విధాత, హైదరాబాద్ : మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి బీఆరెస్‌కు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు పంపించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గతంలో మంత్రిగా, శాసనసభ్యుడిగా పనిచేసిన సీనియర్ నేత పెద్దిరెడ్డి పార్లమెంటు ఎన్నికలకు ముందు బీఆరెస్‌కు రాజీనామా ఆ పార్టీకి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. తన రాజీనామాపై స్పందించిన పెద్దిరెడ్డి బీఆరెస్‌లో తనకు కేసీఆర్ కనీస గుర్తింపునివ్వకపోవడం బాధించిందని చెప్పుకున్నారు. తాను ఆ పార్టీలో చేరడమే ఒక పెద్ద తప్పిదమని వాపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేశానని, పాడి కౌశిక్‌రెడ్డి విజయంలో తనవంతు సహకారం అందించానన్నారు. భవిష్యత్తు రాజకీయాలపై తన అనుచరులు, కార్యకర్తలపై చర్చించి త్వరలోనే నా నిర్ణయం ప్రకటిస్తానని తెలిపారు.