విధాత: మెదక్ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో రాజకీయంగా దుమారం రేపిన మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై కత్తిపోటు కేసులో సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత కీలక అంశాలు వెల్లడించారు. నిందితుడు సంచలనం సృష్టించడం కోసమే ఎంపీపై దాడి చేశాడని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని చెప్పారు. తమ అభ్యర్థిపై కాంగ్రెస్‌వారు దాడులకు దిగారని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహా పలువురు బీఆరెస్ నాయకులు ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్, బీఆరెస్ మధ్య మాటల యుద్ధం కూడా నడిచింది. బుధవారం సిద్దిపేట పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సీపీ శ్వేత మీడియాతో మాట్లాడారు.
ఈ దాడి కోసం నిందితుడు రాజు వారం క్రితం కత్తి కొనుగోలు చేశాడని తెలిపారు. ఇప్పటికైతే అతను ఒక్కడే ఈ నేరంలో భాగస్తుడిగా ఉన్నాడని, ఎవరి సహకారం తీసుకోలేదని చెప్పారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే, విద్వేష పూరిత పోస్టులపై కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు. గత నెల 30న దుబ్బాకలోని సూరంపల్లిలో బీఆరెస్ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై దాడి జరిగిన విషయం తెలిసిందే.
ఈ కేసులో నిందితుడు రాజును గజ్వేల్ కోర్టులో ప్రవేశపెట్టామని, కోర్టు అతడికి 14 రోజుల రిమాండ్ విధించిందని చెప్పారు. దాడి సమయంలో నిందితుడిపై స్థానికులు ఆగ్రహంతో దాడి చేశారని తెలిపారు. ఈ కేసులో అన్ని ఆధారాలు సేకరిస్తున్నట్టు చెప్పారు. దాడి చేసిన వ్యక్తి పలు న్యూస్ చానళ్లలో రిపోర్టర్‌గా పనిచేస్తున్నాడని తెలిపారు. నిందితుడు ఎవరి సహకారమైనా తీసుకున్నాడా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఆమె అన్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.