ఒక్క యూనిట్‌కు రూ.5.64 చెల్లింపు
అప్పిలేట్ ట్రిబ్యునల్‌కు ఛత్తీస్‌గఢ్
అవసరం లేకున్నా మరో వెయ్యి మెగావాట్ల క్యారిడార్
అర్థాంతరంగా రద్దుతో 261 కోట్లకు తాఖీదు
తెలంగాణ ప్రభుత్వ వర్గాల వెల్లడి
హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్ నుంచి కొనుగోలు చేసిన విద్యుత్తుతో తెలంగాణ విద్యుత్తు సంస్థల నష్టాలు అంచనాలకు మించి నష్టపోయాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఒప్పందం ప్రకారం ఒక్క యూనిట్ ధర రూ.3.90 మాత్రమే అని చెబుతున్నప్పటికీ ఈ విద్యుత్తు కొనుగోలుతో రాష్ట్ర విద్యుత్తు సంస్థల నడ్డి విరిగినంత పనైందని అంటున్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం 17,996 మిలియన్ యూనిట్ల విద్యుత్తును కొనుగోలు చేసింది. అందుకోసం రూ.7719 కోట్లు చెల్లించింది. మరో రూ.1081 కోట్లు చెల్లించాల్సి ఉన్నది.
యూనిట్‌కు రూ.5.64
ట్రాన్స్‌మిషన్ లైన్ చార్జీలు అదనంగా రూ.1362 కోట్లు. ఇవన్నీ లెక్కిస్తే ఒక్కో యూనిట్ కొనుగోలుకు రూ.5.64 ఖర్చయిందని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కన చెప్పుకున్న రేటు కంటే వడ్డించిన చార్జీలతో కలుపుకొంటే.. సుమారు రూ.3110 కోట్లు అదనపు భారం రాష్ట్ర ఖజానాపై పడినట్టయిందని వివరిస్తున్నాయి. బకాయిల విషయంలోనూ రెండు రాష్ట్రాల మధ్య వివాదం ఇంకా తేలలేదని సమాచారం. తెలంగాణ లెక్క ప్రకారం బకాయిలు రూ.1081 కోట్లు ఉంటే.. ఛత్తీస్‌గఢ్ విద్యుత్తు సంస్థలు మాత్రం రూ.1715 కోట్లు బకాయిలున్నట్లు చూపుతున్నాయని సమాచారం. బకాయిల వివాదంపై ఛత్తీస్‌గఢ్ ఎలక్రిసిటీ అప్పిలేట్ ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేసింది.
అరకొరగానే సరఫరా ఛత్తీస్‌గఢ్ విద్యుత్తు 2017 చివరి నుంచి అందుబాటులోకి వచ్చింది. అప్పటి నుంచీ అరకొరగానే సరఫరా అయిందని, ఎన్నడూ వెయ్యి మెగావాట్లు సాఫీగా రాలేదని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. అక్కడి నుంచి ఆశించిన సరఫరా తగ్గిపోవటంతో తెలంగాణ డిస్కంలు బహిరంగ మార్కెట్లో విద్యుత్తు కొనుగోలు చేయాల్సి వచ్చింది. దీంతో 2017 నుంచి 2022 వరకు పడిన అదనపు భారం రూ.2083 కోట్లు. 2022 ఏప్రిల్ నుంచి ఈ విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. మరోవైపు ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్తును తెచ్చుకునేందుకు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (పీజీసీఐఎల్)తో 1000 మెగావాట్ల విద్యుత్తు సరఫరాకు కారిడార్‌ను గత తెలంగాణ ప్రభుత్వం బుక్ చేయాల్సి వచ్చింది. ఈ కారిడార్ కూడా విద్యుత్తు సంస్థల కొంప ముంచిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బుకింగ్ ఒప్పందం ప్రకారం విద్యుత్తు తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా పీజీసీఐఎల్‌కు సరఫరా చార్జీలు కట్టితీరాల్సిందే. ఈ లెక్కన వాడకున్నా కట్టిన అదనపు చార్జీలే రూ.638 కోట్లు అని అధికారవర్గాలు చెబుతున్నాయి. దీనికి తోడు గత ప్రభుత్వం నిర్వాకంతో కారిడార్ల బుకింగ్‌తో అదనపు నష్టం వాటిల్లింది. కేవలం 1000 మెగావాట్ల కారిడార్ సరిపోతుండగా.. అనవసరంగా మరో 1000 మెగావాట్ల విద్యుత్తు సరఫరాకు అడ్వాన్సుగా కారిడార్ బుక్ చేసిందని సమాచారం. ఛత్తీస్‌గఢ్ విద్యుత్తు లభించే అవకాశం లేదని ఈ కారిడార్‌ను గత ప్రభుత్వం అర్ధాంతరంగా రద్దు చేసింది. ఈలోగా జరగాల్సినంత నష్టం జరిగింది. పరిహారం కింద రూ.261 కోట్లు కట్టాలని పీజీసీఐఎల్ డిస్కంలకు నోటీసులు జారీ చేసింది. అవగాహన లేకుండా చేసుకున్న కారిడార్ ఒప్పందం చేసుకోవటంతో ఈ సమస్య తలెత్తిందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ఈ విద్యుత్తు కొనుగోలు ఒప్పందానికి ఇప్పటివరకు తెలంగాణ ఈఆర్సీ ఆమోద ముద్ర వేయనే లేదని సమాచారం. ఈఆర్సీ ఆమోదం లేకుండా ఛత్తీస్‌గఢ్‌కు చెల్లించిన వేల కోట్ల రూపాయలన్నీ అడ్డదారి చెల్లింపులుగానే పరిగణించాలనే వాదనలు కూడా ఉన్నాయి.