బీజేపీ ప్రకటించిన మూడు జాబితాల్లోని అభ్యర్థులపై ఆ పార్టీ పాత, కొత్త నేతల మధ్యే విభేదాలు తలెత్తాయని సమాచారం. పార్టీ సిద్ధాంతాలతో పని లేకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇవ్వడాన్ని సీనియర్ నేతలు తప్పుపట్టారని సమాచారం. అంతేకాదు బండి సంజయ్, ఈటల రాజేందర్‌ల మధ్య విభేదాలున్నాయనే వార్తలు ఎప్పటి నుంచో వస్తున్నాయి. సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నంతకాలం ఆయన ఈటల వర్గానికి చెక్ పెడుతూనే ఉన్నారు. దీంతో ఈటల వర్గం నిరాశకు గురవడమే కాకుండా ఇలా అయితే పార్టీలో పనిచేయడం కష్టమే అభిప్రాయాన్ని పార్టీ అధిష్ఠానం దృష్టికి తెచ్చిన విషయం తెలిసిందే. అయితే టికెట్ల కేటాయింపుల విషయానికి వచ్చే సరికి సంజయ్‌కి బాసటగా మరికొంతమంది సీనియర్లు నిలిచినట్టు తెలుస్తోంది. అందుకే నాలుగో జాబితాలో పార్టీ అధిష్ఠానం బీజేపీ అనుబంధ సంఘాలతో అనుబంధం ఉండి, సుదీర్ఘకాలం పనిచేస్తున్న వారికే అవకాశం కల్పించింది. ఇందులో భాగంగానే మేడ్చల్ నుంచి రామ చంద్రరావు, పెద్దపల్లి నుంచి ప్రదీప్‌కుమార్‌లకు చోటు దక్కించుకున్నారు. సంజయ్ సూచన మేరకే తుల ఉమకు బదులు చెన్నమనేని వికాస్ రావుకు టికెట్ దక్కిందనే వాదనలున్నాయి.
అప్పటిదాకా వేములవాడలో ఏ పార్టీ గెలుస్తుందనే చర్చ బీజేపీ నాలుగో లిస్ట్ తర్వాత పూర్తిగా మారిపోయింది. పౌరసత్వం కేసు కారణంగా ఈసారి బీఆర్‌ఎస్ చెన్నమనేని రమేశ్‌కు బదులు చల్మడ లక్ష్మీనర్సింహరావును అవకాశం ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆది శ్రీనివాస్, బీజేపీ నుంచి తుల ఉమ పోటీలో ఉన్నారు. చివరి నిమిషంలో బీజేపీ తన అభ్యర్థిని మార్చింది. తుల ఉమ స్థానంలో చెన్నమనేని వికాస్ రావును పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో అప్పటిదాకా ఆ నియోజకవర్గంలో త్రిముఖ పోరుగా కనిపించిన వాతావరణం పోయి ద్విముఖ పోరుగా మారింది. ఈ నియోజకవర్గంలో చెన్నమనేని రమేశ్‌కు బాగా పట్టున్నది. ఆయన వృత్తిరీత్యా జర్మనీకి ఇండియాకు రాకపోకలు సాగిస్తారనేది అందరికీ తెలిసిందే. అయితే నియోజకవర్గంలో అభివృద్ధి పనులను పర్యవేక్షించడం, స్వశక్తి మహిళా సంఘాల పురోభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తారనే టాక్ ఉన్నది. ఇలాంటి వాళ్లే రమేశ్‌కు ప్రచారకర్తలు అంటుంటారు. అందుకే ఆయన వరుసగా విజయం సాధిస్తున్నారని అక్కడ ప్రజల్లో ఉండే అభిప్రాయం. ఈసారి ఆయనకు బదులు పార్టీ లక్ష్మీనర్సింహరావుకు టికెట్ ఇచ్చింది. ఆయనను ప్రభుత్వ సలహాదారుగా నియమించింది. ఆయన సహకరిస్తే లక్ష్మీనర్సింహరావు గట్టెక్కవచ్చనే వాదన వినిపిస్తున్నది.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆది శ్రీనివాస్‌కు కూడా ఈ నియోజకవర్గంలో గట్టి పట్టున్నది. 2014లో బీజేపీ తరఫున, 2018లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన ఆయన రెండుసార్లు 50 వేలకు పైగా ఓట్లు సంపాదించుకోగలిగారు. రెండుసార్లు ఓడిపోయిన సానుభూతి ఉన్నది. అలాగే చెన్నమనేని రమేశ్ ఎన్నిక చెల్లదని ఆయన సుప్రీంకోర్టు దాకా పోరాడారు. దీంతో గత ఐదేళ్లుగా నిత్యం వార్తల్లో ఉన్నారు. ఈసారి రమేశ్ పోటీలో లేకపోవడం ఆయనకు కలిసి వస్తుందంటున్నారు. వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ ఎమ్మెల్యేగా కొనసాగడానికి అనర్హుడని, ఆయన ఇప్పటికి జర్మనీ పౌరుడిగానే ఉన్నాడని పౌరసత్వాన్ని ఇంకా వదులుకోలేదని హైకోర్టుకు కేంద్ర ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్‌లో తెలిపింది. ఈ వివాదం కొనసాగుతుండగానే కేసీఆర్ చెల్మడను పార్టీలోకి తీసుకొచ్చారు. చల్మడ లక్ష్మీనర్సింహరావు రెండున్నర దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు. ఆ పార్టీ తరఫున 2009, 2014 లో పోటీ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో పోటీ బీజేపీ, కాంగ్రెస్ ల మధ్యే ఉంటుందనేది రాజకీయ పరిశీలకుల అంచనా. బీజేపీ మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు తనయుడు వికాస్‌రావును బరిలో దింపినా ఆ పార్టీ ప్రభావం ఉండదంటున్నారు. తుల ఉమ కు బీజేపీ టికెట్ ఇచ్చి చివరి నిమిషంలో వెనక్కి తీసుకోవడం ఆ పార్టీకి మైనస్‌గా మారిందటున్నారు. మరోవైపు చెన్నమనేని రమేశ్ సహరిస్తేనే లక్ష్మీనర్సింహరావు విజయావకాశాలు ఉంటాయని లేకపోతే ఆది శ్రీనివాస్‌కు ఈసారి ఆ అవకాశం దక్కొచ్చు అనేది స్థానిక ప్రజలు అభప్రాయపడుతున్నారు.