విధాత : కాంగ్రెస్ పార్టీలో డజన్ మంది ముఖ్యమంత్రులు ఉన్నారని, ప్రతి ఒక్కరూ తనను గెలిపిస్తే తానే సీఎం అని చెప్పుకొంటున్నారని ముఖ్యమంత్రి, బీఆరెస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు ఎద్దేవా చేశారు. ‘ప్రతి ఒక్కరూ నన్ను గెలిపించండి నేను ముఖ్యమంత్రి అయితా అంటున్నారు. అసలు కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదు’ అని తెలిపారు. ఒక్క హుజుర్‌నగర్‌లోనే కాదు.. దేశమంతా కాంగ్రెస్ పార్టీది అదే పరిస్థితని చెప్పారు.
ఎన్నికల్లో పార్టీల తరఫున నిలబడే వ్యక్తులనే కాదు.. ఆ పార్టీల నైజం, దృక్పథం గురించి తెలుసుకోవాలని సూచించారు. మంగళవారం హుజూర్‌నగర్, మిర్యాలగూడ, దేవరకొండ నియోజకవర్గాల ప్రజాఆశీర్వాద సభల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం పడిన ఇబ్బందులను, స్వరాష్ట్రంలో సాధించుకున్న విజయాలను ఆయన వివరించారు.
తెలంగాణకు కాంగ్రెస్ మోసాలు
నాగార్జున సాగర్‌ను కట్టాల్సింది ఇప్పుడున్న ప్రాంతానికి 20 కిలోమీటర్ల ఎగువన అని సీఎం కేసీఆర్ తెలిపారు. కానీ.. దాన్ని ఆనాటి ఆంధ్రపాలకులు టక్కుటమారం చేసి. కిందికి తెస్తే ఆనాడు ఇదే తెలంగాణ కాంగ్రెస్ నేతలు నోరు మూసుకున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో 1956లో కాల్పుల్లో విద్యార్థులు చనిపోతే తెలంగాణ అప్పటి నాయకత్వం నోరు మూసుకున్నదని ఆరోపించారు.
ఢిల్లీకి పోయి ఉన్న తెలంగాణను ఊడగొట్టిన పాపాత్ములని మండిపడ్డారు. కాంగ్రెస్ వారికి పదవులు, మంత్రి పదవి వస్తే చాలని, ప్రజలు ఏమై పోయినా పట్టించుకోరని విమర్శించారు. 2004లో తెలంగాణ ఇస్తామని నమ్మబలికి తమ పార్టీతో పొత్తు పెట్టుకుని మోసం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి తెలంగాణకు ఒక్క పైసా కూడా ఇవ్వనంటే ఇక్కడి నేతలు ఒక్కరైనా ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు.
మొనగాళ్లు నా తెలంగాణ రైతులు
‘రైతుబంధు పథకం సహా ఇతర వ్యవసాయ పథకాలను అమలు చేయడంతో కేసీఆర్ కలను నిజం చేసిన మొగోళ్లు.. మొనగాళ్లు నా తెలంగాణ రైతులు’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. రైతుబంధు పదాన్ని ఈ ప్రపంచంలో పుట్టించిందే తానని తెలిపారు. రైతుబంధు మంచిది కాదని కాంగ్రెస్ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అంటున్నారన్న సీఎం.. రైతుబంధు వద్దనేవారికి తగిన బుద్ధి చెప్పాలని, నవంబర్ 30న గుద్దుడు గుద్దితే పోలింగ్ బాక్సులు పగిలిపోవాలని అన్నారు.
మీ బాధలు తెలిసే ధరణి తెచ్చాం
ధరణిని తీసేస్తే పైరవీకారుల రాజ్యం వస్తుందని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. ‘మూడు గంటల కరెంట్ అనేటోడు అసలు ఎక్కడన్న పొలం దున్నిండా? నీకు ఎవుసం లేదు.. ఎద్దు లేదు.. రాహుల్ గాంధీ నాగలి దున్నిండో, ఎవుసం ఉందో తెలియదు కానీ.. ధరణిని తీసేస్తాం అంటున్నరు. ఒక రైతుకు ఏడెనిమిది భర్తలు ఉండేవారు. ఈ బాధలన్నీ నాకు తెలుసు. తెల్లారేసరికి భూములు వేరే వారి మీద ఎక్కించేవారు’ అని గుర్తు చేశారు.
ప్రశాంతంగా రాష్ట్రం
రాష్ట్రంలో పదేండ్ల నుంచి కర్ఫ్యూ లేదు.. మతకల్లోలం లేదు.. చీమ కూడా చిటుక్కుమనలేదు. హిందూ, ముస్లింలందరూ కలిసి బ్రహ్మాండంగా ముందుకు వెళ్తున్నారని కేసీఆర్ తెలిపారు. దుబ్బాక బీఆరెస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై దాడిని ప్రస్తావించిన సీఎం.. అదృష్టం బాగుండి ఆయన బతికి బయటపడ్డారని చెప్పారు. తాము ఎన్నడూ అరాచకాలు చేయలేదన్నారు.
సాగర్ రైతులకు శుభవార్త
నాగార్జున సాగర్ ఆయకట్టు రైతుల సాగునీటి కష్టాలను తొలగించేందుకు అద్భుతమైన పథకాన్ని తీసుకురాబోతున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. కాళేశ్వరం జలాలను ఆసిఫ్‌నగర్ కెనాల్ ద్వారా తెస్తే డైరెక్టర్‌గా నల్లగొండ ఉదయసముద్రానికి నీళ్లు వస్తాయని, దాని నుంచి పెద్దదేవులపల్లి చెరువులోకి నీరు తీసుకురావొచ్చని అన్నారు. ఈ స్కీమ్ అంతా సిద్ధమైందని, వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిపిస్తే నల్లగొండను గోదావరికి లింకు చేస్తామని హామీ ఇచ్చారు.
రేవంత్‌రెడ్డి మూడు గంటలు కరెంటు చాలంటున్నారని, కర్ణాటకలో 24 గంటల కరెంటు ఇస్తామని ఐదుగంటలే ఇస్తున్నారని చెప్పారు. ‘కేసీఆర్ నువ్వు కావాలంటే మా కర్నాటకు రా.. మా అందం చూడు ఇగ.. మేం ఐదుగంటల కరెంటు ఇస్తున్నం అంటున్నడు. ఇక్కడ 24గంటలు కరెంటు ఇస్తున్నం సన్నాసి.. నీ ఐదుగంటలకు నేనేమి రావాలి? చెప్పేందుకు కనీసం సిగ్గుపడాలి’ అన్నారు.