విధాత, హైదరాబాద్: ఫాక్స్‌కాన్ కంపెనీని బెంగళూరులో ఏర్పాటు చేయాలని కోరుతూ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ లేఖరాశారని సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టిన లేఖ మరోమారు నకిలీ లేఖల మకిలి రాజకీయాలపై చర్చకు దారి తీసింది. స్వయానా మంత్రి కేటీఆర్ అందులోనూ న్యాయవాదుల సమ్మేళనంలో ఈ లేఖ చదివి వినిపించడం.. అది పత్రికల్లో ప్రధాన వార్తగా వెళ్లటం జరిగిపోయాయి. అది నకిలీదని డీకే ఖండించినా.. అప్పటికే ఆ లేఖ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది.
గతంలో హైదరాబాద్‌లో వరదలు సంభవించినప్పుడు.. పదివేల రూపాయల వరదసాయం నిలిపివేయాలని అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాశారని చెబుతూ ఒక లేఖ సోషల్ మీడియాలో తెగ తిరిగింది. తాము సాయం అందిస్తుంటే దాన్ని అడ్డుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదంటూ బీఆరెస్ నాయకత్వం మండిపడింది.
కానీ.. అది కూడా నకిలీ లేఖ అని తేలిపోయింది. ఇది బీఆరెస్ సోషల్‌మీడియా శ్రేణుల పనేనని బీజేపీ అప్పట్లో ఆరోపించింది. ఇప్పుడు కాంగ్రెస్ ఖండించాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఈ రెండే కాదు.. గతంలో వివిధ అంశాలపై కేంద్రానికి లేఖలు ఇచ్చామని బీఆరెస్ నేతలు చెబితే.. ఇవ్వలేదని బీజేపీ నేతలు ఖండించిన ఉదంతాలూ ఉన్నాయి.
తాజాగా డీకేసి లేఖ అంశం మాత్రం నకిలీ లేఖల రాజకీయాలను ముందుకు తెచ్చింది. ఎన్నికలు వస్తే చాలు… రాజకీయ నాయకులు ఓటర్లను మంచి చేసుకోవడానికి, ప్రత్యర్థి పార్టీకి ఓటర్లను దూరం చేయడానికి రకరకాల జిమ్మిక్కులు చేస్తుంటారు. పరస్పరం తీవ్రస్థాయిలో ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటుంటారు. అది కాస్త ముదిరి.. నకిలీ లేఖల దాకా వెళ్లింది. ఒకరిపై ఒకరు నకిలీ లెటర్లు సృష్టించి, అబద్ధాలను ప్రచారం చేయడం ద్వారా ఎదుటిపార్టీ ప్రయోజనాలను దెబ్బతీయడం అనేది కూడా ఒక అస్త్రంగా మారిపోయింది.
నిజానికి ఇటువంటి తప్పుడు ప్రచారానికి బీజేపీ కేంద్ర స్థావరంగా ఉన్నదనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఒక సందర్భంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా.. బీజేపీ ఐటీ సెల్ సమావేశంలో మాట్లాడుతూ.. అబద్ధాలను ప్రచారం చేయండని బహిరంగంగానే చెప్పడం తెలిసిందే. ఒక పార్టీని సైద్ధాంతికంగా, రాజకీయంగా ఎదుర్కొనాల్సి ఉండగా.. ఈ తప్పుడు మార్గాలు అనుసరించడాన్ని బుద్ధిజీవులు, రాజకీయ పరిశీలకులు తీవ్రంగా తప్పుపడుతున్నారు.
డీకే శివకుమార్ రాసినట్లుగా ప్రచారం అయిన లెటర్‌పై ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడుతూ ఇది కాంగ్రెస్‌ను బదనాం చేయడానికి, తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టడానికి చేసిన ప్రయత్నంగా కనిపిస్తున్నదన్నారు. ఇలాంటి ఫేక్ ప్రచారాలు ప్రజాస్వామ్య వాతావరణానికి విఘాతం కలిగిస్తాయని వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి ఫేక్‌లేఖలు ప్రచారంలోకి వచ్చిన విషయం తెలిసిందే.
జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇంటింటికి ఇచ్చే రూ.10 వేల వరద సహయాన్ని ఆపాలని బీజేపీ నేత బండి సంజయ్ పేరుతో లేఖ ఇచ్చినట్లుగా బీఆరెస్ ప్రచారం చేసింది. ఆతరువాత ఇది ఫేక్ అని తేలింది. ఎన్నికల్లో బీజేపీని దెబ్బతీయడానికి బీఆరెస్‌కు సంబంధించిన సోషల్ మీడియాతో వైరల్ చేశారు. తాజా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరువాత కాంగ్రెస్ పార్టీ రైతు బంధు, దళిత బందు, బీసీలకు ఆర్థిక సహాయం, గృహలక్ష్మి పథకాలను నిలిపి వేయాలని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లుగా బీఆరెస్ ఆరోపించింది.
దీనిపై కాంగ్రెస్ పార్టీ వివరణ ఇస్తూ ఎన్నికల నోటిఫికేషన్ నవంబర్ 3వ తేదీన వస్తుందని, 2వ తేదీలోగా అన్ని పథకాలకు నగదు బదిలీని పూర్తి చేసేవిధంగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని తాము ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసినట్లు కాంగ్రెస్ తెలిపింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ మాట్లాడుతూ రైతు బంధు ఆపాలని వినతులు రాలేదని, రైతు బంధు రైతుల ఖాతాలో జమ చేస్తామని ప్రభుత్వం తమను అడుగలేదని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
ಆಪಲ್ ಏರ್ ಪಾಡ್ ಉತ್ಪಾದನಾ ಘಟಕವನ್ನು ಹೈದರಾಬಾದ್ನಿಂದ ಬೆಂಗಳೂರಿಗೆ ಸ್ಥಳಾಂತರಗೊಳಿಸುವಂತೆ ಫಾಕ್ಸ್ ಕಾನ್ ಸಂಸ್ಥೆ ನಾನು ಬರೆದಿರುವುದಾಗಿ ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಹರಿದಾಡುತ್ತಿರುವ ಪತ್ರ ನಕಲಿಯಾಗಿದ್ದು, ಈ ಸಂಬಂಧ ಸೈಬರ್ ಕ್ರೈಮ್ ಪೊಲೀಸ್ ಠಾಣೆಯಲ್ಲಿ ಎಫ್ಐಆರ್ ದಾಖಲಾಗಿದೆ.
The letter circulating on social media, saying… pic.twitter.com/HZTcTM5f96
— DK Shivakumar (@DKShivakumar) November 4, 2023
తాజాగా సీనియర్ కాంగ్రెస్ నేత కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఫాక్స్‌కాన్ కంపెనీకి లెటర్ రాసి హైదరాబాద్‌లో ఏర్పాటు చేసే యాపిల్ ఐపాడ్ తయారీ యూనిట్‌ను కర్నాటకలో ఏర్పాటు చేయాలని కోరుతూ లేఖ రాశారంటూ న్యాయవాధుల సభలో మంత్రి కేటీఆర్ ఆ లేఖను చూపిస్తూ చేసిన వ్యాఖ్యానాలు పెద్ద చర్చనీయాశమయ్యాయి. సాయంత్రానికే ఆ లేఖ బోగస్ అని తేలిపోయింది.
ఈ లేఖపై డీకే శివకుమార్ సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు కూడా చేశారు. ఈ లేఖపై దుమారం లేస్తున్న సమయంలోనే ఈ లేఖ డూప్లికేట్ డక్కన్ హెరాల్డ్ అకౌంట్ నుంచి పోస్ట్ చేసినట్లుగా తేల్చారు. దీనిపై దక్కన్‌హెరాల్డ్ కూడా తీవ్రంగా స్పందించి, ఆ లేఖ తాము ఇచ్చింది కాదని, అది తమ అకౌంట్ కాదని, ఎవరో డూప్లికేట్ అకౌంట్ క్రియేట్ చేశారని తెలిపింది. ఆ వెబ్ పేజీని కూడా తీసి వేశారు.
చాట్‌జీపీటీ వాడి లేఖ సృష్టి?
వాస్తవంగా ఫాక్స్ కాన్ కంపెనీ 40 కోట్ల డాలర్ల పెట్టుబడితో హైదరాబాద్‌లో యాపిల్ ఐపాడ్‌తో పాటు విడిభాగాల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. దీని ద్వారా లక్ష మందికి ఉపాధి దొరుకుతుందని కేటీఆర్ గతంలో తెలిపారు. ఈ కంపెనీ తన ప్రొడక్షన్‌ను డిసెంబర్ 2024 కు మొదలు పెట్టనున్నది. కర్నాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్.. ఫాక్స్‌కాన్ కంపెనీ చైర్మన్‌కు రాసినట్లుగా చెపుతున్న లేఖలో తెలంగాణలో పెట్టాలనుకున్న యూనిట్‌ను బెంగళూరుకు తరలించాలని, ఎన్నికల తరువాత తమ అనుకూల ప్రభుత్వం అక్కడ ఏర్పడుతుందని, దీంతో కంపెనీని తరలించడానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని పేర్కొన్నారు. ఇది సెప్టెంబర్ 25వ తేదీన రాసినట్లుగా ఉంది. ఇది చాట్ జీపీటీ ఉపయోగించి రాసిన లేఖ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కూర్చున్న కొమ్మను నరుక్కోవడమే
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం దేశంలోని ప్రతి ఒక్క కాంగ్రెస్ నేత కోరుకునేదే. ఒకటి ఒకటి కలి.. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీని గెలిపించుకునే ప్రయత్నాల్లో ఉన్న ప్రస్తుత తరుణంలో ఇటువంటి లేఖ రాయడం అంటే.. ఆ ప్రయత్నాలను దెబ్బతీయడమే. కూర్చున్న కొమ్మను నరుక్కోవడమే. అంతటి సాహసానికి కర్ణాటక కాంగ్రెస్ నేత పూనుకుంటారంటే నమ్మశక్యం కానిదే. సోషల్ మీడియా అనేది ఈ రోజుల్లో అబద్ధాల పుట్టగా తయారైంది. ఏది సరైందో ఏది తప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాల్సి వస్తున్నది.
కానీ.. ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్న నాయకుడు సైతం సోషల్ మీడియాలో వచ్చిన నకిలీ లేఖను కనీసం చెక్ చేసుకోకుండా అలవోకగా ఆరోపణలు గుప్పించడం గమనార్హం. కేటీఆర్ లాంటివారు సదరు కంపెనీతో క్రాస్ చెక్ చేసుకునే అవకాశం ఉంటుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ముఖ్యంగా కేటీఆర్ స్వయంగా ఫాక్స్ కాన్ చైర్మన్‌కే ఫోన్ చేసి అడిగి నిర్థారించుకోవచ్చునని, కానీ అలాంటిది ఏమీ చేయకుండా హడావిడిగా ఆ లేఖను చూపిస్తూ న్యాయవాదుల సమావేశంలో మాట్లాడటాన్ని మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ త్రీవంగా తప్పుపట్టారు.
ఇది కాంగ్రెస్‌ను బదనాం చేయడానికి, తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టడానికి చేసిన ప్రయత్నంగా కనిపిస్తున్నదని వ్యాఖ్యానించారు. ఇలా వస్తున్న లేఖలపై వెరిఫికేషన్ చేసుకోకుండా, నిరాధారమైన సమాచారం ఆధారంగా రాజకీయ విమర్శలు చేసుకోవడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హితవు పలికారు. ఇది ప్రజలను మభ్యపెట్టడం లాంటిదేనని అన్నారు.
స్వేచ్ఛాయుత ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీస్తున్నదని అన్నారు. రాజకీయ నాయకులు వాస్తవాలపై, తమ విధానాలపై ఆధారపడి మాత్రమే రాజకీయ విమర్శలు చేసుకోవాలని, అబద్దాలపై ఆధారపడితే.. వాస్తవాలు బయటకు వస్తే ప్రజల నమ్మకాన్ని కోల్పోతారని రాజకీయ పరిశీలకులు హితవు పలుకుతున్నారు.