విధాత: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం కేంద్రం ఎన్నికల సంఘం శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇదే రోజు ఉదయం 11 గంటల నుంచి అభ్యర్థుల నామినేషన్లు తీసుకోనున్నది. ఆదివారం మినహా ఈ నెల 10వ తేదీ వరకు రిటర్నింగ్ అధికారులు నామినేషన్లు స్వీకరిస్తారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు ఈ నెల 30న పోలింగ్ జరుగనున్నది. డిసెంబర్ 3వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది.
పోలింగ్ ప్రక్రియ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)ల ద్వారా నిర్వహిస్తారు. పోస్టల్ బ్యాలట్, ఇంటి వద్ద ఓటు వేసే వారి కోసం సిద్ధం చేసిన బ్యాలెట్ పేపర్ గులాబీ రంగులో ఉండనున్నది. నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాటుచేసిన ఎన్నికల రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. పూర్తి పారదర్శంగా ఉండేందుకు కార్యాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేశారు. నామినేషన్లు అసంపూర్తిగా ఉంటే ఆయా అభ్యర్థులకు అధికారులు నోటీసులు జారీచేస్తారు. పూర్తిగా నింపి ఇవ్వాలని సూచిస్తారు. లేనిపక్షం నామినేషన్‌ను తిరస్కరించే అధికారం రిటర్నింగ్ అధికారులకు ఉంటుంది.
రిటర్నింగ్ అధికారులుగా నియమితులైన ఆర్డీవోలు, అడిషనల్ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లకు ఇప్పటికే శిక్షణ పూర్తి చేశారు. నామినేషన్ వేయడానికి వచ్చే రాజకీయ పార్టీల కార్యకర్తలు, నాయకులను ఆర్వో కార్యాలయాలకు వంద మీటర్ల దూరంలోనే నిలిపివేయనున్నారు. అభ్యర్థితోపాటు మరో ఐదుగురిని మాత్రమే లోపలికి అనుమతిస్తారు.
స్వతంత్ర అభ్యర్థులు ఫ్రీ సింబల్స్‌లో తమకు అనుకూలమైన గుర్తును ఎంపిక చేసుకోవచ్చు. ఒకరి కంటే ఎక్కువ మంది ఒకే గుర్తును కోరుకుంటే లాటరీ విధానంలో కేటాయిస్తారు. అభ్యర్థులు నామినేషన్ వేయడానికి మంచి రోజు కోసం చూస్తున్నారు. ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు మంచి రోజులు ఉన్నందున ఈ మూడు రోజుల్లోనే అధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉన్నది.
పోస్టల్ బ్యాలెట్ ఓటు అర్హులు 13 లక్షలు
రాష్ట్రంలో తొలిసారిగా ఇంటి నుంచి ఓటు వేసే సదుపాయాన్ని ఎన్నికల సంఘం దివ్యాంగులకు, 80 యేండ్ల పైబడిన వారందరికి కల్పించింది. ఇలా ఇంటి వద్దనే ఓటు వేయాలనుకొనేవారు ఈనెల 7వ తేదీలోగా బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్‌వో) దగ్గర ‘12డీ’ ఫారం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. వారికి మాత్రమే ఈ సదుపాయం ఉంటుంది. వీరితో పాటుగా 13 అత్యవసర సేవలు అందించే శాఖల సిబ్బంది, ఉద్యోగులు, అధికారులకు పోస్టల్ ఓటు సౌకర్యం కల్పించారు. వీరు ఆయా శాఖల నోడల్ అధికారుల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ సారి పోస్టల్ ఓటు హక్కు, ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకునే దాదాపుగా 13 లక్షలకు పైగా అర్హులు ఉన్నారు.
ఎన్నికల షెడ్యూల్ ఇలా..
మొత్తం ఓటర్లు: 3.17 కోట్లు
పురుషులు : 1.58 కోట్లు
మహిళలు : 1.58 కోట్లు
ట్రాన్స్‌జెండర్స్ : 2557
దివ్యాంగులు: 5.06 లక్షలు
100 ఏండ్లు దాటిన వారు : 7,689
18, 19 వయస్సు ఉన్న ఓటర్లు: 8.11లక్షలు
పోలింగ్ స్టేషన్లు: 35,356
పట్టణ పోలింగ్ స్టేషన్లు : 14,458
గ్రామీణ పాంతాల్లో పోలింగ్ స్టేషన్లు : 20,898