విధాత : ఎన్నికల తరుణంలో టికెట్లు ఆశించి భంగపడిన నాయకులు, ఆశావహులతో పాటు అభ్యర్థులపై అసమ్మతిగా ఉన్న నేతలు జోరుగా పార్టీలను మారుతున్నారు. వలస నాయకుల రాకతో ప్రధాన పార్టీల్లో చేరికల జోష్ పెరిగింది. బుధవారం బీజేపీకి రాజీనామా చేసిన మాజీ ఎంపీ జి.వివేక్ వెంకటస్వామి తన కుమారుడు వంశీతో కలిసి శంషాబాద్ నోవాటెల్ హోటల్‌లో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీని కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
వరంగల్ జిల్లాకు చెందిన బీజేపీ అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్ రెడ్డి కూడా పార్టీకి రాజీనామా ప్రకటించారు. తాను కోరిన వరంగల్ ఈస్ట్ సీటును ఇవ్వకపోగా, పార్టీలో పైరవీకారులకు పెద్దపీట వేయడం నచ్చలేదని, బాధతో తాను పార్టీకి రాజీనామా చేస్తున్నానని రాజీనామా లేఖలో పేర్కోన్నారు. మరో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా నేడో రేపో బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లుగా సమాచారం.
ఎల్బీనగర్ కు చెందిన కాంగ్రెస్ నేత ముద్దగోని రాంమోహన్‌గౌడ్, ప్రసన్నలక్ష్మి దంపతులు తిరిగి మంత్రి టి.హరీశ్‌రావు సమక్షంలో బీఆరెస్‌లో చేరారు. హరీశ్‌రావు స్వయంగా వారి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించి కండువాలు కప్పారు. బీఆరెస్ టికెట్ రాలేదని కాంగ్రెస్‌లో చేరిన రాంమోహన్‌గౌడ్‌కు ఆ పార్టీలో కూడా టికెట్ రాకపోవడంతో సొంతగూటికి చేరారు. మునుగోడు కాంగ్రెస్ నేత, దివంగత ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కూతురు పాల్వాయి స్రవంతి బీఆరెస్ పార్టీలో చేరబోతున్నారు.
ఇదే మునుగోడు నియోజకవర్గం కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన చలమల్ల కృష్ణారెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేసే ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. ఆయన బీజేపీ నుంచి మునుగోడు టికెట్ రేసులో ఉన్నారు. అటు బోథ్ నియోజకవర్గం బీఆరెస్ సిటింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు.
బీఆరెస్ టికెట్ నిరాకరించడంతో ఇటీవల పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. కాంగ్రెస్‌లో కూడా టికెట్ దక్కకపోవడంతో బీజేపీ టికెట్ కోరుతూ ఆ పార్టీలో చేరారు. ఉప్పల్ బీఆరెస్ సిటింగ్ ఎమ్మెల్యే భేతీ సుభాష్‌రెడ్డి కూడా బీజేపీలో చేరబోతున్నట్లుగా తెలుస్తుంది. ఆయనతో బీజేపీ నేతలు టచ్‌లో ఉన్నారు. బీజేపీ మూడో జాబితా నేపధ్యంలో కాంగ్రెస్, బీఆరెస్‌లలో టికెట్లు దక్కని నేతలు బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు.