Revanth Reddy | 100 రోజుల్లో రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లిస్తాం.. పీఆర్సీపై తక్షణమే రిపోర్టు ఇస్తాం.. ఉద్యోగ సంఘాలకు సీఎం రేవంత్ రెడ్డి హామీ

Revanth Reddy | వందరోజుల్లో ఉద్యోగుల పదవీ విరమణ ప్రయోజనాల కోసం రూ. 6 వేల కోట్లు చెల్లిస్తామని, ఈ నిధులను ఖర్చు ప్రాధాన్యతల నిర్ణయం మీదేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. పీఆర్సీపై తక్షణమే రిపోర్టు అందించాలని అధికారుల కమిటీని ఆదేశించామని తెలిపారు.

Revanth Reddy | విధాత, హైదరాబాద్: వందరోజుల్లో ఉద్యోగుల పదవీ విరమణ ప్రయోజనాల కోసం రూ. 6 వేల కోట్లు చెల్లిస్తామని, ఈ నిధులను ఖర్చు ప్రాధాన్యతల నిర్ణయం మీదేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. పీఆర్సీపై తక్షణమే రిపోర్టు అందించాలని అధికారుల కమిటీని ఆదేశించామని, రిపోర్టు ఆధారంగా ఫిట్‌మెంట్‌పై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. జూన్ 1 లోగా ఆరోగ్య భద్రత కార్డులను ఉద్యోగులకు అందిస్తామన్నారు. ప్రతీ రెండు నెలలకోసారి గుర్తింపు సంఘాలు సమావేశమై తమ సమస్యలపై ప్రభుత్వానికి రిపోర్టు అందించాలని రేవంత్ రెడ్డి కోరారు.

తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ, తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ నాయకులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం జూబ్లిహిల్స్ నివాసంలో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఉద్యోగ సంఘాల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఉద్యోగ సంఘాల నాయకులు ధన్యవాదాలు తెలిపారు. వైద్య విధాన పరిషత్ లో 13,100 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించినందుకు ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమన్నారు. పీఆర్సీ, హెల్త్ కార్డుల సమస్యలతో పాటు ఉద్యోగ సంఘాల ఇతర డిమాండ్లను పరిష్కరించాలని నాయకులు సీఎంకు విజ్ఞప్తి చేశారు.

ఉద్యోగ సంఘాల నాయకులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రకటించినా ఉద్యోగులు భుజాన వేసుకుని పనిచేశారని కొనియాడారు. ఉద్యోగుల సహకారంతోనే ప్రభుత్వ సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేయగలుగుతున్నామని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగుల కోసమే మొదటి నిర్ణయం తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఉద్యోగులకు ప్రతీ నెలా మొదటి తారీఖున వేతనాలు అందేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఉద్యోగ సంఘాలు స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించుకునేలా అవకాశం కల్పించామని పేర్కొన్నారు.

ఉద్యోగుల బదిలీల విషయంలో గందరగోళం తలెత్తకుండా ప్రణాళిక ప్రకారం నిర్వహించామని రేవంత్ రెడ్డి అన్నారు. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న టీచర్ల బదిలీలు ఎలాంటి వివాదం లేకుండా పూర్తిచేయడం జరిగిందన్నారు. ఈ రెండేళ్లలో ప్రజా ప్రభుత్వంలో 67,760 ఉద్యోగ నియామకాలు చేపట్టామన్నారు. తెలంగాణలో ఫ్రెండ్లీ ప్రభుత్వం ఉందని, మీ సమస్యలను పరిష్కరించే బాధ్యత మాది అని అన్నారు. నాలుగు అంశాలపై ఉద్యోగ సంఘాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టతనిచ్చారు.

ఉద్యోగ సంఘాల నాయకులతో భేటీలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ, దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల సమస్యలను చాలా వరకు పరిష్కరించామని తెలిపారు. ప్రతి నెలా మొదటి తారీఖునే ఉద్యోగులకు జీతాలు అందిస్తున్నామని, రాష్ట్ర ఆవిర్భావం నాటికి ఉద్యోగుల పెండింగ్ బిల్లులు లేవని, పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో వేల కోట్ల బిల్లులు పేరుకుపోయాయన్నారు. దీనిపై ఒక కసరత్తు చేసి సమస్యల పరిష్కరిస్తూ ముందుకు వెళుతున్నామన్నారు. 100 రోజుల్లో దాదాపు రూ.6 వేల కోట్లు పెన్షనర్ బకాయిలు క్లియర్ చేయాలని ప్రయత్నిస్తామన్నారు. ప్రభుత్వానికి ఉద్యోగులపై ఉన్న చిత్తశుద్ధికి ఇది

నిదర్శనం అని అన్నారు. ఉద్యోగుల హెల్త్ కార్డులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మానవీయ దృక్పథంతో ఆలోచించారు. మీ సమస్యల పరిష్కారం కోసం సీఎం ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళుతున్నారు.

5వ తేదీ నిరసన విరమణ

ఈ నెల 5 న నిర్వహించనున్న నిరసన కార్యక్రమంతో పాటు అన్ని రకాల నిరసన కార్యక్రమాలను ఉపసంహరించుకుంటున్నట్లు ఉద్యోగ సంఘాల ప్రకటించాయి. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల డిమాండ్లపై స్పష్టతనిచ్చిన ముఖ్యమంత్రికి ఉద్యోగ సంఘాలు ధన్యవాదాలు తెలిపాయి. ఉద్యోగ సంఘాల జేఏసీ భేటీలో మారం జగదీష్, ఏలూరి శ్రీనివాస్ రావు, జీ. శ్రీనివాస్ రెడ్డి, పీ. దామోదర్ రెడ్డి, జీ. సదానందం గౌడ్, వీ. రవీందర్ రెడ్డి, వీ. రాజశేఖర్, కే. రామకృష్ణ, ఎస్. రాములు, వీ.లచ్చి రెడ్డి పాల్గొన్నారు.

Read More:

Bengaluru-Vijayawada | చరిత్ర సృష్టించిన బెంగళూరు-విజయవాడ కారిడార్.. వారంలోనే నాలుగు గిన్నిస్ రికార్డులు!

హైదరాబాద్​ పోలీస్​ : అక్రమ బెట్టింగ్, నకిలీ పెట్టుబడులను ప్రోత్సహిస్తున్న సోషల్​ మీడియా అకౌంట్లు ఔట్​!

Latest News