ధ‌ర్మ‌పురిలో గోదావ‌రి ఉన్న‌ది కూడా మ‌రిచిపోయారు: సీఎం కేసీఆర్

  • Publish Date - November 2, 2023 / 12:20 PM IST

తెలంగాణ ప్ర‌జ‌ల కొంగు బంగార‌మైన‌టువంటి శ్రీ ల‌క్ష్మీన‌ర‌సింహ్మా స్వామి వారి కొలువైన‌టువంటి ప్ర‌విత్ర క్షేత్ర‌మైన ధ‌ర్మ‌పురి భూమికి నేను శిర‌స్సు వంచి న‌మ‌స్కారం చేస్తున్నాను. ఇక్క‌డ శేష‌ప్ప క‌వి భూషణ వికాస! శ్రీధర్మ పుర నివాస! దుష్ట సంహార! నరసింహ! దురితదూర! అని చెప్పి రాసిన‌టువంటి ప‌ద్యాలు మ‌న‌మంతా చిన్న‌ప్ప‌ట్నుంచి చ‌దువుకున్న వాళ్ల‌మే. ఒక్క మాట‌లో చెప్పాలంటే బీఆర్ఎస్‌కు, బీజేపీకి, కాంగ్రెస్‌కు ఉండే తేడా.. నేను ఉద్య‌మం జ‌రిగే సంద‌ర్భంలో ఈ క్షేత్రానికి వ‌చ్చి స్వామి వారిని ద‌ర్శించుకుని, గోదావ‌రి పుష్క‌రాల గురించి డిమాండ్ చేసే దాకా ఇక్క‌డున్న ఏ నాయ‌కుడికి కూడా సోయి లేకుండే.


ధ‌ర్మ‌పురిలో గోదావ‌రి ఉన్న‌ది కూడా మ‌రిచిపోయారు. గోదావ‌రి పుష్క‌రాలు అంటే రాజ‌మండ్రి, కృష్ణా పుష్క‌రాలు అంటే చ‌క్క‌గా విజ‌య‌వాడ‌.. అక్క‌డ‌కు పోవాలి. గుండు కొట్టించుకోవాలి. జేబులు ఖాళీ చేయాలి. మ‌నం రావాలి. త‌ర్వాత నేను డిమాండ్ చేసి ప్ర‌తిజ్ఞ చేశాను. ఇక్కడే జ‌ర‌గాల‌ని ప‌ట్టుబ‌డితే ఆ ఏడాదే గొప్పగా జ‌రిగాయి. తెలంగాణ వ‌చ్చిన త‌ర్వాత చాలా ఘ‌నంగా గోదావ‌రి పుష్క‌రాలు నిర్వ‌హించుకున్నాం. అలాంటి నిర్ల‌క్ష్యానికి గురైన తెలంగాణ ప్ర‌జ‌ల బాగు కోసం, ప్ర‌జ‌ల హ‌క్కు ల కోసం పుట్టిందే బీఆర్ఎస్ పార్టీ.


ప్ర‌జాస్వామ్యంలో ఓటు వ‌జ్రాయుధం.. ఆ ఓటు నీత‌ల‌రాత‌ను మారుస్త‌ది.. నీ భ‌విష్య‌త్‌ను నిర్ణ‌యం చేస్త‌ది. అందుకే ఆషామాషీగా ఓటు వేయొద్దు. గ‌తంలో కాంగ్రెస్ పార్టీ 50 ఏండ్లు ప‌రిపాలించింది. మ‌ళ్లా ఇవాళ వ‌చ్చి ఒక్క‌సారి మాకు ఛాన్స్ ఇవ్వండ‌ని అంటున్న‌రు. ఎందుకు పంటికి అంట‌కుండా మింగుదామ‌నా..? దేనికి మీకు..? ఒక్క సారి కాదు.. 11, 12 సార్లు ఛాన్స్ ఇచ్చారు. మీకు ఇవ్వ‌లేద‌ని కాదు. ఈశ్వ‌ర్ ఎమ్మెల్యే అయ్యాక ధ‌ర్మ‌పురి ఎలా ఉంది.. అంత‌కుముందు ఎట్ల ఉండేనో తేడా గ‌మ‌నించాలి. టెయిల్ ఎండ్ కాలువ‌లు ఉన్నాయి.. ఆ రోళ్ల‌వాగు ప్రాజెక్టు అని స‌తాయించిండు. నా వెంట‌ప‌డి ఆ ప‌నులు చేయించాడు. ఇవాళ దాదాపు 1 ల‌క్ష 30 వేల ఎక‌రాలు సాగు అవుతుంది. ఈ తేడాను మీరు గ‌మ‌నించాలి.


గ‌తంలో ఎమ్మెల్యేలు అయ్యారు కానీ వారు ధ‌ర్మ‌పురి అభివృద్ధి చేయ‌లేదు. ఈశ్వ‌ర్ పీరియ‌డ్‌లో అభివృద్ధి జ‌రిగింది. వాగుల‌పై చెక్ డ్యాంలు క‌ట్టించారు. మిష‌న్ కాక‌తీయ కింద చెరువుల‌ను బాగు చేసుకున్నాం. తెలంగాణ వ‌చ్చిన కొత్త‌లో చిమ్మ‌చీక‌ట్లు, మంచి, సాగునీళ్లు లేవు. వ‌ల‌స బ‌తుకులు, ఎక్క‌డ చూసినా అంధ‌కార‌మే. మూడు నాలుగు నెల‌లు మెద‌డును రంగ‌రించి, అనేక కార్య‌క్ర‌మాలు అమ‌లు చేశాం. ఇప్పుడు క‌రెంట్, తాగు నీటికి ఇబ్బంది లేదు. సాగునీటి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకున్నాం. ప్ర‌ధాని రాష్ట్రంలో కూడా 24 గంట‌ల క‌రెంట్ ఇస్త‌లేరు.


ప్ర‌ధాని మోదీకి ఓ పిచ్చి ప‌ట్టుకుంది. అదే ప్ర‌యివేటైజేష‌న్.. రైళ్లు, ఓడ‌రేవులు, విమానాలు ప్ర‌యివేటైజేష‌న్.. ఆఖ‌రుకు క‌రెంట్ కూడా ప్ర‌యివేటు. రైతుల మోటార్ల‌కు మీట‌ర్లు పెట్టి బిల్లులు వ‌సూళ్లు చేయాల‌ని చెప్పిండు. చ‌చ్చినా స‌రే పెట్ట‌ను ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పాను. మ‌న‌కు రావాల్సిన ఏడాదికి 5 వేల కోట్లు క‌ట్ చేశారు. 25 వేల కోట్లు న‌ష్ట‌పోతూ కూడా మీట‌ర్లు పెట్ట‌లేదు. భ‌విష్య‌త్‌లో కూడా మీట‌ర్లు పెట్టం. ఈ తేడాను గ‌మ‌నించాలి.


అంత‌కుముందు రైతుబంధు లేదు.. రాబందులే త‌ప్ప రైతుబంధులు లేరు. రైతు బంధు అమ‌లుతో రైతుల ముఖాలు తెల్ల‌ప‌డుతున్నాయి. అప్పులు క‌ట్టుకుంటున్నారు. సొంత పెట్టుబ‌డి పెట్టుకుంటున్న‌రు. వ‌డ్డీల బాధ త‌ప్పింది. ఆ ర‌కంగా వ్వ‌య‌సాయం నిల‌బ‌డింది. పండించిన ధాన్యాన్ని కొంటున్నాం. పైస‌లు కూడా వెంట‌నే జ‌మ చేస్తున్నాం. వెంట‌నే మీరు బ్యాంక్‌కు వెళ్లి తీసుకుంటున్నారు. ధ‌ర‌ణిని తీసేస్తామ‌ని రాహుల్ గాంధీ అంటున్నారు. ధ‌ర‌ణి పోర్ట‌ల్ వ‌చ్చిన త‌ర్వాత భూములు సేఫ్‌గా ఉన్నాయి. మండ‌ల కేంద్రాల్లోనే రిజిస్ట్రేష‌న్లు అయిపోతున్నాయి. ద‌ళారీ లేడు, రూపాయి లంచం లేదు.


కొప్పుల ఈశ్వర్‌ను భారీ మెజారిటీతో గెలిపిస్తే హుజూరాబాద్‌ తరహాలో ఒకేసారి నియోజకవర్గం మొత్తానికి దళితబంధు పథకాన్ని అమలు చేస్తాం. ‘దళితబంధు తీసుకురావాలని ఎవరూ నన్ను అడుగలేదు. దళిత ఎమ్మెల్యేలు, ఎంపీలతో మాట్లాడి పెట్టాను. ఈ సభతో ఈశ్వర్‌ రిజల్ట్‌ డిక్లేర్‌ అయిపోయింది.. గెలిచిపోయిండని తెలిసిపోయింది. నేను మీ అందరికీ ఒక్కటే హామీ ఇస్తున్నా. కొప్పుల ఈశ్వర్‌ 70-80వేల ఓట్ల మెజారిటీతో గెలవాలి. ధర్మపురి నియోజకవర్గం మొత్తానికి హుజూరాబాద్‌లో మాదిరిగా ఒకేసారి దళితబంధు పథకాన్ని మంజూరు చేయిస్తా. ప్రతి ఇంటికి కూడా దళితబంధు పథకం వస్తుంది’.


‘దళితబంధు ఎందుకు తీసుకువచ్చాం. తిన్నది అరగకనా? రైతుబంధుతో ఎట్లయితే రైతులను ఆదుకుంటున్నమో.. దళితబిడ్డలు, సమాజం దగా చేయబడ్డది. తరతరాల నుంచి దోపిడీకి గురైంది. అణచివేయిబడ్డది. ఆ సమాజం అలా ఉండడం మనందరికీ సిగ్గుచేటు. వాళ్లు కూడా సాటి మనుషులే. వారిని ఎట్టి పరిస్థితుల్లో పైకి తేవాలని.. సమాజం బాగుపడాలని స్వయంగా ఆలోచించి తీసుకువచ్చిన పథకమే దళితబంధు.


భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి కూడా దళితబంధు గురించి ఆలోచన చేయాలి. దళితులను ఓటుబ్యాంకు వాడుకున్నారు తప్ప.. ఎన్నడూ చేసిన పాపానపోలేదు. సమాజంలో ప్రతి వర్గానికి పైకి తీసుకురావాలని.. చేతనైంతగా, ఉన్నంతలో అమలు చేస్తున్నది. దఫాదఫాలుగా అయినా ధర్మంగా చేయాలని రాష్ట్రల ఖజానాను ప్రజల కోసమే ఖర్చు చేస్తున్నాం. సంపదను పెంచుతున్నాం. పేదలకు పంచుతున్నాం. సమాజం పైకి వస్తున్నది’ అన్నారు.


‘ఏదైనా రాష్ట్రం పైకి వచ్చిందా? లేదా అనడానికి ఓ గీటురాయి, కొలమానం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా చూసే కొలమానం ఏంటంటే.. ఆ దేశమైతే ఆ దేశ తలసరి ఆదాయం ఎంత? చూస్తరు. దేశంలో ఏ రాష్ట్రం తలసరి ఆదాయం ఎంత అని చూస్తారు. నేను గర్వంగా చెబుతున్నా.. తెలంగాణ వచ్చిన రోజు మన స్థానం పదిహేనో పదహారో స్థానంలో ఉండే. గతంలో లక్షలోపు తలసారి ఆదాయం ఉండే.. ఈ రోజు 3.18లక్షల తలసరి ఆదాయంతో దేశంలోనే నెంబర్‌వన్‌గా ఉన్నాం. తాగునీటి సరఫరా, కరెంటు, విద్యుత్‌ తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్‌ వన్‌గా ఉన్నది. పది సంవత్సరాల చిన్న వయసే ఉన్నా.. అనేక రంగాల్లో మంచి మార్పులు తెచ్చి రాష్ట్రాన్ని బాగు చేసి ముందుకుపోతున్నాం’.


‘కులం, మతం అని చూడకుండా యావన్‌మంది మంది ప్రజలు మనబిడ్డలే కాబట్టి చేసుకుంటూ పోతున్నాం. ధర్మపురి ఆలయ అభివృద్ధికి రూ.100కోట్లు మంజూరు చేసుకున్నాం. పనులు జరుగుతున్నయ్‌.. ఇంకా జరగాల్సి ఉంటే.. మరింత డబ్బు మంజూరు చేసుకొని అద్భుతమైన పుణ్యక్షేత్రంగా మార్చుకుందాం. మీ అందరిని కోరేది ఒకటే. కొప్పుల ఈశ్వర్‌ సౌమ్యుడు. కార్మికుడిగా పని చేసి పైకి వచ్చిన వ్యక్తి. ఎవరినీ ఒకమాట కూడా గట్టిగా మాట్లాడని వ్యక్తి. ఈశ్వర్‌లాంటి వ్యక్తి గెలిస్తే ధర్మపురి చాలా అద్భుతంగా ముందుకు వెళ్తుంది. కారు గుర్తుకు ఓటేసి బ్రహ్మాండమైన మెజారిటీతో ఈశ్వర్‌ను గెలిపించాలి’.