హరీశ్ రావు ఢిల్లీ పర్యటనపై రాజకీయ దుమారం ?

హరీశ్ రావు ఢిల్లీ పర్యటన తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. కాళేశ్వరం కేసా? బీజేపీ భేటీలా? అన్న ఊహాగానాలు జోరందుకున్నాయి.

హరీశ్ రావు ఢిల్లీ పర్యటనపై రాజకీయ దుమారం ?

విధాత, హైదరాబాద్ : బీఆర్ఎస్ మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి.హరీశ్ రావు ఢిల్లీ పర్యటన తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కాళేశ్వరం కమిషన్ కేసులో హైకోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే సుప్రీంకోర్టులో సవాల్ చేసేందుకు హరీశ్ రావు ఢిల్లీ వెళ్లారని బీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే కేసీఆర్ జగిత్యాల సభకు గైర్హాజరై మరీ ఢిల్లీ వెళ్లడం వెనుక బీఆర్ఎస్ లో అంతర్గతంగా నెలకొన్న అసమ్మతి కారణమని కాంగ్రెస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. బీజేపీ పెద్దలను కలిసేందుకే హరీశ్ ఢిల్లీ వెళ్లరంటూ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. దీంతో అసలు హరీశ్ రావు ఢిల్లీకి ఎందుకు వెళ్లారన్నదానిపై తెలంగాణ రాజకీయాల్లో జోరుగా చర్చోపచర్చలు సాగుతున్నాయి.

బీఆర్ఎస్ లో ముసలం..బీజేపీ పెద్దలను కలిసేందుకే ఢిల్లీకి?

జీవన్ రెడ్డి రాకతో బీఆర్ఎస్ లో ముసలం మొదలైందని, హరీష్ రావు ఢిల్లీ వెళ్లిందే బీజేపీ పెద్దలను కలిసేందుకు అని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సభకు రాకుండా హరీశ్ రావు హుటాహుటిన ఢిల్లీ వెళ్లడం వెనుక మతలబు ఇదేనంటూ చెప్పుకొచ్చారు. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరడాన్ని వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్ రావుతో పాటు బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధమైనట్లు టాక్ వినిపిస్తుందని సంజయ్ పేర్కొన్నారు. జీవన్ రెడ్డి రాకను వ్యతిరేకిస్తూ హరీష్ రావుతో కొందరు ఎమ్మెల్యేలు జత కట్టారు అని, జీవన్ రెడ్డి వస్తే పార్టీ చీలిపోతుందని భయపడుతున్నారని సంజయ్ వ్యాఖ్యానించారు. హరీష్ ఢిల్లీ వెళ్ళింది బీజేపీ నేతలను కలవడానికి అని ప్రచారం జరుగుతుందని, బీజేపీలోకి వెళ్లవద్దని హరీశ్ ను కొందరు బీఆర్ఎస్ నేతలు బతిమిలాడుతున్నారని అని చెప్పుకొచ్చారు.

మంత్రులు ఆడ్లూరి లక్ష్మణ్, తుమ్మల సైతం అవే వ్యాఖ్యలు!

బీఆర్ఎస్ లో వర్గపోరు మొదలైందని, ఈ నేపథ్యంలోనే హరీశ్ రావు బీజేపీ పెద్దలను కలిసేందుకు ఢిల్లీ వెళ్లారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. హరీశ్ రావు అసలు ఢిల్లీకి ఎందుకు వెళ్లారో జగిత్యాల బహిరంగ సభలో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ సభను కూడా పక్కన పెట్టి అత్యవసరంగా హరీష్ రావుకు ఢిల్లీ వెళ్లాల్సిన అవసరం ఏంటి? అని.. ఇప్పటికే కవిత బీఆర్ఎస్ ను వ్యతిరేకించి పార్టీని వీడారని గుర్తు చేశారు.

2018లో రాజకీయంగా హరీశ్ రావు పరిస్థితి ఏంటి అని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ప్రశ్నించారు. హరీష్ రాజకీయ జీవితం ప్రమాదంలో ఉందన్నారు. పార్టీలో ఆయన మనుగడ కోసం కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నారన్నారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా..ఏడాది తర్వాత కేసీఆర్ సభ పడితే హరీష్ రావు ఢిల్లీకి ఎందుకు వెళ్లారు అని ప్రశ్నించారు.

హరీశ్‌రావు ఢిల్లీ పర్యటన వెనుక రాజకీయ అంతరార్థం ఉందని, పార్టీలో ముసలం మొదలైందని పేర్కొన్నారు. మాజీమంత్రి జీవన్‌రెడ్డి చేరిక హరీశ్‌రావుకు ఇష్టం లేదని, అందుకే కేసీఆర్ సభకు ఆయన గైర్హాజరయ్యారని విమర్శించారు. బీఆర్ఎస్ మునిగిపోయే పడవ అని ఎద్దేవా చేశారు. హరీశ్ రావు భవిష్యత్తు ప్రణాళికలు త్వరలోనే బయటపడతాయని పేర్కొన్నారు.

కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సైతం బీజేపీ నేతలతో కలిసేందుకే హరీష్ రావు రహస్యంగా ఢిల్లీ వెళ్లారనే అనుమానాలున్నాయని ఆరోపించారు. జీవన్ రెడ్డి చేరిక బీఆర్ఎస్ చీలికకు కారణం అవుతున్నట్లు కనిపిస్తోందని, బీఆర్ఎస్ లో జీవన్ రెడ్డి చేరికను హరీష్ రావు వ్యతిరేకిస్తున్నాడని చెప్పారు. కేసీఆర్ ఫాంహౌస్ కు జీవన్ రెడ్డి వచ్చినప్పుడు హరీష్ రావు ఎందుకు వెళ్లలేదు అన్నదని, కేటీఆర్ బతిమాలుకుని జీవన్ రెడ్డి దగ్గరకు హరీష్ రావును జగిత్యాలకు తీసుకెళ్లాడు అని పేర్కొన్నారు. పార్టీలో చీలికకు హరీష్ రావు ప్రయత్నం చేస్తున్నాడు…అందుకే ఢిల్లీ వెళ్లాడనే అనుమానాలున్నాయని అన్నారు. జీవన్ రెడ్డి ని ఐరన్ లెగ్ గా బీఆర్ఎస్ కార్యకర్తలు భావిస్తున్నారని, ఏడాది తర్వాత బయటకు వచ్చి కేసీఆర్ జగిత్యాల సభకు వెళ్తుంటే ఆ సభకు హరీష్ రావు ఎందుకు వెళ్లడం లేదు అని ప్రశ్నించారు.

కాళేశ్వరం కేసు కోసమే ఢిల్లీకి వచ్చాం : ఎంపీ వద్దిరాజు కౌంటర్

కాళేశ్వరం ప్రాజెక్టు కేసుకు సంబంధించి సుప్రీం న్యాయవాదులతో మాట్లాడేందుకు ఢిల్లీ వచ్చాం అని బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవీచంద్ర స్పష్టం చేశారు. హరీశ్ రావు, వినోద్, తాను సుప్రీంకోర్టు న్యాయవాదులతో కాళేశ్వరం కేసులో హైకోర్టు తీర్పు..తదనంతర పరిణామాలపై చర్చించేందుకే ఢిల్లి వచ్చాం అని తెలిపారు. హరీశ్ ఢిల్లీ పర్యటనపై కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం మానుకోవాలి అని రవిచంద్ర కౌంటర్ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి :

‘మిస్ ఇండియా 2026’ విజేత సాధ్వి సైల్
దేశీయ టాయిలెట్ బెస్ట్ : కొణిదెల ఉపాసన క్యాంపెయిన్