కేంద్రంలో అధికార మార్పిడి కోసం అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. విపక్షాలన్నీ ఏకమై భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. పదేండ్లుగా ప్రధానిగా కొనసాగుతోన్న మోదీని ఆ పీఠం నుంచి వైదొలగించేందుకు తీవ్ర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అందుకు ఎన్డీఏ వ్యతిరేక పార్టీలన్నీ ఒక్కతాటిపైకి వచ్చాయి. ఇండియా కూటమిగా ఏర్పడి, మోదీ అసమర్థ విధానాలను ఎండగడుతూ ప్రజాక్షేత్రంలోకి దూసుకెళ్తున్నారు. ఈ దేశాన్ని విభజించి, పాలించే కుట్ర జరుగుతోందని.. పేదలు పేదలుగానే ఉంటున్నారు.. ధనవంతులు మరింత ధనవంతులుగా మారుతున్నారని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. రైతు, పేదలు బాగుపడాలంటే మోదీని గద్దె దించాలని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
ఇక మోదీ ఎన్నికల్లో గెలిచేందుకు ఈవీఎం(ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్స్) లను తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారని విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఈవీఎంలు లేకపోతే బీజేపీ గ్రామపంచాయతీ ఎన్నికల నుంచి మొదలుకుంటే పార్లమెంట్ ఎన్నికల వరకు ఒక్క ఎన్నికలో కూడా గెలవదు అని విపక్ష నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. మోదీ ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తూ ప్రతి ఎన్నికల్లో గెలుస్తున్నాడని చెబుతున్నారు. బీజేపీ నాయకులు గెలుపు కోసం ఈవీఎంల మీద ఆధారపడుతున్నారని, వారికి ప్రజల్లో విశ్వసనీయత లేదని విపక్ష నాయకులు పేర్కొంటున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూడా మోదీ మరోసారి గెలిచేందుకు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉందని ఆయా పార్టీలు ఆరోపిస్తున్నాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో ఓ వీడియో వైరల్ అవుతోంది. 2010లో అమెరికాలోని మిచిగాన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈవీఎంలను హ్యాక్ చేసే అంశాన్ని ఓ వీడియో రూపంలో విడుదల చేశారు. ఈవీఎంలను ఎలా ట్యాంపరింగ్ చేయొచ్చనే విషయాన్ని కళ్లకు కట్టినట్టు అందులో చూపించారు. ఈవీఎంలను హ్యాక్ చేసే మార్గాన్ని మిచిగాన్ సైంటిస్టులు కనుగొన్నట్టు ఆ వీడియోలో ఉంది. 2010లో విడుదలైన ఆ వీడియోపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. మళ్లీ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో ప్రధానంగా రెండు అంశాలను పరిశోధకులు వివరించారు. మొదటి అంశంలో.. ఒక అభ్యర్థికి పోలైన ఓట్లను కొల్లగొట్టడం, రెండో అంశంలో పోలింగ్, ఓట్ల లెక్కింపునకు మధ్యలో ఓట్లను తారుమారు చేయడం. మొబైల్ టెక్ట్స్ మేసేజ్‌ల ద్వారా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్‌లలో నిక్షిప్తమైన ఎన్నికల ఫలితాలను తారుమారు చేయొచ్చని మిచిగాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జే అలెక్స్ హాల్డ్రర్ మ్యాన్ చెప్పారు. మెషిన్లలో వెనుక డిస్‌ప్లే ఎలా ఉంటుందో అచ్చం అదే మాదిరి డిస్ ప్లే బోర్డును రూపొందించినట్లు తెలిపారు. ఈ డిస్ ప్లే బోర్డు, మెషిన్ చూపించే మొత్తం ఓట్లను కొల్లగొట్టి, వాటిస్థానంలో వేరే ఓట్లు చూపించేలా రూపొందించామన్నారు. అదే విధంగా ఈవీఎంలకు మైక్రో పాసెసర్‌లను కూడా మిచిగాన్ యూనివర్సిటీ పరిశోధకులు జత చేసి చూపించారు. దీని ద్వారా ఓటింగ్‌కు, ఓట్ల లెక్కింపునకు మధ్య ఫలితాలను తారుమారు చేయొచ్చని అభిప్రాయపడ్డారు. భారతదేశంలో ఎన్నికలకు వినియోగించే ఈవీఎంలను ప్రపంచంలోనే అత్యంత ట్యాంపర్‌ప్రూఫ్ ఓటింగ్ మెషిన్లుగా పరిశోధకులు అభివర్ణించారు.
ఈ డివైజ్‌లో ఉన్న సాఫ్ట్‌వేర్ అసలు ట్యాంపర్ చేయడానికి అవకాశం ఉండదు. ప్రజలు వేసే ఓట్లను దాని కోసమే ప్రత్యేకంగా రూపొందించే కంప్యూటర్ చిప్స్‌లో స్టోర్ చేస్తారు. దీంతో ట్యాంపర్ చేయడం చాలా కష్టతరమవుతుంది. కానీ భారత ఎన్నికల కమిషన్ వాడే ఈవీఎంలను కూడా హ్యాక్ చేసే అవకాశం ఉందని మిచిగాన్ యూనివర్సిటీ పరిశోధకులు తేల్చేశారు. పేపర్ లెస్ ఓటింగ్ వ్యవస్థలో అంతర్గత భద్రతా సమస్యలు ఉన్నాయని ఈ పరిశోధనతో మరోసారి రుజువైందని సైంటిస్టులు తేల్చినప్పటికీ, భారత ఎన్నికల సంఘం మాత్రం ఆ పరిశోధనలను తోసిపుచ్చింది. ఈవీఎంలలో ఎలాంటి ట్యాంపరింగ్‌కు అవకాశం లేదని పలుమార్లు తెలిపింది.
ఎన్నికలకు ఉపయోగించే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ఇప్పటికే ఐర్లాండ్, నెదర్లాండ్, జర్మనీ, ఫ్లోరిడా వంటి దేశాలు తిరస్కరించాయని, భారత్ కూడా ఆ దేశాలను అనుసరించాలని పరిశోధకులు సూచించారు. ఈవీఎంలు ప్రజాస్వామ్య వ్యవస్థకు హానీ కలిగిస్తున్నాయన్నారు. ఎన్నికల్లో పారదర్శకత ఉండాలంటే కచ్చితంగా బ్యాలెట్ పేపర్లను మళ్లీ వాడుకలోకి తీసుకురావాలని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. ఓట్ల లెక్కింపునకు అధునాతన టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావాలని, అందుకు అనేక రకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయని తెలిపారు.
ఈవీఎలంను సరి చేయాల్సిందే : శ్యామ్ పిట్రోడా
ఈవీఎంల పనితీరుపై కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడా కూడా ఆందోళన వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం పీటీఐకి వార్తా సంస్థకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికలు జరిగే లోగా ఈవీఎంలను సరి చేయాలని కోరారు. లేదంటే బీజేపీకి 400 ఎంపీ స్థానాలకు పైగా గెలుచుకునే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మళ్లీ బీజేపీనే అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ అగ్రనాయకత్వం చెప్పుకోవడంపై పీటీఐ ప్రశ్నించగా, శ్యామ్ పిట్రోడా ఇలా సమాధానం ఇచ్చారు.
నిజంగా అది జరిగితే గ్రేట్. కానీ నిర్ణయించాల్సింది ప్రజలు. అంతకంటే ముందు ఈవీఎంలను సవరించాలి. లేదంటే బీజేపీనేతలు చెప్తున్నది నిజం అవుతుందన్నారు. ప్రస్తుతం ఉన్న ఈవీఎంల డిజైన్‌ను మార్చాలంటూ సుప్రీంకోర్టు మాజీ జడ్జి మదన్ బీ లోకూర్ ఆధ్వర్యంలో వెలువడిన నివేదికలోని సూచనలను అమలు చేయాలని శ్యామ్ పిట్రోడా కోరారు. ఆ నివేదికలోని ప్రధాన అంశాలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.