జార్జి రెడ్డి వర్ధంతి, అంబేద్కర్ జయంతి సందర్భంగా ఖిలా వరంగల్లో కొవ్వొత్తుల ర్యాలీ
విధాత, వరంగల్ ప్రతినిధి: దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ మోడీ ప్రభుత్వం దళితులు మైనార్టీలు ఆదివాసులపై దాడులు జరుపుతూ హత్యాకాండ అణచివేతను కొనసాగిస్తుందని పిడిఎస్యు పూర్వ నాయకులు విమర్శించారు. హిందూ మతోన్మాద గుండాలచే హత్య చేయబడ్డ జార్జి రెడ్డి 52వ వర్ధంతి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133వ జయంతి సభను పిడిఎస్ యు పూర్వ విద్యార్థుల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పడమరకోట చమన్ సెంటర్లో రాచర్ల బాలరాజు అధ్యక్షతన జరిగింది.
ముందుగా కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పిడిఎస్యు పూర్వ రాష్ట్ర ఉపాధ్యక్షులు, వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు తీగల జీవన్, పూర్వ రాష్ట్ర కార్యదర్శి బండి కోటేశ్వరరావు మాట్లాడారు.
52 సంవత్సరాల క్రితం ప్రగతిశీల ఉద్యమ నేత జార్జి రెడ్డిని ఉస్మానియా యూనివర్సిటీలో హత్య చేశారని వివరించారు. అదే దారిలో అనేకమంది ప్రజాసామికవాదులను హత్య చేశారని మోడీ ప్రభుత్వాన్ని విమర్శించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ చెప్పినట్లుగా ప్రజాస్వామ్య వ్యవస్థను రాజ్యాంగాన్ని కాపాడుకొనుటకు జరుగు విశాల ఉద్యమాల్లో పాల్గొనాలని కోరారు. రాబోవు పార్లమెంటరీ ఎన్నికల్లో బిజెపిని ఓడించాలని వారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బెల్లంకొండ రమేష్, బొడ్డు కుమార్ స్వామి, జి వెంకటేశ్వర్లు, బైరబోయిన ఐలయ్య, కేడల ప్రసాద్, గండ్రతి హరిబాబు, ఇనుములకృష్ణ , మోహన్ తదితరులు పాల్గొన్నారు.