కాలనాగులాంటి మోదీ.. మనసులో పగ పెట్టుకుంటారు

రిజర్వేషన్లు రద్దు కావాలంటే బీజేపీకి ఓటు వేయాలని, రిజర్వేషన్లు పెరగాలంటే కాంగ్రెస్‌కు అండగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. మీ భవిష్యత్ మీ చేతుల్లోనే ఉందని చెప్పారు

  • Publish Date - April 26, 2024 / 09:30 PM IST

  • నల్ల చట్టాలపై కొట్లాడిన రైతులపై పగ పట్టారు
  • రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి రైతులను
  • అదానీ, అంబానీలకు బానిసలను చేస్తారు
  • బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ
  • ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నది
  • బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుంది
  • మేం గెలిస్తే రిజర్వేషన్లు పెంచుతాం
  • కుల గణనతోనే బీసీలకు సరైన న్యాయం
  • అందుకే తీర్మానం ఆమోదించుకున్నాం
  • జహీరాబాద్‌ సభలో సీఎం రేవంత్‌రెడ్డి

జహీరాబాద్‌ : రిజర్వేషన్లు రద్దు కావాలంటే బీజేపీకి ఓటు వేయాలని, రిజర్వేషన్లు పెరగాలంటే కాంగ్రెస్‌కు అండగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. మీ భవిష్యత్ మీ చేతుల్లోనే ఉందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు ఇచ్చి.. వారికి దామాషా ప్రకారం అవకాశాలు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీదని చెప్పారు. బీసీ కులగణన చేపడితేనే వారికి కూడా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అందుతాయని అన్నారు. అందుకే బీసీ జనగణన చేపట్టేందుకు అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించుకున్నామని తెలిపారు. శుక్రవారం జహీరాబాద్లో నిర్వహించిన జన జాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా మోదీ, కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘మేమిద్దరం మాకు ఇద్దరు అన్నట్లు.. మోదీ, అమిత్ షాకు అదానీ, అంబానీ తొడయ్యారని, వాళ్లంతా కలిసి రిజర్వేషన్లు రద్దు చేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదని, బ్రిటిష్ జనతా పార్టీ అని అభివర్ణించారు. మతాలు, జాతుల మధ్య చిచ్చు పెట్టి దేశాన్ని దోచుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రిజర్వేషన్లు రద్దు చేసేందుకే బీజేపీ 400 సీట్లు కావాలంటోందని చెప్పారు. మోదీ కాలనాగు లాంటివారని, మనసులో పగ పెట్టుకుంటారని విమర్శించారు. నల్ల చట్టాలపై కొట్లాడిన రైతులపై మోదీ పగ పట్టారని, రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి రైతులను అదానీ, అంబానీలకు బానిసలుగా మార్చాలని చూస్తున్నారని చెప్పారు. అందుకే 400 సీట్లు గెలిచి రిజర్వేషన్లు రద్దు చేయాలనుకుంటున్నారని తెలిపారు. పదేళ్లు మోసం చేసిన వారికి ఓటేస్తారా? వంద రోజుల్లో మీకు సంక్షేమం అందించిన వారికి ఓటేస్తారా ఆలోచించాలని ఓటర్లను కోరారు. అంగీ మార్చిన.. రంగు మార్చిన బిజినెస్ పాటిల్‌ను బండకేసి కొడతారని స్పష్టం చేశారు. కేసీఆర్‌కు చెప్పాకే బీబీ పాటిల్ బీజేపీలో చేరారని రేవంత్‌రెడ్డి చెప్పారు. ‘బిడ్డ బెయిల్ కోసం జహీరాబాద్‌లో బీజేపీని గెలిపించాలని కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. బీఆరెస్, బీజేపీ ఒక్కటే.. వాళ్ళిద్దరిదీ గూడుపుఠాణీ’ అని ఆరోపించారు. జహీరాబాద్ అభివృద్ధి జరగాలంటే ఈ గడ్డపై కాంగ్రెస్ గెలవాలని చెప్పారు. నీతికి, నిజాయితీకి మారుపేరు సురేష్ షెట్కర్‌కు అండగా నిలబడాల్సిన అవసరం ఉందన్నారు. మంచి బతకాలి.. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే సురేష్ షెట్కర్‌ను లక్ష మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

మాట తప్పిన కేసీఆర్‌
డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తానన్న కేసీఆర్ మాట తప్పారని రేవంత్‌రెడ్డి విమర్శించారు. అందుకే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే..4లక్షల 50 వేల ఇందిరమ్మ ఇండ్ల కోసం రూ.22,500 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. ఇంటి నిండా ఉద్యోగాలు ఇచుకున్న కేసీఆర్ పదేళ్లలో రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదని, కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో 30వేల ఉద్యోగాలు భర్తీ చేశామని గుర్తు చేశారు.

ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలన
దొర గడీలు బద్దలు కొట్టి తెలంగాణ తల్లిని బంధ విముక్తి కల్పించిన ఘనత ప్రజలదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. ‘ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకుని ప్రజా పాలన కొనసాగించుకుంటున్నాం. ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటున్నాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం. పేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నాం. రూ.500 లకే పేదలకు గ్యాస్ సిలిండర్ ఇచ్చి 40లక్షల కుటుంబాలను ఆదుకున్నాం. పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించి మీ కళ్లల్లో ఆనందం చూసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంది’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు.

ఇంటర్మీడియట్ మొదటి, రెండవ, నాలుగవ ర్యాంకు సాధించిన ప్రభుత్వ కళాశాలల్లో లైబ్రరీల ఏర్పాటుకు రూ.2కోట్లు ఈ వేదిక నుంచి మంజూరు చేస్తున్నట్టు సీఎం ప్రకటించారు. ఈ ప్రాంతానికి మహిళా ఐటీఐ ఇచ్చే బాధ్యత తనదని చెప్పారు. నారాయణ ఖేడ్ లో 2వేల ఎకరాలు సేకరిస్తే ఫార్మా విలేజ్ తెచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు.

Latest News