CM Revanth Reddy To Vist Medaram | నేడు మేడారంలో సీఎం పర్యటన

మేడారం పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

CM Revanth Reddy To Vist Medaram | నేడు మేడారంలో సీఎం పర్యటన

విధాత ప్రత్యేక ప్రతినిధి:

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మంగళవారం మేడారంలో పర్యటించనున్నారు. మంగళవారం హెలికాప్టర్ లో మేడారం చేరుకుంటారు. అనంతరం జాతర సందర్భంగా రూపొందించిన మాస్టర్ ప్లాన్ ను క్షేత్రస్థాయిలో పరిశీలించి చేర్పులు, మార్పులతో గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. వనదేవతలైన సమ్మక్క, సారలమ్మల గద్దెల ప్రాంగణం అభివృద్ధి, గద్దెల మార్పు తదితర వాటిని గిరిజన ఆచార సంప్రదాయాలు, పూజారుల సూచనల మేరకు చేపట్టాల్సిన మార్పులు, చేర్పులను ఈ సందర్భంగా ఫైనల్ చేయనున్నారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనులు, వసతుల కల్పనకు అవసరమైన పనులను సీఎం లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇప్పటికే పనులు ఆలశ్యమయ్యాయనే అభిప్రాయం ఉన్న నేపథ్యంలో జాతర వరకు పనులు పూర్తయ్యే విధంగా త్వరగా పనులు ప్రారంభించాలని కోరుతున్నారు. జనవరిలో జాతర ఉన్నందున పనుల పూర్తికి కేవలం రెండు నెలల సమయం మాత్రమే ఉన్నది. ఎలాంటి లోటుపాట్లు లేకుండా జాతరకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేసే విధంగా చేపట్టాల్సిన ప్రణాళిక పై అధికారులు, ప్రజాప్రతినిధులతో సీఎం ఈ సందర్భంగా సమీక్షించనున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జాతర నిర్వహణ కోసం రూ.150 కోట్ల నిధులను కేటాయించిన విషయం తెలిసిందే. ఈ నిధులలో ఎక్కువ భాగం శాశ్వత ఏర్పాట్లు చేసేందుకు ఖర్చు చేయాలనే పట్టుదలతో ప్రభుత్వం ఉన్నంది.

సీఎం రాక సందర్భంగా భారీ ఏర్పాట్లు

సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా మేడారంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. గత నెలలో ఒకసారి, ఈ నెల 13,14న మేడారంలో సీఎం పర్యాటించాల్సి ఉన్నప్పటికీ వాయిదాపడింది. తాజాగా మంగళవారం పర్యటన ఖరారైనందున మేడారంలో హెలిపాడ్ ఏర్పాటు, అవసరమైన పటిష్ట బందోబస్తు తదితర వాటిని చేస్తున్నారు. మారుమూల అటవీప్రాంతం కావడంతో గట్టి నిఘాను ఏర్పాటు చేస్తున్నారు. సీఎం రేవంత్తో పాటు స్థానిక మంత్రి ధనసరి అనసూయ సీతక్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, గిరిజన శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, జిల్లా ఇంచార్జ్ మంత్రి పొంగులేటితో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నందున భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సీఎం హోదాలో చాలా మంది మేడారాన్ని సందర్శించినప్పటికీ వారంతా జాతర సందర్భంలో మాత్రమే అక్కడికి వచ్చారు. రేవంత్ రెడ్డి మాత్రం అక్కడ చేపట్టనున్న అభివృద్ధి పనులను పరిశీలించి, ప్రారంభించడానికి రావడం ప్రత్యేకతగా చెబుతున్నారు. వనదేవతల పై తనకున్న సెంటిమెంటును, భక్తి ప్రపత్తులను చాటుకునేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తన స్వంత నియోజకవర్గంలో మేడారం కొలువై ఉన్నందున సీఎం రాక సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, నియోజకవర్గ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే పార్టీ శ్రేణులను తరలించే పనిలో సీతక్క తలమునకలై ఉన్నారు.

ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి, అధికారులు

సీఎం రాకతో మేడారం జాతర పనుల అంకురార్పణ జరుగుతోంది. ఈ కార్యక్రమం మిని జాతరను తలపించే అవకాశం ఉన్నందున తగిన స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర పంచాయితి రాజ్ శాఖ మంత్రి సీతక్క చెప్పారు. సీఎం రాక సందర్భంగా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు, అవసరమైన ఏర్పాట్లను సోమవారం మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్, ఎస్పీ శభరీష్ లతో కలిసి పరిశీలించారు. మేడారం పరిసరాలను కలియతిరుగుతూ అవసరమైన ఏర్పాట్లకు తగిన సూచనలు చేశారు. ఈ సందర్భంగా వనదేవతలను దర్శించుకుని మొక్కుకున్నారు. అనంతరం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, అదనపు కలెక్టర్ రెవిన్యూ సి.హెచ్. మహేందర్ జి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, ఆర్డీఓ వెంకటేష్, పూజారుల సంఘం అధ్యక్షుడు జగ్గరావు, ఈ ఓ వీరస్వామి, ఏపీఓ వసంత రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.