రేవంత్ పాలన అంటేనే రాక్షస పాలన: హరీశ్ రావు ఫైర్

రేవంత్ పాలన రాక్షస పాలనగా మారిందని హరీశ్ రావు తీవ్ర విమర్శలు చేశారు. రైతుల భూముల విషయంలో ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

రేవంత్ పాలన అంటేనే రాక్షస పాలన: హరీశ్ రావు ఫైర్

విధాత, హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి పాలన అంటేనే రాక్షస పాలన అని… నువ్వు మల్లా గెలుస్తావు అనేది పగటి కల.. వచ్చేది రామ రాజ్యం, కేసీఆర్ రాజ్యం అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి.హరీశ్ రావు విమర్శించారు. పరిగి నియోజకవర్గంలో దళిత, గిరిజన బలహీన వర్గాల భూములను ఇండస్ట్రియల్ పార్కుల పేరిట గుంజుకునే ప్రయత్నం చేస్తుందని ఆరోపిస్తూ రైతులకు మద్దతుగా అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు హరీశ్ రావు బృందాన్ని అరెస్టు చేసి శంషాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్బంగా హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. పిప్పిరి సభలో రాముడు రాక్షసుడు అంటు మాట్లాడిన రేవంత్ రెడ్డిని మించిన రావణాసురుడు ఇంకెవరు ఉండరని హరీశ్ రావు విమర్శించారు. పేదల ఇళ్లు కూల్చుతూ వికృతానందం పొందుతున్న రాక్షసుడు రేవంత్ అని, రేవంత్ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని ఆరోపించారు. అవ్వాతాతల వద్దకు పోయి రాక్షస పాలన ఎవరు అంటే రేవంత్ రెడ్డిదేనని అంటారని, విద్యార్థులను, మహిళలను, పోలీసులను, రైతులను ఎవర్ని అడిగినా వారు రేవంత్ రెడ్డే రాక్షసుడు అంటారని విమర్శించారు.

ఇది గడీల పాలన, బేడీల పాలన

సీఎం రేవంత్ పాలన గడీల పాలన, బేడీల పాలన అని, నీ పాలన అంతా బోగస్ మాటలు, బోగస్ గ్యారెంటీలేనని, అన్ని వర్గాల ప్రజలను నమ్మించి మోసం చేశారని హరీశ్ రావు విమర్శించారు. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తున్నది.. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని, రెండు మూడు పంటలు పండే భూముల్లో పరిశ్రమలు పెట్టాలనుకోవడం దారుణం అని మండిపడ్డారు. భూసేకరణ కోసం ఇచ్చిన నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలని, అప్పటిదాకా పోరాటం ఆగదు అని స్పష్టం చేశారు. రైతులకు ధైర్యం చెప్పడానికి వెళ్తుంటే మా గొంతు నొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు ఏడో గ్యారెంటీగా ప్రజాస్వామ్యం అన్నారు, నేడు ప్రతిపక్షాల మీద ఎదురుదాడి చేస్తున్నరని విమర్శించారు. ప్రజా సమస్యల గురించి మాట్లాడితే అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తారని, ఇప్పుడు రైతులను కలవకుండా నిర్బంధాలు పెడుతున్నారని, రైతులను కలిసేందుకు వెళ్తుంటే అరెస్టులు చేయడం దౌర్జన్యంగా ఉందన్నారు. 22ఏ నిషేధిత భూముల మాటున పేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలను రేవంత్ సర్కార్ లాక్కుంటుందని ఆరోపించారు. కొత్వాల్ గూడ, మానస హిల్స్, వట్టి నాగుల పల్లి, నాదర్ గుల్ లో వేలాది ఎకరాలు భూములను మంత్రి పొంగులేటి కొల్లగొడుతుంటే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి వత్తాసు పలికాడని, కోహెడ మార్కెట్ భూములను కూడా కొల్లగొట్టాలని చూస్తున్నారని హరీశ్ రావు విమర్శించారు.

ఎన్నికలు ఎప్పుడొచ్చినా వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే

వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తా అని రేవంత్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలను విజయవంతంగా మోసం చేశాడని, ఎన్నికలు ఎప్పుడు జరిగినా కాంగ్రెస్ కు సింగిల్ డిజిట్ మాత్రమేనని, రేవంత్ రెడ్డి అంటే అయిపోయిన కథ అని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గెలుసుడు కాదు కదా.. ప్రతిపక్ష హోదా కూడా రాదు అన్నారు. రేవంత్ మల్లా గెలుస్తాడనుకోవడంపగటి కల.. వచ్చేది రామ రాజ్యం, కేసీఆర్ రాజ్యం అని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి :

కేరళంలో వచ్చేది యూడీఎఫ్ ప్రభుత్వమే : సీఎం రేవంత్ రెడ్డి
‘చిరాన్ ఫోర్ట్ క్లబ్’ భవన నిర్మాణాల కూల్చివేత ఆపాలి