్‌కు బిఆర్ఎస్ పార్టీ లీగల్ నోటీసులు పంపింది.
బిఆర్ఎస్ పార్టీ(BRS Party), బీజేపీ(BJP)లో విలినమవుతోందంటూ, ప్రత్యేక కథనం పేరుతో ఆర్ టీవీ(RTV) ప్రసారం చేసిన కార్యక్రమంపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సంబంధిత కథనాలను, విడియోలను తమ యూట్యూబ్ చానెల్, డిజిట్ ప్లాట్‌ఫారంలు, సామాజిక మాధ్యమాల నుండి తక్షణమే తొలగించాలని డిమాండ్ చేసింది.
తప్పుడు, పరువునష్టం(Defamatory) కలిగించే వార్తలు, ఉద్దేశపూర్వకంగా అపవాదు(malafide intentions) కలిగించే నిరాధార కథనాలు ప్రసారం చేసినందుకుగానూ, బేషరతుగా క్షమాపణ చెబుతూ, వెంటనే అవన్నీ తమ అన్ని రకాల ప్లాట్ఫారంల నుండి తొలగించాలని బిఆర్ఎస్ ఆ నోటీసు(Legal Notice)లో పేర్కొంది. ఇకనుండి పార్టీకి నష్టం కలిగించే ఎటువంటి ఆక్షేపణీయమైన కథనాలు, వార్తలు ప్రసారం చేసినా, రాబోయే ఐదు రోజుల్లో తమ డిమాండ్లకు ఒప్పుకోకపోయినా, చట్టపరమైన తీవ్రచర్యల(Legal action )కు సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది.
ఎటువంటి ఆధారాలు లేని, దురుద్దేశపూర్వక కథనాలతో, నిరాధార ఆరోపణలతో ఆర్ టీవీ, రవిప్రకాశ్(Ravi Prakash) కథనాలను వండి వారుస్తుందని బిఆర్ఎస్ ఆ నోటీస్‌లో ఆరోపించింది. ఇది నిరంతరాయంగా జరుగుతోందని, కొందరి వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాలకోసమే బిఆర్ఎస్–బిజేపీ విలీనం(BJP-BRS Merger) కథనాలను ఆర్ టీవీ ప్రసారం చేస్తోందని విమర్శించింది. మొదటిసారి ఈ కథనాన్ని ప్రసారం చేస్తూనే, ప్రత్యేకం అని పేర్కొనడం ఆ టీవీ యాజమాన్యం అవలంబిస్తోన్న ప్రణాళికాబద్ధ వైఖరికి అద్దం పడుతోందని, దానివల్ల ప్రజలు, బిఆర్ఎస్ కార్యకర్తలు ఆయోమయానికి గురవుతున్నారని తెలిపింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram