CM Revanth Reddy | ఢిల్లీ టూర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి బిజీ బిజీ

ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి బిజీ బీజీ షెడ్యూల్ మధ్య తన పర్యటన కొనసాగిస్తున్నారు. పార్టీకి సంబంధించిన అంశాలపై అటు కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలతోనూ..ఇటు రాష్ట్రానికి రావాల్సిన నిధులు..అభివృద్ది పనులకు సంబంధించి కేంద్ర మంత్రులతోనూ వరుస భేటీలు నిర్వహించారు

  • Publish Date - June 24, 2024 / 07:56 PM IST

రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ
2,450 ఎక‌రాల ర‌క్ష‌ణ శాఖ భూమ‌లు బ‌ద‌లాయింపుకు వినతి..
వ‌రంగ‌ల్ సైనిక స్కూల్ అనుమ‌తులు పున‌రుద్ధ‌రణకు అభ్యర్థన
కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తోనూసమావేశం

విధాత, ఢిల్లీ : ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి బిజీ బీజీ షెడ్యూల్ మధ్య తన పర్యటన కొనసాగిస్తున్నారు. పార్టీకి సంబంధించిన అంశాలపై అటు కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలతోనూ..ఇటు రాష్ట్రానికి రావాల్సిన నిధులు..అభివృద్ది పనులకు సంబంధించి కేంద్ర మంత్రులతోనూ వరుస భేటీలు నిర్వహించారు. సోమవారం రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీయైన సీఎం రేవంత్‌రెడ్డి హైద‌రాబాద్‌లో ర‌హ‌దారుల విస్త‌ర‌ణ‌, ఇత‌ర అవ‌స‌రాల‌కు ర‌క్ష‌ణ శాఖ భూములు 2,500 ఎక‌రాల‌ను తెలంగాణ ప్ర‌భుత్వానికి బ‌దలాయించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. రావిరాల గ్రామంలో తెలంగాణ ప్ర‌భుత్వానికి చెందిన 2,462 ఎక‌రాల భూముల‌ను ఇమార‌త్ ప‌రిశోధ‌న కేంద్రం (ఆర్‌సీఐ) ఉప‌యోగించుకుంటున్న విష‌యాన్ని ముఖ్య‌మంత్రి ర‌క్ష‌ణ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

హైద‌రాబాద్ న‌గ‌రంతో పాటు న‌గ‌రం చుట్టు ప‌క్క‌ల ప్రాంతాల్లో ర‌హ‌దారుల విస్త‌ర‌ణ‌, ఫ్లైఓవ‌ర్లు, ఇత‌ర మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు ర‌క్ష‌ణ శాఖ భూములు త‌మ‌కు అవ‌స‌ర‌మ‌ని, ఆర్‌సీఐ రాష్ట్ర ప్ర‌భుత్వ భూములు వినియోగించుకుంటున్నందున ర‌క్ష‌ణ శాఖ భూములు 2,450 ఎక‌రాలు త‌మ‌కు అప్ప‌గించాల‌ని కేంద్ర మంత్రిని ముఖ్య‌మంత్రి కోరారు. రాష్ట్ర ప్ర‌భుత్వం, ర‌క్ష‌ణ శాఖ భూముల ప‌ర‌స్ప‌ర బ‌దిలీకి అంగీక‌రించాల‌ని రక్ష‌ణ శాఖ మంత్రికి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. వ‌రంగ‌ల్ న‌గ‌రానికి గ‌తంలోనే సైనిక్ స్కూల్ మంజూరు చేసినా గ‌త రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్మాణప‌రంగా ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోలేద‌ని ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దృష్టికి సీఎం రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు.

వ‌రంగ‌ల్ సైనిక్ స్కూల్ అనుమ‌తుల గ‌డువు ముగిసినందున అనుమ‌తులు పున‌రుద్ధ‌రించాల‌ని లేదా తాజాగా మంజూరు చేయాల‌ని కేంద్ర మంత్రిని ముఖ్య‌మంత్రి కోరారు. ముఖ్య‌మంత్రి వెంట నాగ‌ర్‌క‌ర్నూల్, ఖ‌మ్మం, మ‌హ‌బూబాబాద్‌,జ‌హీరాబాద్‌, భువ‌న‌గిరి, న‌ల్గొండ‌, వ‌రంగ‌ల్, పెద్ద‌ప‌ల్లి ఎంపీలు మల్లు రవి, రామ‌స‌హాయం రఘురాం రెడ్డి, బలరాం నాయక్,సురేష్ షెట్కార్, చామ‌ల కిరణ్ కుమార్ రెడ్డి, కుందూరు రఘువీర్ రెడ్డి,కడియం కావ్య, గడ్డం వంశీ, రాజ్యసభ స‌భ్యుడు అనిల్ కమార్ యాదవ్, ముఖ్య‌మంత్రి ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి బి.అజిత్ రెడ్డిలు ఉన్నారు. రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి కేంద్ర గృహనిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో కూడా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయమై ఆయనతో రేంవత్‌రెడ్డి చర్చించారు.