విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: మైనారిటీల ప్రేమ మాటలతో చెప్పలేమని, వారితో తన తండ్రి హయాం నుండి మంచి సంబంధాలు ఉన్నాయని, మా సంస్థలో సైతం మైనార్టీలకు మంచి ప్రాధాన్యతిస్తున్నామని చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ వివేక్ అన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మసీదు ప్రాగణంలో శుక్రవారం నిర్వహించిన మైనారిటీ సమావేశంలో వివేక్ తో పాటు మాజీ ఎమ్మెల్యే నల్లల ఓదెల్, వివేక్ కుమారుడు వంశీకృష్ణ హాజరై మాట్లాడారు.
కాగా.. తన తండ్రి కాకా కాలం నుండి మైనారిటీలతో మంచి అనుబంధం ఉందని తెలిపారు. ముస్లిం సంప్రదాయం, వంటకాలు మా నివాసంలో భాగమయ్యాయని, చెన్నూరు ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని కోరారు. మైనారిటీల సంక్షేమం కోసం కృషి చేస్తానని తెలిపారు. చెన్నూర్ సిటింగ్ ఎమ్మెల్యే సుమన్ ఏ సామాజిక వర్గానికీ న్యాయం చేయలేదని, చిన్నచూపు చూశారని విమర్శించారు. ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని వివేక్ పేర్కొన్నారు.