తెలంగాణ రాష్ట్రం కాకపోతే ఆసిఫాబాద్ జిల్లా కాకపోయేది. ఎన్నో ప్రయత్నాలు చేసినా ఎవరూ కూడా జిల్లా చేయలేదు. మారుమూల ప్రాంతం ఆసిఫాబాద్ జిల్లా అయితదని కలలో కూడా ఎవరూ అనుకోలేదు. కానీ ఇవాళ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి, గిరిజన బిడ్డలకు, పేద వర్గాలకు న్యాయం జరగాలని జిల్లా చేశాం. మీరందరూ చూస్తుండగానే కలెక్టరేట్, ఎస్పీ ఆఫీసు కట్టుకున్నాం. నేనే ప్రారంభించాను. ఆసిఫాబాద్ జిల్లా కావడంతో ఒక మంచి మేలు జరిగింది. వర్షాకాలం వచ్చిందంటే గుట్ట మీద గూడెం, గుట్ట కింద వాగుల నీళ్లు.. ఆ కలుషిత నీళ్లు తాగి అంటురోగాలు వచ్చేవి. గిరిజన బిడ్డలు రోగాల బారిన పడేవారు. మంచం పట్టిన మన్యం అని వార్తలు వచ్చేవి. ఇవాళ ఆ బాధ పోయింది. ఆసిఫాబాద్‌లో మెడికల్ కాలేజీ వస్తదని ఎవరూ అనుకోలేదు. మెడికల్ కాలేజీతో పాటు వందలాది పడకల హాస్పిటల్ కూడా రావడంతో మన్యం బిడ్డలకు మంచి జరిగింది.
తెలంగాణ కోసం పోరాటం చేసిన మహాయోధుడు.. జల్, జంగల్, జమీన్ నినాదంతో కొట్లాడిన మహాయోధుడు మన కొమ్రం భీం. ఆయన పేరు మీద కొమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా అని నామకరణం చేశాను. ఈ విషయం మీ అందరికీ తెలుసు. కొమ్రం భీం పోరాటం చేసిన స్థలంలో కెరెమెరి ఘాట్స్‌ను ఏ గవర్నమెంట్ కూడా పట్టించుకోలేదు. 2014 తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్వయంగా నేనే అక్కడికి వెళ్లి.. కొమ్రం భీం స్మారక చిహ్నం నిర్మాణం చేసుకున్నాం. ఇవన్నీ మీ కండ్ల ముందున్నాయి.. జరిగాయి.
బీఆర్ఎస్ గవర్నమెంట్‌లో ఆసిఫాబాద్‌లో 47 వేల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చాం. వారందరికీ రైతుబందు ఇచ్చాం. రైతుబీమా కూడా పెట్టుకున్నాం. కాగజ్‌నగర్‌లో ఇద్దరు గిరిజనులు చనిపోతే రూ. 5 లక్షల చొప్పున బీమా అందిందని కోనేరు కోనప్ప చెప్పారు. ఆదివాసీ, లంబాడీ తండాలకు త్రీ ఫేజ్ కరెంట్ సదుపాయం కూడా కల్పిస్తున్నాం. ఇంకా మిగిలి ఉంటే అది కూడా పూర్తువుతుంది.
గిరిజనుల కోసం పోడు పట్టాలు ఇచ్చాం. ఈ నియోజకవర్గంలో ఆరె, మాలి కులస్తులు ఉన్నారు. ఆరె కులస్తులకు ఓబీసీ కావాలని అడుగుతున్నారు. అది రావడం లేదు. తప్పకుండా దాని గురించి ఫైట్ చేసి, వారి సంక్షేమాన్ని పట్టించుకుంటాం. మాలి కులస్తుల విషయంలో మేం తీర్మానం చేసి పంపించాం.. కానీ కేంద్రం పట్టించుకోవడం లేదు. మాలి కులస్తులు కాగజ్‌నగర్, ఆసిఫాబాద్‌లో ఉన్నారు. ప్రత్యేక డబ్బులు వెచ్చించి వారి సంక్షేమం కోసం కృషి చేస్తాం. బీఆర్ఎస్ ప్రభుత్వానికి కులం లేదు, మతం లేదు.. జాతి లేదు. అందర్నీ కలుపుకుపోతున్నాం.
మునపటి లాగా కల్తీ నీళ్లు తాగి మరణాలు లేవు. గిరిజనుల లభివృద్ధి చేసుకుంటున్నాం. గిరిజన బిడ్డల కోసం గురుకులాలు పెట్టుకున్నాం.. పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు. ఎంబీబీఎస్, ఇంజినీరింగ్‌లో సీట్లు వస్తున్నాయి. ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ రావాలి. కాంగ్రెస్‌కు అప్పగిస్తే రైతుబంధు రాంరాం.. పట్వారీలు, దళారీల రాజ్యం వస్తది. ఆగమైపోయే అవకాశం ఉంటుంది. అబివృద్ధి చెందుతున్న తెలంగాణ ఇదే విధంగా అబివృద్ధి చెందాలి కాబట్టే కోవా లక్ష్మీని భారీ మెజార్టీతో గెలిపించాలి. ఆత్రం సక్కుకు లభించే స్థానం లభిస్తుంది. ఇటీవల పార్టీలో చేరిన సరస్వతికి రాజకీయ భవిష్యత్ ఇస్తానని హామీ ఇస్తున్నానన్నారు.