– ఆరు గ్యారంటీ లు అమలు చేయకుంటే అసెంబ్లీ లో నిలదీస్తాం
– ప్రజల పక్షాన పోరాడేందుకు బీ ఆర్ ఎస్ సిద్ధం
– కల్లబోల్లి మాయ మాటలతో అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్
– ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచుతాం
– తెలంగాణ కు బీజేపీ ఒక్క పైసా ఇవ్వలేదు.. పాలమూరు ప్రాజెక్టు కు జాతీయ హోదా ఇవ్వని బీజేపీకి ఓటు వేయవద్దు
– ప్రజలను మోసం చేయడం లో బీజేపీ, కాంగ్రెస్ దొందు దొందే
విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : తెలంగాణ ప్రజలకు మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీలు నెరవేర్చడం లో పూర్తిగా విఫలం చెందిందని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆరోపించారు. సోమవారం కొడంగల్ నియోజకవర్గం కోస్గి మండల కేంద్రంలో నిర్వహించిన బీ ఆర్ ఎస్ ఎన్నికల సన్నాహక సమావేశం లో ఆయన పాల్గొని ప్రసంగించారు.ప్రజలను వంచించడం లో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే అని, ఈ రెండు పార్టీ లకు ప్రజల సంక్షేమం పట్టదని విమర్శించారు. బీజేపీ పదేళ్ల అధికారం లో తెలంగాణ రాష్ట్రం పై చిన్న చూపు చూపించి ఒక్క అభివృద్ధి పనులకు పైసా ఇవ్వలేదన్నారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు కు జాతీయ హోదా ఇవ్వని మోడీ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజల ఓటు అడిగే హక్కులేదని హరీష్ పేర్కొన్నారు.సిలిండర్, పెట్రోల్, డిజిల్ ధరలు భారీగా పెంచి ఎన్నికల ముందు రెండు రూపాయలు తగ్గించి ప్రజలను నట్టేట ముంచిన పేరు మోడీ కే దక్కుతుందన్నారు. దళిత గిరిజన, రైతుల కోసం బీజేపీ ప్రభుత్వం ఏమి చేసిందో చెప్పాలని హరీష్ రావు ప్రశ్నించారు. దేశం లో 157 మెడికల్,157 నర్సింగ్ కళాశాలు ఏర్పాటు చేసి తెలంగాణ కు ఒకటి కూడా ఇవ్వలేని బీజేపీ ని తెలంగాణ సమాజం తగిన బుద్ది చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ పదేళ్ల లో గుళ్ళు, గోపురాలు నిర్మించి ఇదే అభివృద్ధి అంటూ.. గుళ్లో వెలిగించే అగరుబత్తికి కూడా జీ ఎస్ టి వేసిన ఘనుడు మోడీ అని హరీష్ రావు అన్నారు.ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుందడం తో బీజేపీ నాయకులు మాయ మాటలు చెప్పి మరోసారి తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నారని, ప్రజలు వీరి మాటలను నమ్మి మరోసారి మోసపోవద్దన్నారు. బీజేపీ ఇలా ఉంటే మేమూ తక్కువా అన్నట్లు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ పని తీరు ఉంది.
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేయడం లో పూర్తి గా విలమైందన్నారు. అధికారం లోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారంటీ లు అమలు చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ఇప్పటికి పథకాలు అమలు చేయడం లో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన విమర్శించారు. రెండు లక్షల రుణమాఫి, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కెసిఆర్ కిట్, నిరుద్యోగ భృతి వంటి పథకాలను సీఎం రేవంత్ రెడ్డి మరుగున పడేసారన్నారు.ఈ పథకాలు రేవంత్ రెడ్డి అమలు చేసే విధంగా చర్యలు తీసుకునే భాద్యత తనదే అని ప్రకటించిన ప్రియాంక గాంధీ ప్రస్తుతం మొహం చాటేసారని హరీష్ రావు అన్నారు. పాలమూరు ప్రాజెక్టు లో భాగంగా కరివెన జలశయం నుంచి కాలువల ద్వారా కొడంగల్, నారాయణ పేట నియోజకవర్గాల్లో లక్షా ఐదు ఎకరాలకు సాగునీరు అందే విధంగా బీ ఆర్ ఎస్ ప్రభుత్వం రూపకల్పన చేసిందన్నారు.ప్రస్తుతం కరివేన జలశయం పనులు పూర్తి అయ్యాయని, కాలువ ల పనులు పూర్తి చేసి సాగునీరు అందించే అవకాశం ఉన్నా సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని మరుగున పడేసారన్నారు. కొడంగల్ లో కళాశాలలు,ఆసుపత్రి వంటి అభివృద్ధి పనులు బీ ఆర్ ఎస్ హయాంలో జరిగావని హరీష్ రావు అన్నారు. రేవంత్ రెడ్డి ఆర్ గ్యారంటీ ల అమలు పై దృష్టి పెట్టకుండా బీ ఆర్ ఎస్ నేతలను తిట్టే పని పెట్టుకున్నారని, ఈ ఆరు గ్యారంటీ పథకాలకు అసెంబ్లీ లో చట్టబద్దత తీసుకొస్తానని, బాండ్లు, నోటరీ రాసిస్తానని ప్రకటించిన సీఎం నేటికీ కార్యరూపం దాల్చలేదన్నారు.ఆడపడుచుల కల్యాణ కానుకగా తులం బంగారం ఇస్తానని ప్రకటించిన రేవంత్ రెడ్డి నేటి వరకు మాసం బంగారమైన ఇచ్చారా అని ప్రశ్నించారు. అరచేతిలో వైకుంఠం చూపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించాలని హరీష్ రావు కోరారు. తెలంగాణ ప్రజల ను అన్ని విధాలు గా ఆదుకున్న బీ ఆర్ ఎస్ పార్టీ అధికారం లో ఉన్నా ప్రతిపక్షం లో ఉన్నా ప్రజల అభివృద్ధి కోసం పోరాడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశం లోమహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం నుంచి బీ ఆర్ ఎస్ నుంచి పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే లు లక్ష్మా రెడ్డి, అలవేంకటేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్,అంజయ్య యాదవ్, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.